Edula-Dindi works: ఏదుల-డిండి పనుల పురోగతిపై ముందడుగు
ABN , Publish Date - May 09 , 2026 | 12:21 AM
డిండి ఎత్తిపోతల పథకం పనుల ను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిం చింది.
శాసనమండలి చైర్మన్ గుత్తాతో కలిసి మంత్రి ఉత్తమ్ సమీక్ష
మినిమం డ్రాలెవల్‌పై నిర్ణయానికి సూచన
15లోగా పోతిరెడ్డిపల్లి బ్యారేజీ పనులకు పరిపాలనానుమతులకు ఆదేశం
వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా సూచనలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ):డిండి ఎత్తిపోతల పథకం పనుల ను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిం చింది. ఈ ఎత్తిపోతల పథకానికి నీటి సోర్స్ అయిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించేందుకు నిర్దేశించా ల్సిన ‘మినిమం డ్రా లెవల్’ పై ఇంజనీర్లు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రనీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మినిమం డ్రా లెవల్ అంశంపై తొలుత నిర్థారించిన పాయింట్‌పై నల్లగొండ, పాలమూరు ఉమ్మడి జిల్లాల నడుమ చెలరేగిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఏదుల-డిండి అనుసంధాన ప్రాజెక్టులో కీలకమైన పోతిరెడ్డిపల్లి బ్యారేజీ నిర్మాణానికి సైతం ఈ నెల 15లోగా పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డితో కలిసి డిండి, ఎస్‌ఎల్‌బీసీ-ఏఎమ్మార్పీ పనులపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి ఈ కీలకమైన ఆదేశాలివ్వడంతో డిండి ఎత్తిపోతల పనుల్లో వేగం పెరుగుతుందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.
వివాదానికి కారణమైన మినిమం డ్రా లెవల్ పాయింట్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, 228 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరిచ్చే డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు 2025 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 10 విడుదల చేసింది. దీని ప్రకారం రూ.1800 కోట్లతో ఏదుల-డిండి అనుసంధాన ప్రాజెక్టుకు అంచనా వ్యయం నిర్ధారించారు. ఈ పనులను ఎలా చేపట్టాలనే అంశంపైౖ క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరి 6న నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ నేతృత్వంలోని తనిఖీ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకంలోని శివన్నగూడెం రిజర్వాయర్ వరకు నిర్మించే ప్రధాన కాల్వ 21.643 కిలోమీటర్ల వద్ద బెడ్‌లెవల్‌కి, ఏదుల రిజర్వాయర్‌లో తొలుత ప్రతిపాదించిన నీటిమట్టం ప్రకారం ఉండాల్సిన నీటిమట్టానికి మధ్య 4.9మీటర్ల వ్యత్యాసం ఉంటుందని నివేదికలో పేర్కొన్న ఈఎన్‌సీ కమిటీ, దీన్ని దృష్టిలో ఉంచుకొని డిండికి నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్ వద్ద 440మీటర్ల లెవల్స్‌ని నిర్ధారించాలని సిఫార్సు చేసింది.
సిఫారసులపై వివాదం..
వాస్తవానికి తొలుత పాలమూరు-రంగారెడ్డిలో భాగమైన వట్టెం రిజర్వాయర్‌కు ఏదుల రిజర్వాయర్ నుంచి 436.40 మీటర్ల నుంచే నీటి డ్రాలెవల్‌ని నిర్ధారించారు. అయితే తాజా సిఫార్సుల ప్రకారం ఇటు డిండితో పాటు, అటు వట్టెంకు సైతం 440 మీటర్ల లెవల్‌కు రిజర్వాయర్‌లో నీరు చేరాకే నీటిని తరలించాలని సూచించడంతో డిండి ఆయకట్టు రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఏదుల రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 445 మీటర్ల వద్ద 6.59 టీఎంసీల గరిష్ట నీటినిల్వ ఉంటుంది. 440 మీటర్ల మట్టం వద్ద 4.16 టీఎంసీలు, 437 మీటర్ల వద్ద 3.04 మీటర్లు, 436 వద్ద 2.72టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. డిండికి డ్రాలెవల్‌ని 440కి మారిస్తే దిగువన 437నుంచి వట్టెంకు నీటి సరపరా జరుగుతుందని, దీంతో డిండికి రోజుకు 6వేల క్యూసెక్కులకు బదులు 1,500క్యూసెక్కుల నీరే వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకారం నీటిని సేకరిస్తే మొత్తం 60 వరదరోజుల్లో గరిష్టంగా ఏడు, ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే వస్తుందనే వాదన డిండి రైతాంగం నుంచి, ఇక్కడి రాజకీయనేతల నుంచి వెలువడుతోంది. ఇరిగేషన్ తనిఖీ కమిటీలో ఉన్న సెంట్రల్ డిజైన్స్ విభాగపు అఽధికారి కుట్రపూరితంగానే తెరమీదకు తెచ్చిన ఈ సిఫార్సుని, ఈఎన్‌సీ సైతం యథావిధిగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడంతో ఆందోళనలు తలెత్తాయి.
జిల్లా స్థాయి సమీక్షలోనూ..
డిండి ఆయకట్టు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మార్చిలో నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలోనూ డ్రాపాయింట్ లెవల్స్ సిఫారసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం దీనిపై మాట్లాడుతూ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి డిండి ఆయకట్టుకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై అటు పాలమూరు-రంగారెడ్డి ఆయకట్టు ప్రాంతంలో, ఇటు డిండి ఆయకట్టు ప్రాంతంలో వివాదాలు చెలరేగుతుండటం, ఈ అంశంపై రాజకీయం నెలకొనడంతో దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మంత్రి ఉద్యుక్తులయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 7న నాటి సమీక్షలో ఏదుల లో కనీస నీటిమట్టం ఎంతవరకు ఉంటే, డిండికి నీటిని తీసుకోవడానికి ఇబ్బందిలేకుండా ఉంటుందనే అంశంపై పరిశీలన జరిపి తుదినిర్ణయం తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతస్థాయి అధికారులు, ఇంజనీర్లకు ఆదేశాలివ్వడంతో ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.