Share News

ఫాగింగ్‌ యంత్రాల కొనుగోల్‌మాల్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:31 AM

: పల్లెల్లో దోమల తీవ్రత భారీగా పెరిగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. మురుగు కాల్వలు, చెత్తాచెదారం, కంపచెట్లతో పల్లెల్లో దోమల బెడద విపరీతంగా పెరిగింది.

ఫాగింగ్‌ యంత్రాల కొనుగోల్‌మాల్‌
పాత సూర్యాపేటలో దోమల మందు పిచికారీ చేస్తున్న పంచాయతీ సిబ్బంది

30 గ్రామాల్లో పనిచేస్తున్నవి ఐదే

14 పంచాయతీల్లో వాటి జాడే లేదు

ఆత్మకూర్‌(ఎస్‌), ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో దోమల తీవ్రత భారీగా పెరిగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. మురుగు కాల్వలు, చెత్తాచెదారం, కంపచెట్లతో పల్లెల్లో దోమల బెడద విపరీతంగా పెరిగింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పంచాయతీలు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దోమల నివారణకు గ్రామ పంచాయతీల నిధులతో ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశారు. తర్వాత కెమికల్స్‌ తెచ్చి దోమల సీజన్లలో వీధుల వెంట ఫాగింగ్‌ చేసేవారు. అయితే కొన్ని గ్రామాల సర్పంచలు ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయకుండానే డబ్బు కాజేసినట్టు విమర్శలు ఉన్నాయి.

మండలంలోని మొత్తం 30 గ్రామాలకు ఈ యంత్రాలు కొనుగోలు చేయగా, ఐదు గ్రామాల్లో మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అసలు 11 గ్రామాల్లో ఈ యంత్రాలు అందుబాటులో లేవు. అయితే ఫాగింగ్‌ యంత్రాల కొనుగోలు కోసం సుమారు రూ.70వేలు ఆయా గ్రామాల సర్పంచలు డ్రా చేసినట్టు రికార్డుల్లో ఉంది. కొందరు సర్పంచలు పదవీ కాలం ముగిసే సమయంలో ఫాగింగ్‌ యంత్రాలను మరమ్మతులకు తీసుకెళ్లి విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పదవీ కాలం పూర్తికాగానే ఎన్నికలు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల పాలనలో ఈ యంత్రాల గోల్‌మాల్‌ మరుగున పడింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరగ్గా, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అధికారం చేపట్టినా సర్పంచలపై దోమల నివారణ కోసం ఒత్తిడి రావడంతో సర్పంచలు పంచాయతీ కార్యదర్శులను ఫాగింగ్‌ యంత్రాలపై నిలదీశారు. దీంతో కొన్ని గ్రామాల సర్పంచలు పదవీ కాలం ముగిసే సమయంలో యంత్రాలను మరమ్మతుల పేరుతో తీసుకెళ్లినట్టు వెలుగుచూసింది. దీంతో సర్పంచలు మండలంలో పనిచేస్తున్న ఫాగింగ్‌ యంత్రాలతో రోజుకో గ్రామంలో దోమల నివారణ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే ఫాగింగ్‌ యంత్రాలు కొనుగోలు చేసినట్లు ఉండటంతో ప్రస్తుత సర్పంచలకు కొత్త యంత్రాలు కొనుగోలు చేసే వీలు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

ఆర్థిక సంఘం నిధుల నుంచి

పంచాయతీలకు ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో మాజీ సర్పంచలు, ప్రత్యేక పాలన సమయంలో పారిశుద్ధ పనులు చేశామని నిధుల కోసం పోటీపడడంతో ఫాగింగ్‌ యంత్రాల గోల్‌మాల్‌ తెరపైకి వచ్చింది. మాజీ సర్పంచలు 2023-2024లో కొన్ని పనులు చేశామని, ఆ నిధులు తమకే రావాలనిఇ అఽధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయకుండానే డబ్బు కాజేశారని, వీధి లైట్ల పేరుతో లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని నూతన సర్పంచలు పేర్కొంటున్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఒక్కసారి వీధి లైట్లు ఏర్పాటుచేసి ముగ్గురు కార్యదర్శులు లక్షల రూపాయల బిల్లులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, బిల్లులు ఇవ్వవద్దంటూ గ్రామస్థులు ఇటీవల ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

కోట్ల రూపాయలు దుర్వినియోగం

గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు, ఫాగింగ్‌ యంత్రాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయి. అధికారంలో ఉన్న నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచలు, వార్డు సభ్యులు, ఉపసర్పంచలు, అధికారులు ఇష్టానుసారంగా వీధిలైట్లు వేసినట్లు గతంలో వేసిన లైట్లకే బిల్లులు చేసి లక్షల రూపాయలు దండుకున్నారు. అధికారులు విచారణ నిర్వహించి నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.

మడ్డి మల్లే్‌షగౌడ్‌, రామన్నగూడెం గ్రామస్థుడు

కొనుగోలు చేయని వారిపై చర్యలు

దోమల నివారణ కోసం గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారని, ఎక్కడైనా కొనుగోలు చేయనట్టు తేలితే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. ఫాగింగ్‌ యంత్రాలకు మరమ్మతులు చేయించకుండా, దోమల నివారణ చర్యలు చేపట్టని వారిపై సైతం చర్యలు తీసుకుంటాం.

హసీం, ఎంపీడీవో

Updated Date - Feb 21 , 2026 | 12:31 AM