Share News

రహదారి విస్తరణ వివాదం

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:19 AM

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం, తూప్రానపేటలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(65 నెంబరు)కి ఆనుకుని ఉన్న భూమి వివాదాస్పదంగా మారింది.

రహదారి విస్తరణ వివాదం
తూప్రానపేటలో జాతీయరహదారి వెంట వివాదాస్పదంగా మారిన రోడ్డు వెంట భూమి

15 ఎకరాల భూమి తమదేనంటున్న 17 మంది రైతులు

ఎప్పుడో సేకరించారంటున్న ఎనహెచఏఐ అధికారులు

లభించని భూసేకరణ రికార్డులు

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం, తూప్రానపేటలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(65 నెంబరు)కి ఆనుకుని ఉన్న భూమి వివాదాస్పదంగా మారింది. భూసేకరణ చేయకుండా, నష్టపరిహారం చెల్లించకుండా 15ఎకరాల పట్టా భూమిని ఎనహెచఏఐ అధికారులు తమదేనంటున్నారని 17మంది రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ఏర్పాటుచేసిన హద్దురాళ్లను 2023 జనవరిలో ఎనహెచఏఐ అధికారులు తొలగించడంతో వివాదం మొదలైంది.

(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్‌ టౌన)

హైదరాబాద్‌-విజయవాడ(ఒకప్పుడు 9వ నెంబరు)హైవే కోసం 1956లో రోడ్డు ఇరువైపులా 65అడుగుల వెడల్పుతో భూసేకరణ చేసి రోడ్డును విస్తరించారు. కానీ ప్రస్తుతం హైవేకు ఇరువైపులా 100 అడుగుల వరకు తమదేనని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎనహెచఏఐ) అధికారులు పేర్కొంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూప్రానపేట సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ కోసం రహదారికి ఇరువైపులా 100అడుగుల మేర భూమి అవసరం ఏర్పడింది. దీంతో రోడ్డు విస్తరణ చేపట్టడంతో వివాదం మొదలైంది. 65అడుగుల వరకు భూసేకరణ జరిగిందని, మిగిలిన 35 అడుగులకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.ఐదేళ్లుగా భూవివాదంపై అధికారులకు రైతులు ఫిర్యాదుచేసినా స్పందన కరువైంది. అయితే భూసేకరణ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని నాయ్‌ వర్గాలు చెబుతున్నాయి.

భూసేకరణ వివరాల్లేవు

హైదరాబాద్‌-విజయవాడ హైవే భూసేకరణ వివరాల కోసం 2022 నవంబరు 22న రైతు కడారి ఐలయ్య సమాచారం చట్టం కింద చౌటుప్పల్‌ ఆర్డీవోకు దరఖాస్తు చేశారు. 2016న అక్టోబరు 11 నుంచి 2022 డిసెంబరు 5వ తేదీ వరకు తూప్రానపేట రెవెన్యూ పరిధిలో హైవే విస్తరణ కోసం భూసేకరణ జరగలేదని ఆర్డీవో కార్యాలయం లేఖ ద్వారా వెల్లడించింది. అదేవిధంగా తూప్రానపేటలో హైవే విస్తరణకు సంబంధించిన భూసేకరణ ఫైల్స్‌ తమ కార్యాలయంలో నమోదు కాలేదని 2022 డిసెంబరు 31న భువనగిరి ఆర్డీవో లేఖ ద్వారా రైతు ఐలయ్యకు తెలిపారు. 1956 సంవత్సరం తరువాత తూప్రానపేట, దండు మల్కాపురం గ్రామాల పరిధిలో హైవే విస్తరణ కోసం భూసేకరణ జరగలేదని రైతులు తెలిపారు.

పనులు చేపట్టడం అన్యాయం

1956లో హైవే కోసం 65అడుగుల మేర భూసేకరణ చేశారు. ప్రస్తుతం 100అడుగుల వరకు పనులు చేపట్టడం దారుణం. 20వ సర్వే నంబరులోని 0-12 గుంటల భూమి(1452 గజాలు)లో నాయ్‌ ప్రతినిధులు పనులు చేయాలని చూస్తున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారంగా నష్టపరిహారం చెల్లించి భూమి తీసుకోవాలి.

దేవరబోయిన బిక్షపతియాదవ్‌, రైతు, తూప్రానపేట

హైవే విస్తరణకు సహకరిస్తాం, కానీ

హైవే విస్తరణకు సహకరిస్తాం. కానీ తాము కోల్పోతున్న భూమికి 2011 చట్టప్రకారంగా నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుతం గజానికి రూ.45 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల రాకపోకలను మెరుగుపర్చేందుకు హైవే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏనుగు జయపాల్‌రెడ్డి, రైతు, తూప్రాన పేట

Updated Date - Mar 20 , 2026 | 12:19 AM