Share News

క్యాన్సర్‌ బాధితులకు ఊరట

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:19 AM

క్యాన్సర్‌ బాధితులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వరంగా మారింది. ఏడాది క్రితం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ చికిత్స కేంద్రంలో ఇప్పటికే 250 మందికి పైగా సేవలు పొందారు. మొదటిసారి హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించుకున్న బాధితులు ఆపై చికిత్సలకు అక్కడికి వెళ్లే అవసరాన్ని ఈ కేంద్రం నివారిస్తోంది. దీంతో సమయంతోపాటు డబ్బు ఆదా అవుతోంది. కార్పొరేట్‌ చికిత్సతోపాటు ఔషధాలను కూడా ఉచితంగా అందజేస్తున్నారు.

క్యాన్సర్‌ బాధితులకు ఊరట

సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్సకేంద్రం

ఏడాదిగా 250 మందికి పైగా సేవలు

ప్రత్యేక సిబ్బంది నియామకం, ఉచితంగా ఔషధాలు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): క్యాన్సర్‌ బాధితులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వరంగా మారింది. ఏడాది క్రితం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ చికిత్స కేంద్రంలో ఇప్పటికే 250 మందికి పైగా సేవలు పొందారు. మొదటిసారి హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించుకున్న బాధితులు ఆపై చికిత్సలకు అక్కడికి వెళ్లే అవసరాన్ని ఈ కేంద్రం నివారిస్తోంది. దీంతో సమయంతోపాటు డబ్బు ఆదా అవుతోంది. కార్పొరేట్‌ చికిత్సతోపాటు ఔషధాలను కూడా ఉచితంగా అందజేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తు లు చికిత్స విషయంలో ఊరటనిస్తోంది. ప్రస్తుతం క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. అయితే క్యాన్సర్‌ కు చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రితో పాటు బసవతారకం ఆస్పత్రికి బాధితులు వెళ్తున్నారు. అయితే అక్కడ చికిత్సపొందిన అనంతరం మలివిడత చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లకుండా సూర్యాపేటలోనే చికిత్స పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏడాది కిందట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్సకోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. అందులో ఎనిమిది బెడ్లు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో మొదట హైదరాబాద్‌లో చికిత్స పొందిన వారికి మలి విడత చికిత్స కోసం మాత్రమే అవకాశం ఉంటుంది. వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో వైద్యులు సూచించిన ప్రకారం సూర్యాపేటలోని ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.

ఏడాదిగా 250 మంది రోగులకు సేవలు

ఏడాదిగా సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని క్యాన్సర్‌ చికి త్స కేంద్రంలో సుమారు 250 మందికి కార్పొరేట్‌ స్థాయిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అందులో వైద్యాధికారి, నలుగురు నర్సులు, ఇద్దరు ఫిజియోథెరఫిస్టులు, అంకాలజిస్టు ఉన్నారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తారు. కొన్నాళ్ల పాటు చికిత్స అందించిన అనంతరం మరోసారి హైదరాబాద్‌లో పరీక్షలకు పంపిస్తారు. వారికి అవసరాన్ని బట్టి కీమోథెరఫీతో పాటు 43 రకాల ఖరీదైన ఔషధాలను ఉచితంగా అందజేస్తున్నారు.

సమయం, డబ్బు ఆదా..

సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ఆస్పత్రిలో క్యా న్సర్‌ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో వ్యాధిగ్రస్తులకు సమయంతో పాటు డబ్బు కూ డా ఆదా అవుతోంది. క్యాన్సర్‌ వ్యాధికి గురైన వా రు ప్రతి రోజూ లేదా రెండు రోజుకోసారి హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స చేయించుకునేందుకు కొన్ని గంటల సమయం కేటాయించాలి. అదేవిధంగా రోగితో పాటు మరొకరు వెళ్లాల్సి ఉంటుంది. కొందరు వ్యాధిగ్రస్తులు బస్సుల్లో వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ప్రైవేట్‌గా వాహనం తీసుకుని వెళ్తున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ చికిత్స కేంద్రం ఏర్పాటుతో రోగులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్‌ వ్యాఽధిగ్రస్తులకు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స పొందేకంటే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందాలి. వ్యాధిగ్రస్తులకు కీమోఽథెరఫీతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిగా సుమారు 250 మందికి వైద్య సేవలందించాం.

- డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌,సూపరింటెండెంట్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, సూర్యాపేట.

Updated Date - Oct 24 , 2026 | 12:19 AM