ప్చ్.. ఇటువైపు రైలుమార్గం కలేనా?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:47 AM
దినదినాభివృద్ధి చెందుతోన్న సూర్యాపేట పట్టణానికి రైల్వేమార్గం చిరకాలవాంఛ. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఈ పట్టణం ఉంది. జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ ప్రాంత ప్రజలకు రైల్వేమార్గం తీరనికోరికగా మిగిలిపోతోంది.
సూర్యాపేటకు మరోసారి మొండిచేయి
ఫిబ్రవరిలో సూర్యాపేట మీదుగా చైన్నెకి ప్రతిపాదన
తాజాగా కొత్త అలైన్‌మెంట్ 8 మాల్, హాలియా, దాచేపల్లి మీదుగా చైన్నెకి..
రైలుమార్గం కోసం ఉద్యమబాటన అఖిలపక్షాలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్): దినదినాభివృద్ధి చెందుతోన్న సూర్యాపేట పట్టణానికి రైల్వేమార్గం చిరకాలవాంఛ. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఈ పట్టణం ఉంది. జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ ప్రాంత ప్రజలకు రైల్వేమార్గం తీరనికోరికగా మిగిలిపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా చైన్నెకు బుల్లెట్ రైలుమార్గంపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటన అటకెక్కింది. తాజాగా మా ల్,మల్లేపల్లి, దాచేపల్లి మీదుగా చైన్నెకి నూత న మార్గానికి పచ్చజెండా ఊపారు. దీంతో సూర్యాపేట ప్రజల రైలుమార్గం ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో అఖిలపక్షాల నాయకులు రైలుమార్గం కోసం ఉద్యమబాట పట్టారు.
సూర్యాపేటకు రైల్వేమార్గం కలగానే మిగలనుం దా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతం లో సూర్యాపేటకు వివిధమార్గాల ద్వారా రైల్వేలైన్ ఏర్పాటు చేసేందుకు సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా అవి ఆచరణకు నోచుకోలేదు. పార్లమెంట్ సమావేశాల్లో సూర్యాపేటకు రైల్వేమార్గం గురించి ప్రస్తావన తేవడం, రైల్వేమార్గం ఏర్పాటుకు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం పరిమాటిగా వస్తోంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావే శాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా చైన్నె వరకు హైస్పీడ్ బుల్లెట్ రైల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశం లో మొత్తం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్‌లను ఏర్పాటు చేస్తుండగా అందులో ఇది ఒకటి. ఈ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌ను హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, డ్రైపోర్టు నుంచి నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేట, ఖమ్మం పట్టణాల నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బుల్లెట్ రైల్‌వెళ్లే మార్గాల్లో అనేక పట్టణాలు, వాణిజ్యకేంద్రాలను కలపాలని నిర్ణయించారు. దీనిప్రకారం శంషాబాద్ నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా ప్రస్తుతం ఉన్న జాతీ య రహదారి-65కు సమాంతరంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, నందిగామ, కంచికచర్ల నుంచి అమరావతి వరకు అక్కడి నుంచి చెన్నై వరకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో పాటు సూర్యాపేటలో బుల్లెట్ రైల్ కోసం స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదించారు. కానీ ఇటీవల మరోసారి బుల్లెట్ రైల్ అలైన్‌మెంట్‌ను పూర్తిగా మార్చేశారు. దీని ప్రకారం శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, మాల్, మల్లేపల్లి, హాలియా, వాడపల్లి మీదుగా దాచేపల్లి అక్కడి నుంచి అమరావతి మీదు గా చైన్నై వెళ్లేలా నూతన అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. దీంతో సూర్యాపేట ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.
దూరభారమే కారణమా?
హైదరాబాద్-చైన్నె వరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే హైస్పీడ్ బుల్లెట్ రైల్ అలైన్‌మెంట్‌ను ఇటీవల ప్రభుత్వం మార్చివేసింది. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతి, అక్కడి నుంచి చెన్నై వరకు ఏర్పాటు చేసే కారిడార్ దూరభారం పెరుగుతుందని మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదించిన కారిడార్‌తో 123 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు భూసేకరణ కూడా తక్కువగా అవసరం కానుంది. దీంతో నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తి కావడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల్లో డ్రైపోర్టును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకోసం బుల్లెట్ రైల్‌ను డ్రైపోర్టు ప్రాంతానికి అనుసంధానం చేయడం ద్వారా సరుకుల రవాణా, ఎగుమతులు, దిగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రతిపాదిత డ్రైపోర్టుకు అనుసంధానం, భూసేకరణ సమస్యల పరిష్కారం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అలైన్‌మెంట్‌ను మార్చినట్లు తెలుస్తోంది. జపాన్‌కు చెందిన సెంక్షన్‌సేన్ టెక్నాలజీతో తయారు చేసే ఈ బుల్లెట్ రైల్ వేగం గంటకు 350 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. బుల్లెట్ రైల్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా రైల్వేట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ బుల్లెట్ రైల్ ఏర్పాటైతే హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండేది.
అఖిలపక్షాల ఉద్యమ బాట
సూర్యాపేట ప్రాంతం వాణిజ్య, వర్తక రంగాలకు ఎంతో ప్రసిద్ధి. బుల్లెట్ రైల్ సూర్యాపేట మీదుగా వెళ్తుందనే విషయం తెలియడంతో సూర్యాపేట ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. స్థానికంగా వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతో సంబురపడ్డారు. కానీ అలైన్‌మెంట్ మార్పుతో సూర్యాపేట ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సూర్యాపేట బుల్లెట్ రైల్ సాధన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ద్వారా ఇప్పటికే సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి వారికి వినతిపత్రాలు అందజేయనున్నారు. అనంతరం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్‌కు వినతి పత్రం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సూర్యాపేటకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేసేందుకు సూర్యాపేట బుల్లెట్ రైల్ సాధన కమిటీ కార్యాచరణ రూపొందిస్తోంది.
ప్రభుత్వం పునరాలోచన చేయాలి
హైదరాబాద్-చైన్నె హైస్పీడ్ బుల్లెట్ రైల్ అలైన్‌మెంట్ మార్పు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి. సూర్యాపేట ప్రాంతానికి రైల్వే మార్గం ఎన్నో ఏళ్ల కల. సూర్యాపేట ప్రాంతం నుంచి బుల్లెట్ రైల్ మార్గాన్ని ఏర్పాటుచేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-65పై అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ రహదారికి సమాంతరంగా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం.
ఆరుట్ల జానకిరెడ్డి, సూర్యాపేట బుల్లెట్ రైల్ సాధన కమిటీ కన్వీనర్.