రోల్డ్‌గోల్డ్ కొట్టేశాడు.. దొరికిపోయాడు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:40 AM
మహిళ మెడలోని చైనను లాక్కోని పారిపోతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది.
తుర్కపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : మహిళ మెడలోని చైనను లాక్కోని పారిపోతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ తక్యుద్దీన తెలిపిన వివరాల ప్రకారం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బరిగే సుకుణమ్మ సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలకేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చి వీరారెడ్డిపల్లి బస్టాండ్ దగ్గర దిగింది. అదే బస్సులో నుంచి మరో అపరిచిత వ్యక్తి దిగాడు. బస్టాండ్ నుంచి గ్రామం సుమారు కిలోమీటరు దూరంలో ఉంటుంది. కాలినడకన ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. అపరిచిత వ్యక్తి వెంబడిస్తూ ఆమెతో మాట్లాడుతూ మెడపై నుంచి చైన లాక్కొని పారిపోతుండగా ఆమె పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు, కేకలు విన్న గ్రామస్థులు గమనించి అతడిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామస్థులు పట్టుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పెద్దలక్ష్మాపూర్ గ్రామవాసి అని తమ విచారణలో తెలిసిందని ఎస్‌ఐ తెలిపారు. రెండున్నర సంవత్సరాల కిందట హైద్రాబాద్‌కు వచ్చి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలయినట్లు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ క్రమంలోనే అతడు దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. కాగా ఆ మహిళా మెడలోంచి దొంగలించిన చైన బంగారం కాదని, అది రోల్ గోల్డ్ చైన అని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.