Share News

స్వీయ జన గణనకు సన్నాహాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:09 AM

జనగణనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ లో భాగంగా ఇప్పటికే ఇళ్లగణనను చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జనగణన చేపట్టనున్నారు.

స్వీయ జన గణనకు సన్నాహాలు

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 వరకు స్వీయగణన

25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికీ వెళ్లి జనగణన

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

త్వరలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): జనగణనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ లో భాగంగా ఇప్పటికే ఇళ్లగణనను చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జనగణన చేపట్టనున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణనకు కూడా అవకాశం కల్పించింది. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం ఉంది. స్వీయగణనపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేపట్టనున్నారు.

జిల్లాలో నిర్వహించే జనగణనకు అధికార యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఎంపిక చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. స్వీయ గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా స్వీయ గణన అనంతరం ఈ పర్యాయం జనగణన కూడా పూర్తిగా డిజిటల్‌ ప్రక్రియలో చేపట్టనున్నారు.

40 రకాల వివరాలు

త్వరలో చేపట్టే జనగణనకు సంబంధించి ఎన్యుమ రేటర్లు వారికి కేటాయించిన నివాసాలకు వెళ్లి మొ త్తం 40 రకాల వివరాలను సేకరించాల్సి ఉంది. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరు, విద్యార్హత, ఉపాధి, వ్యవసాయం, ఉద్యోగంతో పాటు మరికొన్ని వివరాల ను సేకరించాల్సి ఉంటుంది. జన గణన పూర్తిగా డి జి టల్‌ పద్ధతిలో చేపట్టాల్సి ఉంది. అందుకోసం ప్రభు త్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. ప్రతీ కుటుంబానికి ఒక ఐడీ నెంబర్‌ను కేటాయిస్తారు.

14 రోజుల పాటు అవకాశం

జిల్లాలో జనగణనలో భాగంగా మొదట స్వీయగణనకు అవకా శం కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వెబ్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయి కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉం టుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు విద్యావంతులు, ఇతరులు ఎవరైనా స్వీయ గణనపై అవగాహన ఉన్న వివరాలు నమోదు చేసుకోవచ్చు. వెబ్‌ పోర్టల్‌ను లాగిన్‌ అయి కుటుంబ పెద్ద పేరు, సెల్‌ఫోన్‌ సెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంది. అనంతరం వచ్చే ఓటీపీ ద్వారా గణనకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత వివరాలన్నింటినీ పూర్తిచేసిన త ర్వాత పలు అంకెలతో కూడిన ఒక ఐడీ నెంబర్‌ వస్తుంది. దానిని భద్రపర్చుకోవాల్సి ఉంది. జన గణన కోసం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ నెంబర్‌ను చూపిస్తే వారు వెంటనే అప్రూవల్‌ చేస్తారు. ఒక వేళ స్వీయ గణనలో ఏమైనా తప్పులు నమోదు చేసినా సరి చేసే అవకాశం ఉంటుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది

జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 లక్షల జనాభా ఉంది. అదేవిధంగా ఐదు లక్షల గృహాలు ఉన్నాయి. ఇళ్ల గణన కోసం అధికారులు జిల్లాలో 3 వేలకు పైగా బ్లాకులను ఏర్పాటుచేసి 450 సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నారు. జన గణన కోసం 2,200 మంది ఎన్యుమరేటర్లు, 250 మంది సూపర్‌వైజర్లును నియామకం చేయనున్నారు. వీరందరికి త్వరలో మండలాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 250 నివాసాలను కేటాయించనున్నారు. ఎన్యుమరేటర్లు జనగణన కోసం ఇంటికి వెళ్లిన సందర్భంలో ఆయా నివాసంలో కుటుంబ సభ్యులు లేకుంటే మరోసారి వెళ్లి జనగణన చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా నివాసాలు లేకుండా ఆరు బయటడేరాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసముంటున్న వారి వివరాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి సమయంలో సేకరించేలా ప్రణాళిక రూపొందించారు.

జనగణనకు ఏర్పాట్లు చేస్తున్నాం : తేజ్‌సనందలాల్‌ పవార్‌, కలెక్టర్‌

జిల్లాలోని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ముందుగా స్వీయగణనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వివరాలను జనగణనకు వచ్చే అధికారులకు అందజేస్తే సరిపోతుంది. దేశాన్ని డిజిటల్‌ దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనగణన ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్తిగా డిజిటల్‌ ప్రక్రియలో జన గణన చేపట్టనున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 12:09 AM