Share News

మర్రిలో తాటి, ఈత చెట్లు

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:43 PM

చెట్టు ముందా విత్తు ముందా అనే చర్చ సహజంగా జరుగుతూనే ఉంటుంది.

మర్రిలో తాటి, ఈత చెట్లు
మర్రిచెట్టుపై మొలిచిన ఈతచెట్టు

రామన్నపేట, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): చెట్టు ముందా విత్తు ముందా అనే చర్చ సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకే మర్రిచెట్టులో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. ఈ మర్రిలోనే ఆదొండ చెట్టు తీగ కూడా ఉంది. ఆదొండతీగ శివుడికి ప్రీతికరమైనదని ప్రతీతి. ఇంతటి ప్రత్యేకత ఉన్న మర్రిచెట్టు రామన్నపేట మండంలోని మునిపంపుల గ్రామంలో ఉంది. ఈ మర్రి చెట్టును పాత కాటమయ్య మర్రి అంటారు. ఇది మునిపంపుల చెరువు అలుగుల సమీపంలో లక్ష్మాపురం వెళ్లే దారిలో ఉంది. ఈ చెట్టు మొదలు భాగంలో కాటమయ్య గుడి (కంఠ మహేశ్వర స్వామి గుడి) ఉంది. గౌడ కులస్థులంతా గతంలో ప్రతీ సంవత్సరం ఇక్కడ బోనాలు సమర్పించేవారు. ప్రస్తుతం కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని వేరే చోట నిర్మించారు. కాగా ఈ మర్రికి ఇంకో ప్రత్యేకత ఉంది. కల్లుగీత కార్మికులు తమ గీసకత్తులను నూరుకోవడానికి ఈ చెట్టు కిందే నెరుసు (కత్తులు నూరడానికి ఉపయోగించే రాతిపొడి) తయారు చేసుకుంటారు. ఈ మర్రి చెట్టు ఎంతోమంది బాటసారులకు మండుటెండలో నీడనిస్తూ సేద దీరుస్తోంది. ఈ చెట్టు కింద పిచ్చి మొక్కలు తొలగించి, మంచినీటి సౌకర్యం, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని బాటసారులు, గీతకార్మికులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:43 PM