నియామక ప్రక్రియ తుది అంకానికి
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:39 AM
సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి, పోషకాహార లోపాలను తగ్గించడం, పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్త్రీ, శిశుసంక్షేమశాఖ పూనుకుంది.
భర్తీకానున్న 55 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 24 ఆయా పోస్టులు
టీచర్ల పోస్టులకు 1,102, ఆయాలకు 100 దరఖాస్తులు
ఇంటర్వ్యూలు పూర్తి.. త్వరలో ప్రకటన
మార్గదర్శకాల ప్రకారం మెరిట్‌కే ప్రాధాన్యం
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి, పోషకాహార లోపాలను తగ్గించడం, పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి స్త్రీ, శిశుసంక్షేమశాఖ పూనుకుంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల(ఆయా) పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే ఖాళీలను గుర్తించి ప్రభుత్వ నిబంధనలు, రోస్టర్ ఆధారంగా వాటి భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది.
జిల్లాలో భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ప్రాజెక్టుల పరిధిలో 55 అంగన్‌వాడీ టీచర్లు, 24 ఆయా పోస్టులకు దరఖాస్తు ల తీసుకున్న అధికారులు, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తిచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల కు అనుగుణంగా మెరిట్ అభ్యర్థుల నియామ క ప్రక్రియను జిల్లాస్థాయి సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒకటి, రెండు వారాల్లో పూర్తిచేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
భారీగా దరఖాస్తులు, తీవ్ర పోటీ
జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 55 టీచర్లు, 24 ఆయా పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా, భారీగా దరఖాస్తులు వచ్చాయి. టీచర్ పోస్టులకు 1,101 మంది దరఖాస్తు చేసుకోగా, వీటి స్ర్కూట్నీ అనంతరం 439 మంది అర్హత సాధించారు. ఆయా పోస్టులను షెడ్యూల్ తెగల కు మాత్రమే కేటాయించారు. ఈ పోస్టులకు సైతం 100మంది దరఖాస్తు చేసుకోగా, 61 మంది అర్హులుగా గుర్తించారు. అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది.
తొలిసారిగా ఇంటర్ విద్యార్హతతో..
అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల నియామకానికి విద్యార్హతలను ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి చేయాలని స్త్రీశిశు సంక్షేమశాఖ అర్హతల ను నిర్ణయించింది. అదే విధంగా పోస్టుల భర్తీకి కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకువచ్చింది. ఇంటర్‌లో మార్కుల వెయిటేజ్‌ను ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 70 మా ర్కుల వరకు, వితంతు, ఒంటరి మహిళా అభ్యర్థులకు అదనంగా 5 మార్కులు, అనాథ మహిళకు 10 మార్కుల వరకు వెయిటేజీ ఇచ్చారు. మిగిలిన 10 మార్కులకు మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి, అంగన్‌వాడీ కేంద్ర నిర్వహణా సామర్ధ్యం అంచనా వేసింది. జిల్లాస్థాయిలో ఈ ఇంటర్వ్యూ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, ఆయా అంగన్‌వాడీ పరిధిలోని ఆర్డీవో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సభ్యులుగా ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తిచేశారు.
త్వరలో నియామక జాబితా
జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నోటిఫికేషన్ జారీ చేసి 55 అంగన్‌వాడీ కేంద్రాల టీచర్ల పోస్టులు, 24 సహాయకుల పోస్టులకు ఇంటర్వ్యూలను ఈనెల 17 నుంచి 21వ తేదీ మధ్య పూర్తిచేశారు. 55 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులైన 439మంది అభ్యర్థులకు 408మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 24 ఆయా పోస్టులకు అర్హులైన 61మందిలో 58మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ప్రాజెక్టుల వారీగా ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో 9 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 72 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, 66 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. భువనగిరి ప్రాజెక్టులో మూడు టీచర్ పోస్టులకు 48మంది అర్హత సాధించగా, 45మంది హాజరయ్యారు. మోత్కూరు ప్రాజెక్టు పరిధిలో 31 టీచర్ పోస్టులకు 238మంది అర్హులు కాగా, 220మంది హాజరయ్యారు. రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో 12 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 81మంది అర్హత సాధించగా, 77మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సహాయకుల పోస్టు కోసం ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 7 పోస్టులకు 13మంది అభ్యర్థులు అర్హులు కాగా, 12మంది హాజరయ్యారు. భువనగిరి ప్రాజెక్టు పరిధిలో 13 పోస్టులకు 37మంది అర్హులు కాగా, 35మంది హాజరయ్యారు. రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో నాలుగు సహాయకుల పోస్టులకు 11 మంది అభ్యర్థులు ఇంటర్య్వూలకు హాజరయ్యారు.
మార్గదర్శకాల ప్రకారం మెరిట్‌కే ప్రాధాన్యం
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నారు. అంగన్‌వాడీ పోస్టుల నియామకాలు గతంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల అధ్యక్షతన సెలక్షన్ కమిటీ చేపట్టేది. కానీ ఈసారి ఈ బాధ్యతలను జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీకి అప్పగించింది. అదే విధంగా ఈ నియామకాల్లో ఇంటర్ విద్యార్హతతో పాటు పారదర్శకంగా చేపట్టేలా మార్పులు చేసింది. ఇంటర్ మార్కులు, ఇతర మూడు అంశాల ఆధారంగా వెయిటేజ్ ప్రకారం 90 వరకు మార్కులు, జిల్లా సెలక్షన్ కమిటీని 10 మార్కులకే పరిమితం చేశారు. దీంతో పోస్టుకు నియామక ప్రక్రియలో పారదర్శకతకు అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే గతంలో మాదిరి ఆయా గ్రామాల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులు రాజకీయ ప్రాపకంతో పోస్టుల కోసం ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. ఆయా ఎమ్మెల్యేలు అధికారులకు ఫోన్లు చేసి వారికి అనుకూలమైన అభ్యర్థుల ఎంపికకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ కారణంగా సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. అధికారులు సైతం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే మెరిట్ ప్రాధాన్యం ఆధారంగా నియామకాలు చేస్తామని అభ్యర్థులకు భరోసా ఇస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇంటర్వ్యూలు పూర్తయినందున త్వరలోనే నియామక జాబితా కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
అంగన్‌వాడీ టీచర్ల, సహాయకుల నియామకాలు ఇలా..
ఐసీడీఎస్ టీచర్ వచ్చిన అర్హులైన ఇంటర్యూలకు సహాయకుల వచ్చిన అర్హులైన ఇంటర్యూలకు
ప్రాజెక్టు పోస్టులు దరఖాస్తులు అభ్యర్థులు హాజరైనవారు పోస్టులు దరఖాస్తులు అభ్యర్థులు హాజరైనవారు
ఆలేరు 09 202 72 66 07 40 13 12
భువనగిరి 03 136 48 45 13 49 37 35
మోత్కూరు 31 551 238 220 - - - -
రామన్నపేట 12 213 81 77 04 11 11 11
మొత్తం 55 1,102 439 408 24 100 61 58