Share News

ప్రజాభిప్రాయ సేకరణ మొక్కుబడిగా

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:57 AM

వీర్లపాలెంలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ఇథనాల్‌ పరిశ్రమకు అనుమతుల కోసం శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ మొక్కుబడి తంతుగా ముగిసింది.

ప్రజాభిప్రాయ సేకరణ  మొక్కుబడిగా

భారీగా పోలీ్‌సబలగాల పహారా

మధ్యాహ్నానికే ముగించడంపై ప్రజాసంఘాల నాయకులు, స్థానికుల నిరసనలు

హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ/మిర్యాలగూడ/దామరచర్ల) : వీర్లపాలెంలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ఇథనాల్‌ పరిశ్రమకు అనుమతుల కోసం శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ మొక్కుబడి తంతుగా ముగిసింది. ఉదయం 10.30గంటలకు ఆర్డీవో రమణారెడ్డి అధ్యక్షతన మొదలైన అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని అధికారులు మధ్యాహ్నం 1గంటకే ముగించారు.

ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు కొందరికి మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చింది. కొందరు పర్యావరణ, సామాజికవేత్తలు, స్థానిక రాజకీయపార్టీల ప్రతినిధులు మాట్లాడా, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వారి అభ్యంతరాలు, సూ చనలు తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నభోజన విరా మ సమాయానికే అభిప్రాయసేకరణను ముగించారు. ఇం కా కొందరు మాట్లాడాల్సి ఉందని, ఏకపక్షంగా ఎలా ముగిస్తారని ప్రశ్నించినా, పట్టించుకోకుండా ఎవరైనా అభ్యంతరా లు, అభిప్రాయాలను తెలియజేయదల్చుకుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆర్డీవో ప్రకటించారు. మరోవైపు ప్రజాభిప్రాయసేకరణను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న స్థానిక యువకులు 18న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, 19న దాన్ని పరిశీలించిన హైకోర్టు, ప్రజాభిప్రాయసేకరణలో పాల్గొని పిటిషన్‌దారులు అభ్యంతరాలు, సందేహాలను తెలియజేయాలని సూచించింది. అయితే పిటిషన్‌ దాఖలు చేసి న యువకులు నేనావత్‌ సిపాయినాయక్‌, అల్లం నాగరాజు, రమావత్‌ వినోద్‌కుమార్‌, ఆంగోతు బాలు, గుంజ రామ య్య, రూపావత్‌ సైదాను పోలీసులు గురువారం రాత్రే అ దుపులోకి తీసుకొని వాడపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అభిప్రాయసేకరణ కార్యక్రమం ముగిశాక వారిని విడుదల చేయడంతో వీరి అభిప్రాయాలేవీ నమోదు కాలేదు.

భారీగా పోలీసుల మోహరింపు

ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు అడ్డుకుంటారనే సందేహంతో, ఎలాగైనా ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో భా రీ సంఖ్యలో పోలీసులను మోహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్‌ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రజల గొంతు లు నొక్కి, పోలీసు బలగాల ను మోహరించడం ప్రజాస్వామ్యంలో ఎం తవరకు సమంజసమనే విమర్శలు వస్తున్నాయి. తాళ్లవీర్పగూడెం మొదలు వీర్లపాలెం గ్రామం వరకు, ప్రధాన రహదారి నుంచి పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతం వరకు ఉన్న స్థానిక లింక్‌రోడ్డుపైనా పో లీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హజరయ్యే వాహనాలను, అందులోని వారి వివరాలను పరిశీలించిన తర్వాతే అనుమతించారు. వేదిక వద్ద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు.

స్వేచ్ఛాయుత వాతావరణం ఏదీ?

