Share News

ముమ్మరంగా పొట్టిమర్రి బ్రిడ్జి పనులు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:13 AM

రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి.

ముమ్మరంగా పొట్టిమర్రి బ్రిడ్జి పనులు
బ్రిడ్జి నిర్మాణంకోసం యంత్రాలతో కొనసాగుతున్న తవ్వకం పనులు

రాజాపేట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి. వాగులో పిల్లర్లు వేసేందుకు ఇసుక, మట్టిని తొలగిస్తున్నారు. గతంలో బాక్స్‌ బ్రిడ్జి నిర్మాణంకోసం రూ.4.5కోట్లు మంజూరయ్యాయి. అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టలేదు. కాగా రెండేళ్లుగా బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గంధమల్ల చెరువు నిండడంతో వాగులో ప్రవాహం పెరుగడంతో రాజాపేట-యాదగిరిగుట్ట, కొమురవెళ్లి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. 10కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కాగా ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంకోసం 6 కోట్ల రూపాయలు మంజూరు కాగా 2025 జూన6వ తేదీన తుర్కపల్లి మండలం తిరుమలాపూర్‌లో సీఎం రేవంత రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పనులకు శంకుస్థాపన చేశారు. 12 రోజులుగా యంత్రాలతో పనులను నిర్వహిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాజాపేట మండల ప్రజల కష్టాలు తీరుతాయి. యాదగిరిగుట్ట-కొమురవెళ్లికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి.

ప్రజల కష్టాలు తీరుతాయి

మెండు రత్నమాల, సర్పంచ, బసంతాపూర్‌

రాజాపేట మండలంం పొట్టిమర్రి వాగుపై బ్రిడ్జి లేక పోవడంతో గత మూడునాలుగేళ్లుగా మండల ప్రజలు, యాదగిరిగుట్ట-కొమురవెళ్లి వెళ్లే స్రయాణికులు, భక్తులు ఇబ్బందులు పడ్డారు. గంధమళ్ల చెరువు నిండి పారడంతో వరద ఉధృతితో రెండు,మూడు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. పనులు పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయి.

Updated Date - Feb 26 , 2026 | 12:13 AM