Share News

ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:41 AM

ఎత్తిపోతల పథకాల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించాలని, లేకుంటే భూములు ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు.

ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించాలి
మోతెలో రాస్తారోకో చేస్తున్న ఎత్తిపోతల పథకాల భూనిర్వాసిత రైతులు

మోతె, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఎత్తిపోతల పథకాల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించాలని, లేకుంటే భూములు ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. వివిధ ఎత్తిపోతల పథకాల కింద భూములు కోల్పోతున్న అన్నారిగూడెం, విభలాపురం, బోడబండగూడెం, రాంపురం తండ, నాగయ్యగూడెం భూనిర్వాసితులు మంగళవారం మోతె మండలకేంద్రంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్నారిగూడెం నుంచి భల్లుతండా వరకు 110 ఎకరాల పరిధిలో 32 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఎత్తిపోతల పథకంతో భూములు కోల్పోతున్నామన్నారు. మార్కెట్‌లో ఎకరానికి రూ.40 లక్షల వరకు ఉంటే ప్రభుత్వం రూ.15 లక్షలు, రూ.23 లక్షలు మాత్రమే చెల్లిస్తామనడం తగదన్నారు. గ్రామసభల్లో రూ.28 లక్షలు ఇస్తామని లిఖిత పూర్వకంగా రాయించుకుని రూ.23 లక్షలే చెల్లిస్తామనడం సబబుకాదన్నారు. అధికారులు, నాయకులు కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎకరం రూ.30లక్షలు చెల్లిస్తేనే భూములిస్తామని తేల్చి చెప్పారు. రైతుల రాస్తారోకోతో కిలోమీటరు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రైతులు స్వచ్ఛందంగా ఆందోళన విరమించారు. ఆందోళనలో రైతులు మైనంపాటి ప్రభాకర్‌రెడ్డి, వీరభధ్రం, మైనంపాటి రాంరెడ్డి, కాంపెళ్లి శ్రీను, అల్లూరి సత్యనారాయణ, వెంకన్న పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చెల్లింపులు

ఎత్తిపోతల పథకాలకు భూములు ఇస్తున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్‌ అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఎత్తిపోతల పథకాల్లో భూములు కోల్పోతున్న రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విభలాపురం, అన్నారిగూడెం గ్రామాల్లో భూముల విలువల ప్రకారం చెల్లింపులు చేస్తామన్నారు. ఏ గ్రామంలో ఎంతమేర విలువలు ఉందో వాటి ఆధారంగా చెల్లింపులు ఉంటాయన్నారు.

అదేవిధంగా బోర్లు, బావులు, పైపులైనల వంటి వాటికి అదనపు ధరలు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఎత్తిపోతల పథకాలకు రైతులు సహకరించాలన్నారు. విభలాపురం, అన్నారిగూడెం, బోడబండగూడెం గ్రామాల రైతుల భూముల ఎకరానికి రూ.23 లక్షలు చెల్లిస్తామనడంతో రూ.30 ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అధికారులతో వాగ్వాదం చేసి వెళ్లిపోయారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకన్న, డీటీ పుష్ప, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:41 AM