వీర్లపాలెంలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ను రద్దు చేసి, తిరిగి స్వేచ్ఛాయుత... వాతావరణంలో నిర్వహించాలని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ప్రజాభిప్రాయసేకరణ వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థులకు, ప్రజా సంఘాల ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని, పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా సాగిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నిబంధనలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. పరిశ్రమ ఏర్పాటుతో కలిగే లాభనష్టాలు, పర్యావరణ ప్రభావాలు, ప్రజల ఆరోగ్యంపై పడే పరిణామాల గురించి గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు, వారి అభ్యంతరాలు, అభిప్రాయాలు వినాల్సి ఉన్నా, వీటన్నింటికీ తిలోదకాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఆరుగురు యువకులను ముందుగానే అరెస్టు చేయడం అప్రజస్వామికమన్నారు. ప్రజా సంఘాలకు చెందిన కార్యకర్తలు ముందుగానే పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ వారికి మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు, వాయు, జల కాలుష్యంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానంపై తీవ్రప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు, మిర్యాలగూడ డివిజన్‌ అధికారులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కంపెనీకి అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడించడంపై నిరసన ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను తిరస్కరిస్తున్నామని, దాన్ని వెంటనే రద్దు చేయాలని, ఇథనాల్‌ పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్‌ చేశారు. నిరసనలో రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ కన్నెగంటి రవి, తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కో కన్వీనర్‌ కే.రవిచంద్ర, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, హరి, హెచ్‌ఆర్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వీరస్వామి, సంజీవ్‌, వెంకటరమణ, జన సమితి నాయకుడు నాగేశ్వరరావు, బి.రామయ్య, కిరణ్మయి, రమణారెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకుడు సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.

చెప్పుకోవాలంటే బాధేస్తోంది..

ప్రజల ఆప్యాయతలకు దూరమవుతున్న

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ ఆవేదన

మిర్యాలగూడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చెప్పుకోవాలంటే బాధేస్తోంది.. రాజకీయాల్లోకి వచ్చి తప్పుచేశామా అని అనిపిస్తోంది.. అని ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వీర్లపాలెం వద్ద జరిగిన ఇథనాల్‌ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చెప్పింది చేయకపోతే ప్రజలకు నాయకులపై నమ్మకం పోతుందని అన్నారు. వైటీపీఎస్‌ నిర్మాణంలో నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి సీఎ్‌సఆర్‌ నిధులను కూడగట్టుకుని పవర్‌ప్లాంట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే మూతపడే దశలో ప్రజాప్రభుత్వం తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి పనులు పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకువచ్చిందన్నారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిత్యం తనవద్దకు వచ్చి రైతులు ఉద్యోగాల గురించి అడుగుతున్నారని, వారి ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. సేవా కార్యక్రమాల్లో ఉన్న తాను రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానా? అనే భావన కలుగుతోందని అన్నారు. గతంలో ఆపాయ్యంగా పిలుచుకున్న ప్రజల దూరమవుతున్నాననే ఆవేదన కలుగుతోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇప్పటికే వైటీపీఎ్‌సలో 450 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. సీఎ్‌సఆర్‌ ఫండ్‌ను గ్రామాభివృద్ధికి ఖర్చుచేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోనవారికి ఉపాధి కల్పించే విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ఎత్తిపోతల నిర్మాణానికి సహకరించాలి

ఎమ్మెల్సీ కేతావత్‌శంకర్‌నాయక్‌

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే స్థలం నుంచే ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ల ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం సహకరించాలని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తికాకుండా నిలిచిన ఎత్తిపోతల పథకాలను ప్రజాప్రభుత్వం బాధ్యతగా తీసుకొని, వాటి పూర్తికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీర్లపాలెం-2, బొత్తలపాలెం ఎత్తిపోతలను పూర్తిచేస్తామని, దున్నపోతులగండి పనులు 80శాతం పూర్తయినట్లు వెల్లడించారు. అన్నమేరు వాగుపై వీర్లపాలెం-2 ఎత్తిపోతలపథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పూర్తిచేస్తామన్నారు. అందుకు ఇథనాల్‌ పరిశ్రమ యాజమాన్యం పూర్తి సహకారం అందించాలని కోరారు. పరిశ్రమ కాలుష్య నివారణ చర్యలు చేపట్టి పచ్చదనాన్ని, పర్యావరణాన్ని రక్షించేలా చూడాలని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:57 AM