Share News

చేయూతకు కసరత్తు

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:28 AM

చేయూత పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

చేయూతకు కసరత్తు

మొదట ఏడు విభాగాల వారికే

వృద్ధులకు మొండి చెయ్యి

ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ టౌన్‌): చేయూత పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్‌ కోసం నిరీక్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీ కరించి అర్హులను ఎంపిక చేసి సెప్టెంబర్‌లో పిం ఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా ప్రస్తుతం జిల్లాలోని 33 మండలాల పరిధిలో 1,99, 087 మంది చేయూత పింఛన్‌ దారులున్నారు.

జిల్లాలో పెద్దసంఖ్యలో చేయూత పింఛన్‌ కోసం ఐదేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులతో పాటు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన వారికీ పింఛన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో ప్రజాపాలన, మీసేవా కేంద్రాల దరఖాస్తు చేసినవారు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఫార్మట్‌లోనే వివరాలు అందించాలి. గతంలో దరఖాస్తుతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారానికి అందచేస్తే సరిపోతుంది.

2022లో చివరిసారిగా..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరిసారిగా 2022 అక్టోబరులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు దరఖాస్తుదారుల వయస్సు 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించిం ది. అయినా ఇప్పటివరకు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్ని సందర్భంగా అధికారంలోకివస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016 నుంచి రూ.6,016కు ఇతర పింఛన్లు రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచుతామని చెప్పింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఫించన్ల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

ముందుగా ఏడు రకాల వారికే

ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యమిస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులున్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నా వారికి తర్వాత దశలో ప్రాధాన్యమిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయావర్గాలకు చెందిన అర్హులు నిరాశకు గురవుతున్నారు.

ఎక్కడ దరఖాస్తు చేయాలంటే

గ్రామీణ ప్రాంతాలవారు పంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాలవారు మునిసిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్‌డీవో ద్వారా కలెక్టర్‌ పరిశీలనకు పంపి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరితేదీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

అర్హులు సద్వినియోగం చేసుకోవాలి : జే శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీవో, నల్లగొండ.

ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరవుతుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే పంచాయతీ, మండల పరిషత్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారానికి జత చేసి అందిస్తే సరిపోతుంది.

Updated Date - Aug 14 , 2026 | 12:28 AM