బొట్టు.. బొట్టు భద్రపరిస్తేనే..
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:03 AM
వాతావరణంలో అనూహ్యమార్పులు.. ఎల్‌నినో ప్రభా వం.. ముఖం చాటేసిన వరుణుడు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. రోజురోజుకూ ముంచుకువస్తున్న నీటి కొరత.. నీటి అవసరాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై దృష్టిసారించింది.
ఎల్‌నినో ప్రభావరీత్యా జలసంరక్షణకు ప్రాధాన్యం
జీరామ్‌జీ ఉపాధి పథకంలో ‘జలసిరి’
‘ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో పంటకుంట.. ఊరికో ఊరకుంట’
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వాతావరణంలో అనూహ్యమార్పులు.. ఎల్‌నినో ప్రభా వం.. ముఖం చాటేసిన వరుణుడు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. రోజురోజుకూ ముంచుకువస్తున్న నీటి కొరత.. నీటి అవసరాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై దృష్టిసారించింది. కురిసే ప్రతీ నీటి బొట్టును భద్రపరిస్తేనే భవిష్యత్ నీటి భద్ర త సాధ్యమనే భావనతో ‘జలసిరి, జలసంచాయి, జనభాగస్వామ్యం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో జలసంరక్షణను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ‘ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత’, ‘ప్రతీ పొలానికి పంటకుంట’, ‘ప్రతీ ఊరికో నీటి కుం ట’ అనే నినాదంతో కార్యక్రమాన్ని రూపొందించింది. తెలంగాణ జలసిరి అనే ఈ వినూత్న కార్యక్రమాన్ని జీ-రామ్‌జీ గ్రామీణ ఉపాధి హా మీ పథకం ద్వారా ప్రజలను భాగస్వామం చేసి, తద్వారా భారీ మొత్తంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ఇంటికో గుంత.. పొలానికో కుంట
ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. సంప్రదా య పంటల సాగుకు బదులు తక్కువ నీటి వినియోగ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను వ్యవసాయశాఖ నిర్వహిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కురిసే ప్రతీ వర్షపు బొట్టును వృథాగా పోనివ్వకుండా భూమిలోనే నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడాన్ని సాగునీటి వనరుల బలోపేతానికి తక్షణం చేపట్టాల్సిన అంశంగా భూగర్భజల నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ జలసిరి’ అనే నీటి సంరక్షణ పథకానికి అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకంలో ప్రతీ ఇంటికి ఇం కుడు గుంత నిర్మాణం చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇంకుడు గుంత నిర్మాణానికి సుమారు రూ.6వేలు అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. అదే విధం గా గ్రామీణ ప్రాంతంలో ప్రతీ వ్యవసాయ కమతంలో నీటి సంరక్ష ణ చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. రైతుకు చెంది న భూ కమతంలో నీటి సంరక్షణకు పంటకుంట నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పంటకుంట పరిమాణం ప్రకారం సుమారు రూ.2.50లక్షల నుంచి రూ.4లక్షల అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. అదే విధంగా ప్రతీ గ్రామం, ఆవాస ప్రాంతంలో సామూహిక నీటి అవసరాలను తీర్చేందుకు ఊర కుంటల నిర్మాణానికి సైతం ప్రతిపాదిస్తున్నారు. ప్రతీ ఊరకుంట నిర్మాణానికి సుమారు రూ.10లక్షల అంచనా వ్యయంతో కార్యాచరణను రూపొందిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులతో చేపట్టే ఈ నీటి సంరక్షణ గుంతల నిర్మాణానికి పనిచేసిన కూలీల వేతనాలతో పాటు మెటీరియల్ కంపోనెంట్‌ను ప్రభుత్వం అందించనుంది.
జిల్లాలో 650 ఆవాసాలు
జిల్లాలో ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ఊరికో ఊరకుంటను జలసిరి కార్యక్రమంలో అమలుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 650 గ్రామీణ ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే ప్రకారం 2,60,766 కుటుంబాలు ఉన్నాయి. అదే విధంగా వ్యవసాయశాఖ ఫార్మర్ రిజిస్త్రీ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 2,85,202 వ్యవసాయ కమతాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాలో ఏటా చేపట్టే ఉపాధి హామీ పథకానికి సుమారు రూ.110కోట్ల వ్యయం చేస్తోంది. కొత్తగా మార్పులు, చేర్పులతో అమలు చేస్తున్న జీరామ్‌జీ పథకంలో సైతం జలసంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదే విధంగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కారణంగా నిధుల లభ్యత సైతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. జలసిరి పథకం ద్వారా మెటీరియల్ కంపోనెంట్‌తో పాటు గ్రామీణ కూలీలకు సైతం పూర్తిస్థాయి పని దినాల పాటు ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కూలీలకు ఉపాధి.. భూగర్భ జలాల పెంపు
రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమం చేపట్ట డం ద్వారా ఓ వైపు గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడమేగాక మరోవైపు భూగర్భజలాల పునరుద్ధర ణ జరగనుంది. సాగునీటి వనరులు విస్తరించి పర్యావరణ పరిరక్షణకు బలమైన పునాదులు పడనున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, కరువు ప్రభావం తగ్గించడానికి కీలకంగా మా రుతుందని గ్రామీణాభివృద్ధి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయి తే జలసంరక్షణ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ కుటుంబం, ప్రతీ రైతు, ప్రతీ గ్రామం నీటి వనరులను సం రక్షించుకున్నప్పుడు భవిష్యత్ తరాలకు నీటిని అందించవచ్చని జలనిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రస్తుతం సవాల్‌గా నిలిచిన ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకొని నీటి స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
‘జలసిరి’ కార్యక్రమాలకు ప్రాధాన్యం: -టి.నాగిరెడ్డి, డీఆర్‌డీవో
వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంత, ప్రతీ పొలంలో పంట కుంట, ప్రతీ ఊరిలో ఊరకుంట నిర్మించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. కురిసిన ప్రతీ వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకించడం ద్వారా బోరుబావుల నీటిమట్టం పెరుగుతుంది. పంటల సాగుకు నీటి ఎద్దడి నివారణతోపాటు చెట్లు పచ్చగా పెరిగి పర్యావరణం మెరుగుపడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో ఉపాధి హామీ నిధులతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు సైతం నీటి ఎద్దడి లేకుండా నీటి భద్రత చేకూరుతుంది.