Share News

వానాకాలం సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - May 24 , 2026 | 11:56 PM

వానాకాలం సీజన్‌ సాగుకు వ్యవసా య శాఖ సన్నద్ధమవుతోంది. యాసం గి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరులో ముగుస్తుండటంతో వచ్చే సీజన్‌కు ఏర్పాట్లలో నిమగ్నమైంది.

వానాకాలం సాగుకు సన్నద్ధం

ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు

6.40లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

ఎరువులకు పనిచేయని యాప్‌

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): వానాకాలం సీజన్‌ సాగుకు వ్యవసా య శాఖ సన్నద్ధమవుతోంది. యాసం గి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరులో ముగుస్తుండటంతో వచ్చే సీజన్‌కు ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరో 10 రోజుల్లో రైతులు నార్లు పోస్తారు. ఇప్పటికే భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ఎరువులు, విత్తనాలు ఎంత అవసర మో అంచనాకు వచ్చారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 6.40లక్షల ఎకరాల్లో సాగు చేయనుండగా, 5 లక్షల ఎకరాల్లో వరి, 90వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనాలో ఉన్నారు.

యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 20శాతం కొనుగోళ్లు పూర్తిచేయాల్సి ఉంది. 4.10లక్షల మెట్రిక్‌ టన్నులకు ఇప్పటివరకు 3.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు కురవకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు ముగుస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 6.40లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందులో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి, 90వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవేకాక కంది, పెసర, మినుములు, వేరుశనగ పంటలు కొద్ది మొత్తంలో సాగు చేయనున్నారు. 15వేల ఎకరాల్లో మిర్చి పంటను ఈ సీజన్‌లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో కందులు 7,500 ఎకరాలు, పెసర 4వేలు, వేరుశనగ 1,200 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా రైతులు ఆసక్తి చూపలేదు. ఎక్కువగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపారు.

కాల్వల పరిధిలో

జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వతో పాటు ఎస్సారెస్పీ, మూసీ కాల్వలు ఉన్నాయి. ప్రధానంగా కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తే వరి ఎక్కువగా సాగు చేస్తారు. అదేవిధంగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో మూసీ, ఎస్సారెస్పీ నీళ్లు వస్తేనే వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మెట్ట పంటలు సాగు చేయనున్నారు.

విత్తనాలు సిధ్దం

జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగు చేసే అన్నిరకాల పంటలకు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. వరి సాగు కోసం 97వేల క్వింటాళ్ల విత్తనాలు, కంది పంట కోసం 180 క్వింటాళ్లు, పెసర పంట కోసం 120 క్వింటాళ్లు, మొక్కజొన్నల పంటల కోసం 6 క్వింటాళ్లు, వేరుశనగ కోసం 360 క్వింటాళ్లు విత్తనాలు సిద్ధం చేశారు. పత్తి పంట కోసం 2.10లక్షలకు పైగా ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు.

1,25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు

జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులు సాగు చేసే పంటలకు అన్ని రకాల ఎరువులు కలిసి 1,25,393 మెట్రిక్‌ టన్నులు అవసరం కానున్నాయి. అందులో యూరియా 60వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 14,580 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 45,250 మెట్రిక్‌ టన్నులతో పాటు ఇంకా పలురకాల ఎరువులు అవసరం కానున్నాయి. అయితే జిల్లాలో ప్రస్తుతానికి 22,143 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉండగా యూరియా 11,800 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 900 మెట్రిక్‌ టన్నులతో పాటు మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి.

పనిచేయని యాప్‌

వానాకాలం సాగుకోసం యూరియా సిద్ధం చేసుకుందామంటే యాప్‌ పనిచేయడంలేదు. యాసంగిలో యూరియా కోసం రైతులు పలు పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద బారులు కట్టారు. ఒక ఎకరానికి నాలుగు బస్తాల యూరియా అవసరం కాగా ముందే యూరియా తీసుకోవడంతో రద్దీ తగ్గుతుందని రైతులు భావించారు. కానీ యాప్‌ పనిచేయకపోవడంతో తీసుకోలేకపోతున్నారు.

రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది: శ్రీధర్‌రెడ్డి, డీఏవో, సూర్యాపేట

యూరియా ముందే తీసుకునేందుకు యాప్‌ పనిచేయడం లేదు. అయితే రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులు లైసెన్స్‌ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలి. అనుమతులు లేని దుకాణాల్లో విక్రయిస్తే కొనిమోసపోవద్దు. రైతులు వ్యవసాయశాఖాధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.

Updated Date - May 24 , 2026 | 11:56 PM