పాత ఆటలతో మనోల్లాసం
ABN , Publish Date - May 12 , 2026 | 11:58 PM
డిజిటల్ మాయలో పడి నలుగురితో కలవడం మరచిపోతున్న నేటి తరం పిల్లలు, మొబైల్‌ఫోన్లను పక్కన పెట్టి మట్టి ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు.
వేసవి సెలవులు వస్తే చాలు, ఒకప్పుడు పల్లెల్లో పిల్లల సందడి ఆకాశాన్ని తాకేది. వీధులన్నీ రకరకాల ఆటపాటలతో కిటకిటలాడేవి. కాలక్రమేణా స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్స్ ఆ స్థానాన్ని ఆక్రమించినా ప్రస్తుతం పాత తరం ఆటలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-చింతలపాలెం)
డిజిటల్ మాయలో పడి నలుగురితో కలవడం మరచిపోతున్న నేటి తరం పిల్లలు, మొబైల్‌ఫోన్లను పక్కన పెట్టి మట్టి ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతిర్యాలలోని వేణుగోపాలస్వామి దేవస్థాన ప్రాంగణం ఇప్పుడు బాల్యపు జ్ఞాపకాలను వేదికవుతోంది. లక్ష్యంపై గురి నిలిపే ఆడే గోళీల ఆటను ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా చెట్ల నీడన చిన్నారులు గుంపులుగా చేరి ఆడుతూ కనిపిస్తున్నారు. నేలపై కూర్చుని, అత్యంత ఏకాగ్రతతో ఎదుటి వారి గోళిని గురి చూసి కొట్టే ఈ ఆట పిల్లల్లో పట్టుదలను పెంచుతుంది. ఇది కాలక్షేప ఆట కాదు, కంటికి చేతికి మధ్య సమన్వయాన్ని పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని పెద్దలు చెబుతున్నారు.
మగువలకు ఇష్టమైన గచ్చకాయలు
పాత ఆటల్లో మగువలకు ఇష్టమైన గచ్చకాయలు(అర్చన గిల్లలు) ఆటకు గ్రామీణ బాలికలు తమవంతుగా ప్రాణం పోస్తున్నారు. ముగ్గురు, నలుగురు స్నేహితురాళ్లు కలిసి గచ్చకాయలు ఆడుతూ కాలాన్ని మర్చిపోతున్నారు. చిన్నచిన్న రాళ్లను గాలిలోకి విసురుతూ అవి కింద పడకుండా ఒడిసి పట్టుకోవడం వారి నైపుణ్యానికి, సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో ప్రతివాడలోనూ కనిపించే గిల్లిదండ, తొక్కుడు బిళ్ల వంటి ఆటలు ఇప్పుడు మండలంలోని పాతశోభనాద్రిగూడెం వంటి ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. అంతేగాక గ్రామీణప్రాంతాల్లో మధ్యవయసు రైతులు అష్టాచెమ్మా, జగ్గాడ, పులిజూదం, జాడి వంటి ఆటలు రచ్చబండలపై కాలక్షేపంకోసం ఆడుతూ ఉంటారు. ప్రస్తు తరుణంలో పాతఆటలు మనసుకి ఉల్లాసం కలిగించడమే కాకుండా, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. నలుగురితో కలిసి ఆడటం వల్ల జట్టు కృషి తెలుస్తుందని గ్రామపెద్దలు అభిప్రాయపడుతున్నారు. పాత ఆటలకు పూర్వవైభవం రావడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు. స్థానికంగా అర్చన గిల్లలు ఆడుతున్న బాలికలలో ఒకరు ఇక్కడ వారి మేనత్త ఉండటంతో వేసవికాలం సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ నుంచి వచ్చింది. ఇక్కడ సరదాగా గడపడం కోసం వచ్చి వారి మేనత్త పిల్లలతో ఆడుకుంటోంది.