‘పుర’ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:27 AM
మునిసిపల్ ఎన్నికల త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఓవైపు అధికార యంత్రాంగం, మరోవైపు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాయి.
త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరి రెండోవారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
పార్టీల ప్రచారంపై ప్రణాళికలు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మునిసిపల్ ఎన్నికల త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఓవైపు అధికార యంత్రాంగం, మరోవైపు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల సన్నాహాలు కొలిక్కిరావడంతో అనువైన తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. వార్డులు, చైర్మన్లవారీగా రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కమిషన్‌కు లేఖ కూడా రాసింది. ఈ నెల 27వ తేదీన మునిసిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూ ల్ వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. ఎన్నికల సన్నాహల్లో భాగంగా ఎన్నికల సంఘం ఇప్పటికే కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షలు నిర్వహించింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారుల లభ్యత, టీ-పోల్ యాప్‌లో పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్ వంటి అంశాలపై సమీక్ష జరిపింది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో మొత్తం 104 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆలేరు మునిసిపాలిటీ పరిధిలో 12 వార్డులు, భువనగిరిలో 35 వార్డు లు, చౌటుప్పల్‌లో 20వార్డులు, మోత్కూరులో 12వార్డులు, భూదాన్‌పోచంపల్లిలో 13వార్డులు, యాదగిరిగుట్టలో 12 వార్డులున్నాయి. ఈ మేరకు మునిసిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతోనూ ఎన్నికల కమిషన్ చర్చలు జరిపింది. ఫిబ్రవరి రెండోవారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పోలింగ్ ప్రక్రియ ను పర్యవేక్షించేందుకు తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇప్పటికే గుర్తించగా, తొలిసారి కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేయనున్నారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్లో భాగంగా సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెల 19న రాష్ట్రస్థాయిలో 13 మంది మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా శిక్షణ పొందిన మరో 21 మంది ట్రైనర్లు క్షేత్రస్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాస్థాయిలో కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసిన పక్షంలో ఒకే విడతలో జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. జిల్లాలో 763 మంది ప్రిసైడింగ్ అధికారులు, 254 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో మొత్తం 29జోన్‌లు, 29 రూట్‌లను ఏర్పాటుచేశారు. ఆరు మునిసిపాలిటీల్లో మొత్తం 104 వార్డులు ఉన్నాయి. 211 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 446 బ్యాలెట్ బాక్సులు అదనంగా 20శాతం కలుపుకొని సిద్ధం చేశారు. ఆరు ఫ్లయింగ్ బృందాలు, ఆరు సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటుచేశారు. జిల్లాలో 42 సమస్యాత్మక, 11 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి.
ప్రచారంపై ప్రణాళికలు
ఈ ఎన్నికలను అన్ని ప్రధానపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీలు ముఖ్యనేతలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాయి. ఎన్నికలపై అనుభవం ఉన్నవారిని, గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను కూడా కొన్ని చోట్ల ఇన్‌చార్జీలుగా నియమించాయి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చోట్ల ఇన్‌చార్జీలకు సైతం బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అన్ని చోట్ల ఎక్కడికక్కడే ఆయా వార్డులవారీగా బలమైన అభ్యర్థులను గుర్తించి, మూడు నాలుగు పేర్లతో జాబితాలు సిద్ధం చేసుకున్నాయి. అభ్యర్థులనుంచి దరఖాస్తులు సేకరించేందుకు ఓ నమునా దరఖాస్తులను కూడా నేతలకు అందజేసింది. ఇప్పటికే దరఖాస్తుల అందజేత ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులకు బీఫామ్ అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడికక్కడే నిర్వహించేందుకు పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మునిసిపాలిటీల్లో సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యవేక్షణ జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎన్నికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిచేందుకు పార్టీల అధిష్ఠానాలు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పార్టీలోని సీనియర్ నేతలతోపాటు మానిటరింగ్, లీగల్ సెల్ చెందిన వారు అందులో ఉండనున్నారు.