Share News

పాలకవర్గానికి సమస్యల స్వాగతం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:29 AM

దినదిన ప్రవర్ధమానమవుతున్న యాదగిరిగుట్ట పట్టణం పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది.

పాలకవర్గానికి సమస్యల స్వాగతం
అపంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన సముదాయ నిర్మాణ పనులు

యాదగిరిగుట్ట రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : దినదిన ప్రవర్ధమానమవుతున్న యాదగిరిగుట్ట పట్టణం పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది. టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉంది. రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు నర్సింహస్వామి దివ్య క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు. హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉండడం.. గుట్ట ఆలయ పునరుద్ఘాటన జరగడం భక్తుల రద్దీని మరింత పెంచింది. ఈ తరుణంలో పట్టణంలో వసతుల కల్పన, భక్తులకు సదుపాయాల కల్పనకు మునిసిపాలిటీ చర్యలు చేపట్టాల్సి ఉంది. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో నూతన పాలకవర్గానికి యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు పాత సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రధానంగా యాదగిరిగుట్ట పట్టణంలో రూ.5కోట్లతో పాతగుట్ట రోడ్డు విస్తరణ నిర్మాణం, అండర్‌ డ్రైనేజ్‌ పనులు, పాతగుండ్లపల్లిలో రూ.2.50కోట్లతో చేపట్టిన శ్మశాన వాటిక పనులు నిధులు లేక నిలిచాయి. అంగడి బజార్‌లో గత ప్రభుత్వం రూ.2.5కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేడెట్‌ మార్కెట్‌ యార్డు, కేంద్ర ప్రభుత్వం అమృత్‌ స్కీమ్‌ పథకం ద్వార రూ. 33కోట్లతో పట్టణంలో ద్వార చేపట్టిన ఓహెచ్‌ఆర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకు కట్టడాలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం స్థానిక వైకుంఠ ద్వారం ఎదుట రూ.7కోట్లతో అనాలోయిన నిర్ణయాలతో నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి తొలగింపు, యాదగిరిపల్లి ఎస్సీ కాలనికీ వెళ్తే రోడ్డు పక్కన రూ. 5కోట్లతో నిర్మించే ప్రమాదకరంగా మారిన వరద కాల్వ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీవార్డులో సీసీరోడ్లు, అండర్‌ డ్రైనేజ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. కొత్తగుండ్లపల్లి గ్రామంలో రూ.5లక్షలతో చేపట్టబోయే ఓపెన్‌ జిమ్‌, కొత్తగుండ్లపల్లిలో నూతన వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం, ఎస్సీ కాంప్లెక్సె వెనుకలో ఉన్న మునిసిపాలిటీ శిథిలమైన వాటర్‌ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. పట్టణంలో ఉన్న మూడు పబ్లిక్‌ పార్కుల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగింత, అమృత్‌ స్కీమ్‌ ద్వారా చేపట్టిన పైపులైన్లు పూర్తిచేయాల్సి ఉంది. ధ్వంసమైన సీసీరోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇలా అనేక సమస్యలను నూతన కార్యవర్గం పరిష్కరిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా

-మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వాణీభరత్‌గౌడ్‌, యాదగిరిగుట్ట

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య సహకారంతో యాదగిరిగుట్ట మునిసిపాలిటీని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా. నిలిచిన అభివృద్ధి పనులన్నింటినీ అంచెలవారీగా పూర్తిచేస్తా. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. పాతగుట్ట రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయిస్తా. యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. వార్డులన్నింటిలో రోజూ పర్యటించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తా.

Updated Date - Feb 18 , 2026 | 12:29 AM