Share News

భూముల విలువ పెంపునకు సన్నాహాలు

ABN , Publish Date - May 07 , 2026 | 11:41 PM

రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ విలువలకు అనుగుణంగా బేరీజు వేస్తూ భూముల విలువను పెం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాంపులు రిజిస్ట్రేషన్లశాఖ అధికారుల నుంచి భూముల ధరల వివరాలు, ఇతర అంశాలను ప్రభు త్వం సేకరించింది.

భూముల విలువ పెంపునకు సన్నాహాలు

ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు

మార్కెట్‌ ధరలతో బేరీజు వేస్తున్న ప్రభుత్వం

పెరగనున్న స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు

నెలాఖరు నుంచి పెంపు వర్తించే అవకాశం?

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ విలువలకు అనుగుణంగా బేరీజు వేస్తూ భూముల విలువను పెం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాంపులు రిజిస్ట్రేషన్లశాఖ అధికారుల నుంచి భూముల ధరల వివరాలు, ఇతర అంశాలను ప్రభు త్వం సేకరించింది. పెంపు విషయంపై ఆ తరువాత వరుసగా వాయిదా వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గతంలో పంపిన మార్కెట్‌ విలువలనే రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. భూముల విలువలు పెంచితే ఈ నెలాఖరు నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా భూములు, ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించి పెంచాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో భూముల విలువ 25 నుంచి 35శాతం లేదా 35 నుంచి 45శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ సరిహద్దులోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి చెం దిన పట్టణ ప్రాంతాల్లో ఒకలా, గ్రామీణ ప్రాం తాల్లో మరోలా భూముల విలువలను సవరించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసా య భూముల ధరలు గణనీయంగా పెరుగు తూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ ధరలతో ప్రభుత్వం బేరీజు వేస్తోంది. రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువలకు, బహిరంగ మార్కెట్‌ విలువలకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని పరిశీలించి, ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈనిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఇళ్లు,ప్లాట్లు కొనుగోలుచేసేవారిపై స్టాంప్‌ డ్యూ టీ, రిజిస్ట్రేషన్‌ భారం పెరగనుంది. కొత్త ధరలు అమలులోకి రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చే సుకోవాలని కొనుగోలుదారులు యోచిస్తున్నారు.

ప్రాంతాల వారీగా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల తో పాటు 73 తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలో భూములు, ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ప్లాట్‌లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. భూముల మార్కెట్‌ విలువలకు రిజిస్ట్రేషన్‌శాఖ అమలు చేస్తున్న విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటే క్రయ, విక్రయదారులపై అధిక భారం పడనుంది. అయితే ఈ రెండు విలువలకు మధ్య వ్యత్యాసం 15శాతం లోపు ఉంటే 2022లో పెంచిన భూముల విలువలనే అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో యథాతథ స్థితి కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు సాగు, సాగేతర భూముల విలువలకు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనుగుణంగా ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో ఏ మేరకు విలువ పెంచాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్కొ దగ్గర మార్కెట్‌ విలువ అధికంగా ఉన్నా, రిజిస్ట్రేషన్‌శాఖలో తక్కువగా ఉంది. వీటన్నింటినీ మరోసారి పరిశీలించి విలువల పెంపునకు తుది నిర్ణయం తీసుకొని ఈనెల 26 నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఆస్తుల కొనుగోలుదారులపై భారం

రాష్ట్ర వ్యాప్తంగా 2022లో భూముల మార్కెట్‌ విలువలు పెరగ్గా, తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి పెంపునకు సమాయత్తమవుతోంది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచనున్నట్టు తెలిసింది. అయితే రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుండగా ఆస్తుల కొనుగోలుదారులపై భారం పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచేందుకు సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఏటా భూముల విలువలను పెంచేందుకు కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు ఆర్థిక సలహాదారులు భూముల విలువ పెంపుపై నివేదిక ఇచ్చారు. మార్కెట్‌ విలువ ఒకేసారి పెంచినా, స్టాం్‌ప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను ఒకేసారి పెంచకుండా మూడు విడతల్లో పెంచనున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు ప్రజలపై ఒకేసారి భారం పడకుండా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను సవరించడానికి నిర్ణయించడంతో ఆస్తుల కొనుగోలుదారులపై భారం తప్పదు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపుకు ముందే భూముల విలువలు పెరుగుతాయని సర్వత్రా భావించినా, ప్రభుత్వం వాయిదా వేసి తాజాగా నిర్ణయం తీసుకుంది. భూముల విలువల పెంపుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఆర్‌ రవీందర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు.

Updated Date - May 07 , 2026 | 11:41 PM