Share News

కొనుగోలు కష్టాలు.. రోడ్లపైనే ధాన్యం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:29 AM

కేతేపల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కష్టనష్టాలు ఓర్చి యాసంగిలో రైతులు పండించిన యాసంగి వరి పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ఆందోళనతో రైతులు నాలుగైదు రోజుల తర్వాత కోయాల్సిన పంటను ముందుగానే యంత్రాల సాయంతో కోస్తున్నారు.

 కొనుగోలు కష్టాలు.. రోడ్లపైనే ధాన్యం

ఆకాశంలో మబ్బులతో ఆందోళన

కేతేపల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కష్టనష్టాలు ఓర్చి యాసంగిలో రైతులు పండించిన యాసంగి వరి పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ఆందోళనతో రైతులు నాలుగైదు రోజుల తర్వాత కోయాల్సిన పంటను ముందుగానే యంత్రాల సాయంతో కోస్తున్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో రహదారులపై పోసి ఆరబెడుతున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ఆయకట్టుతో పాటు ఆయకట్టేతర గ్రామాల్లో రైతులు ప్రతి యాసంగిలో 20వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. విక్రయానికి ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో మండలంలోని కాసనగోడు, గుడివాడ, ఇప్పలగూడెం, చీకటిగూడెం, కొత్తపేట, కొప్పోలు, తుంగతుర్తి, కొర్లపహాడ్‌, భీమారం, కొండకిందిగూడెం, బొప్పారం గ్రామాలతో పాటు నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, ఏఎమ్మార్పీ, మూసీ కాల్వలకు సాగునీటి విడుదలతో ఆయకట్టు గ్రామాల్లో, వ్యవసాయ బావులు, బోర్ల సాయంతో ఆకట్టేతర గ్రామాల్లో రైతాంగం యాసంగిలో 20వేల పైచిలుకు ఎకరాల్లో పంట సాగుచేశారు. ఏడు వేల ఎకరాల పైచిలుకు సన్నరకాలు, మరో 12వేల ఎకరాల్లో దొడ్డురకాలు సాగు చేశారు. వారం రోజులుగా వరి కోతలు సాగుతున్నాయి. పంట దిగుబడి చేతికి వస్తున్నా మండలంలో ఎక్కడా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ధాన్యం విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పంట కోత కోసిన కొందరు రైతులు ధాన్యాన్ని నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు ప్రభుత్వ మద్దతు ధర, సన్న రకాలకు బోనస్‌ లభిస్తుందన్న గంపెడంత ఆశతో ధాన్యాన్ని గ్రామాల్లోని రోడ్లపై పోసి ఆరబెడుతున్నారు. ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో కొందరు రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐకేపీ కేంద్రాల ఏర్పాటు ఉందా..? లేదా.. అనేది తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు.

ఆదేశాలు అందగానే కేంద్రాలు ప్రారంభిస్తాం

ఐకేపీ ఆద్వర్యంలో నాలుగు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. అధికారుల నుంచి ఆదేశాలు అందగానే ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపడతాం.

ఫ వి. మల్లేష్‌, ఐకేపీ ఏపీఎం, కేతేపల్లి

అధికారికంగా ఆదేశాలు అందలేదు

సొసైటీ ద్వారా మండలంలోని ఆరు గ్రామాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోళ్లపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందగానే కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తాం.

పీఏసీఎస్‌ సీఈవో, నర్సయ్య కేతేపల్లి

Updated Date - Mar 30 , 2026 | 12:29 AM