Share News

పాడిరైతులకు ఊరట

ABN , Publish Date - May 13 , 2026 | 12:20 AM

అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన(నార్మూల్‌) మనుగడకు జరుగుతున్న ప్రయత్నాల్లో మంగళవారం కీలక ముందడుగు పడింది.

పాడిరైతులకు ఊరట
నార్మూల్‌ అధికారులకు రూ.10కోట్ల చెక్కు అందజేస్తున్న ఎనడీడీబీ అధికారులు

నార్మూల్‌కు ఎనడీడీబీతో కుదిరిన ఒప్పందం

ఏంవోయూపై ఉన్నతాధికారుల పరస్పర సంతకాలు

నార్మూల్‌కు రూ.10 కోట్ల చెక్కు అందజేత

యాదాద్రి, మే12 (ఆంధ్రజ్యోతి): అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన(నార్మూల్‌) మనుగడకు జరుగుతున్న ప్రయత్నాల్లో మంగళవారం కీలక ముందడుగు పడింది. నార్మూల్‌కు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చి గట్టెక్కడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎనడీడీబీ)కి నార్మూ ల్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించడానికి మంగళవారం హైదరాబాద్‌లో పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. నార్మూల్‌, ఎనడీడీబీ ఉన్నతస్థాయి అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బీర్ల అయిలయ్య సమక్షంలో ఎంవోయూలపై సంతకాలు చేశారు.

నార్మూల్‌కు రూ.10 కోట్ల చెక్కు అందజేత

నార్మూల్‌(మదర్‌ డెయిరీ) నిర్వహణ బాధ్యతలను చేపడుతున్న ఎనడీడీబీ ఎంవోయూలో కుదుర్చుకున్న ప్రకారం మంగళవారం రూ.10 కోట్ల చెక్కును అందజేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో చెక్కును నార్మూల్‌ ఉన్నతాధికారులకు అందజేశారు. మొదటి దఫాగా జారీ చేసిన చెక్కుకు సంబంధించిన నిధులను రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లుల బకాయిల చెల్లింపుల కోసం వినియోగించనున్నారు. నార్మూల్‌ ప్రాథమిక సొసైటీలో పాడి రైతులకు గడిచిన కొద్దిమాసాలుగా దాదాపు రూ.30 కోట్ల పాల బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్లో మొదటి విడతగా ఒకటి, రెండు రోజుల్లో ఆలేరు ప్రత్యేక సమావేశం నిర్వహించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. రెండో దఫాలో పాడిరైతులకు పూర్తిస్థాయిలో బకాయిల చెల్లింపులకు చర్యలు చేపట్టనున్నట్టు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. బిల్లుల బకాయిల కారణంగా ప్రస్తుతం ప్రాధమిక సొసైటీ సభ్యులు తమ పాలను ఇతర సంస్థలకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తున్నారు. బకాయిల చెల్లింపులతో పాటు ఎనడీడీబీ నిర్వహణా భాద్యతల కారణంగా పాడిరైతులు ఎప్పటి మాదిరి నార్మాక్స్‌కు పాలను అందజేసే విధంగా విశ్వాసం కల్పించనున్నట్టుగా పేర్కొన్నారు.

రూ.70 కోట్ల బకాయిలు

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరస్పర సహాయ సహకార యూనియన (నార్మూల్‌) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రూ.70 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం కావడంతో నార్మూల్‌ పాలకవర్గం ఎనడీడీబీ సహకారాన్ని అర్థించింది. అయితే అందుకు ఎనడీడీబీ షరతులతో ముందుకు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు అవసరం కావడంలో ఎనడీడీబీ చైర్మన, నార్మూల్‌ పాలక వర్గం, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించిన తర్వాత పరస్పర ఒప్పందాల మేరకు ఎనడీడీబీకి నార్మూల్‌ నిర్వహణ వ్యవహారాలను అప్పగించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఈమేరకు ప్రస్తుతం నార్మూల్‌కు గల అప్పులను చెల్లించడం ద్వారా పాడిరైతుల మనుగడ సాధనకు అవసరమైన నిబంధనల మేరకు ఒప్పందం కుదుర్చుకుని ముందుకుసాగాలని నిర్ణయించారు. ప్రస్తుతం నార్మూల్‌ రైతులకు పాల బకాయిలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలకు, ఉద్యోగుల వేతన బకాయిలు కలిపి మొతం రూ.70 కోట్ల అప్పుల్లో ఉంది. వీటిలో చిట్యాల సమీపంలోని భూమిని ఎనడీడీబీకి రూ.42కోట్లకు విక్రయించగా, మరో రూ.28 కోట్లను ఎనడీడీబీ అప్పులు, గ్రాంటు రూపేణా నార్మూల్‌కు అందజేయాలని ఒప్పందం కుదిరింది. మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగిన వెంటనే రూ.10 కోట్లను నార్మూల్‌కు అందజేశారు. ఈ నిధులను పాడిరైతులకు మొదటి విడతగా పాల బిల్లుల బకాయిలుగా చెల్లించనున్నారు. రెండో విడతగా బ్యాంకులకు రూ.27కోట్లు బకాయిలు చెల్లింపుల అనంతరం మిగతా నిధులను విడతలుగా అందజేయనున్నారు. ఈ నిధులను పాల బిల్లుల బకాయిలు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సర్ధుబాటు చేయనున్నారు. నార్మూల్‌, ఎనడీడీబీ ఒప్పందం ప్రకారం నార్మూల్‌ ప్లాంటు, పాల ప్రాసెసింగ్‌, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ వంటి కార్యకలాపాలతోపాటు స్వేచ్ఛగా కొత్త ఉత్పత్తులు, విస్తరణ వంటివి ఎనడీడీబీ నిర్వహిస్తుంది. నార్మూల్‌ మాత్రం రెండు జిల్లాల్లో సొసైటీ రైతుల నుంచి పాలను సేకరించి ఎనడీడీబీకి అప్పగించి, అందుకు లీటరుకు రూ.6.50 చొప్పున కమీషనతో పాటు ఏడాదికి రూ.5 కోట్ల రాయల్టీని పొందనుంది, పాల సేకరణ, నిర్వహణా వ్యయం, ఉద్యోగుల వేతనాలు నార్మూల్‌ భరించాల్సి ఉంటుంది. ఎనడీడీబీతో నార్మూల్‌కు జరిగిన ఒప్పందం కారణంగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 50వేల మంది పాడిరైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య‘ ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 12:20 AM