Share News

నేటి నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:05 AM

టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మెకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యాజమాన్యం

గుట్ట డిపోలో 95 బస్సులు, 540 మంది కార్మికులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మెకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని 15 రోజులుగా డిపోల ఎదుట కార్మికులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం లో ఆర్టీసీ సంస్థ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్ల తో పాటు వేతన సవరణ, తదితర డిమాండ్లతో పలు దఫాలు జరిగిన చర్చ లు విఫలమైనందున సమ్మె అనివార్యమని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. అయితే సమ్మె విరమణకు ప్రభుత్వం, కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నారని, సమ్మె కొనసాగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సైతం సన్నద్ధంగా ఉన్నామని డిపో అధికారులు పేర్కొంటున్నారు.

గుట్ట డిపోలో 95 బస్సులు

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదగిరిగుట్ట కేంద్రంగా ఆర్టీసీ డిపో ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ డిపోలో 95 బస్సులు ఉండగా, వీటిలో 66 ఆర్టీసీ, 29 ప్రైవేట్‌ బస్సులు నిత్యం 38వేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల నిర్వహణ, తదితర సేవలకు 540 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 160 మంది డ్రైవర్లు, 220 మంది కండక్టర్లు, 100 మంది గ్యారేజీ సిబ్బంది ఉన్నారు. యాదగిరిగుట్ట డిపో నుంచి హైదరాబాద్‌ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడుస్తుండగా, నిత్యం సగటున రూ.20లక్షల ఆదాయం సమకూరుతోంది. ఈనెల మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు, ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే వచ్చే యాత్రీకులకు సైతం బస్సు సౌకర్యం స్తంభించి, ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉంది.

కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం : ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ నేత

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాలను విచ్ఛినం చేసి కార్మికుల సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి అమలు చేయలేదు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్‌సీలను అమలు చేస్తామని మోసం చేసింది. కార్మికులను ప్రభుత్వం రెండు పర్యాయాలు చర్చలకు పిలిచి, ప్రభుత్వం హాజరు కాకుండా కార్మిక సంఘాలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ వైఖరి, మోసపూరిత విధానాలకు విసిగిన కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. అద్దె బస్సుల యాజమానులు బస్సులు నడపకుండా కార్మికుల న్యాయమైన సమస్యలకు మద్దతుగా ఉండాలి. ప్రజలు, ప్రజాసంఘాలు కార్మికులకు అండగా ఉండి సహకరించాలి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: మురళీ కృష్ణ, డిపో మేనేజర్‌, యాదగిరిగుట్ట

ఆర్టీసీలో కార్మికుల సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నాం. డిపోలో ఉన్న 29 అద్దె బస్సుల ద్వారా ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తాం. అదే విధంగా పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతను కండక్టర్లుగా తాత్కాలికంగా నియమించి సర్వీసులు నిర్వహిస్తాం. జిల్లా ట్రాన్స్‌పోర్టు, పోలీస్‌, ఆర్టీసీ కమిటీ ఆధ్వర్యంలో డ్రైవర్లను కూడ ఎంపిక చేస్తాం. సమ్మెకు దూరంగా ఉండే కార్మికులకు పోలీస్‌ భద్రత కల్పిస్తాం. ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశం నిర్వహించాం. న్యాయమైన కోరికలను కార్మికులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరాం. సమ్మె కారణంగా కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని, సమ్మెకు దూరంగా ఉండాలని కోరాం.

Updated Date - Apr 22 , 2026 | 12:05 AM