పిల్లల భవిష్యత్ లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:07 AM
చదువుకు, భద్రతకు దూరమై జీవనం సాగిస్తున్న చిన్నారుల సంక్షేమం, భవిష్యత్ లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు సాగనుంది. పోలీస్, కార్మిక, బాలలపరిరక్షణ తదిత ర ప్రభుత్వశాఖలు, గుర్తింపు పొందిన స్వ చ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్, లక్ష్య సాధన దిశగా సా గుతోంది.
జిల్లాలో మూడు కేంద్రాలు, మూడు బృందాలుగా కార్యక్రమం
గత ఏడు పర్యాయాల్లో 332మంది బాలకార్మికుల గుర్తింపు
భువనగిరిటౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): చదువుకు, భద్రతకు దూరమై జీవనం సాగిస్తున్న చిన్నారుల సంక్షేమం, భవిష్యత్ లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు సాగనుంది. పోలీస్, కార్మిక, బాలలపరిరక్షణ తదిత ర ప్రభుత్వశాఖలు, గుర్తింపు పొందిన స్వ చ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్, లక్ష్య సాధన దిశగా సా గుతోంది. భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట కేంద్రాలుగా మూడు బృందాలు ఆయా ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పారిశ్రామికవాడలు, వాణిజ్య సముదాయాలు, ఇటుక బట్టీలు తదితర సముదాయాల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఒక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్, మరో ముగ్గురు పోలీసులు, ఒకరు చొప్పున బా లల పరిరక్షణ విభాగం, కార్మికశాఖ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మొత్తం ఎనిమిది మంది ఉంటారు. రోజువారీగా గుర్తించిన బాలకార్మికులను సీడబ్ల్యూసీ ఎదుట ప్రవేశపెడుతూ న్యాయ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ఏడు దఫాలుగా 332మంది
జిల్లాలో 2023 నుంచి 2026 జనవరి వరకు ఏడు పర్యాయాలుగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో 324మంది బాలకార్మికులను గుర్తించారు. వీరిలో 298మంది బాలురు, 34మంది బాలికలు ఉన్నారు. 101 మంది యజమానులపై కేసులు నమోదు చేశా రు. గుర్తించిన 320మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పించారు. తాజాగా, నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్‌లో రెండు రోజులుగా నలుగురు బాల కార్మికులను గుర్తించి సీడబ్ల్యూసీ ఎదుట ప్రవేశపెట్టారు.
చిత్తశుద్ధి చూపితేనే సత్ఫలితాలు
చట్టం ప్రకారం బాలకార్మికులను రెండు కేటగిరీలుగా పరిగణిస్తారు. 14ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయించడం నేరం. 15 నుంచి 18ఏళ్ల లోపు పిల్లలతో ప్రమాదరహిత పనులు చేయించి కనీస వేతనం ఇవ్వవచ్చు. ప్రమాదాలకు అవకాశం ఉన్న చోట పనులు చేయించడం నేరం. అయితే ఆపరేషన్ ముస్కాన్ బృందాలు చిత్తశుద్ధి చూపితేనే సత్ఫలితాలు వస్తాయి. అలాగే ప్రజల సహకారం కూడా అవసరం. బాలకార్మికులను గుర్తించిన వారు ముస్కాన్ బృందాలకు లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. అయితే కొంతకాలంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ గాడి తప్పుతోందని పలువురు పేర్కొంటున్నారు. జనవరిలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో బీబీనగర్‌లో గుర్తించిన బాలకార్మికులను సంరక్షించడం, యజమానులపై చర్యలు తీసుకునే ఉదాంతంలో అవకతవకలపై అక్కడి పోలీ్‌సస్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే కొద్దిమంది సీడబ్ల్యూసీ సభ్యులు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు నిర్వహించిన ఆపరేషన్లలో ప్రైవేట్ వ్యక్తులు పాల్గొని దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలతో పాటు ఫొ టోలు కూడా బహిర్గతమయ్యాయి. క్షేత్రస్థాయిలో గుర్తిం చిన బాలకార్మికులపై కార్మికశాఖ అధికారులు సంఘటన స్థలంలోనే ఇన్‌స్పెక్షన్ రిపోర్టు (ఐఆర్) ఇవ్వాలి. కాగా, అందుకు భిన్నంగా ఇస్తుండటంతో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
పకడ్బందీగా ఆపరేషన్ ముస్కాన్: -అక్షాంశ్‌యాదవ్, ఎస్పీ
బాలకార్మిక వ్యవస్థ, అక్రమ మానవ సరఫరా నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. గుర్తించిన ప్రతీ బాలకార్మికుడికి న్యాయం చేస్తాం. ప్రజలు కూడా భాగస్వాములై బాలకార్మికుల సమాచారం ఇవ్వాలి. పరిశ్రమలు, దుకాణాల యజమానులు బాలలను పనిలో పెట్టుకోవద్దు.
పిల్లలకు విముక్తి: -బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌తో పనిలో ఉన్న పిల్లలకు విముక్తి లభిస్తుంది. ముస్కాన్ ద్వారా బలవంతంగా లేదా కుటుంబ అవసరాల కోసం పనుల్లో చేరిన పిల్లలను గుర్తించి వారి జీవితాలకు భద్రత కల్పిస్తాం. బడిఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలనే ప్రభుత్వ సంకల్పం ముస్కాన్ ద్వారా నెరవేరుతోంది.