ధాన్యం కుంభకోణంలో అధికారులకూ ఉచ్చు!
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:45 AM
సీఎంఆర్ ధాన్యం అక్రమాల్లో భాగపంచుకున్న అధికారుల మెడకు ఉచ్చు బిగియనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసినా, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే తిరిగి బియ్యం కేటాయించడంలో అధికారుల పాత్రపైనా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.
అక్రమాలు తెలిసినా మిల్లర్లనువెనకేసుకొచ్చారనే ఆరోపణలు
కాకినాడ పోర్టుకు బియ్యం తరలించినట్లు తెలిసినా చర్యలు నిల్
రూ.1000 కోట్ల ప్రజాధనాన్నికాపాడాలనే డిమాండ్లు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): సీఎంఆర్ ధాన్యం అక్రమాల్లో భాగపంచుకున్న అధికారుల మెడకు ఉచ్చు బిగియనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసినా, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే తిరిగి బియ్యం కేటాయించడంలో అధికారుల పాత్రపైనా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం నిర ్లక్ష్యం వల్లే బియ్యం పక్కదారి పట్టిందని, కస్టోడియన్లుగా ఉండాల్సిన అధికారులు అమ్యామ్యాలకు కక్కుర్తి పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో అటు మిల్లర్లతో పాటు అధికారులను పూర్తిస్థాయిలో విచారించి సుమారు రూ.1,000 కోట్ల ధాన్యం స్కామ్‌లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)కు కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం వెలుగులో కి రావడం, ఏడు మిల్లులపై ఇప్పటికే కేసులు నమోదవడం తో ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు, తిరి గి బియ్యంగా మార్చి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు అప్పగించేంతవరకు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారయంత్రాంగం పూర్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంతోనే ఇంత పెద్దస్థాయిలో కుంభకోణం జరిగేందుకు ఆస్కారం ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిల్లో మొదలుకొని అన్ని స్థాయిల వరకు అధికారయంత్రాంగం మిల్లర్లతో అంటకాగడం వల్లనే ఇంత పెద్ద కుంభకోణానికి ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ప్రఽధానంగా సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యానికి కస్టోడియన్లుగా ఉండే క్షేత్రస్థాయి అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే, ఉన్నతస్థాయి అఽధికారులు మిల్లర్లతో చెట్టాపట్టాలు వేసుకోవడం వల్లే ఈ భారీ వ్యవహారం జరిగిందనే ఆరోపణలు వస్తున్నా యి. సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించినప్పటి నుంచి ధాన్యం బియ్యంగా మారి తిరిగి కార్పొరేషన్‌కు చేరేంతవర కు కస్టోడియన్లుగా వ్యవహరించాల్సిన వారు మిల్లుల్లో ధాన్యం మాయమైన విషయాన్ని గుర్తించినప్పటికీ పట్టించుకోకపోవడం వెనక అమ్యామ్యాల ప్రభావమే ఉందని, అప్పట్లో ఈ ధాన్యం వ్యవహారాలను పర్యవేక్షించిన జిల్లా స్థాయి అధికారులు సైతం మిల్లర్లకు మద్దతుగా ఉండడం వల్లనే యథేచ్ఛగా ఈ కుంభకోణం కొనసాగినట్లు చెబుతున్నారు. ఈ స్కామ్‌లో కీలకమైన ఒక మిల్లుకు సంబంధిం చి అక్రమంగా 10 లారీల బియ్యం కాకినాడ పోర్టుకు తరలించినట్లు అప్పటి అధికారులకు సమాచారమిచ్చి నా పట్టించుకోలేదని, కనీసం ఆ సమయంలో ఉన్నతాధికారులు సంబంధిత మిల్లులో తనిఖీ లు నిర్వహించినా వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని ఆ సమాచారమందించిన వారు వాపోతున్నారు. ధాన్యం పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించి సంబంధిత మిల్లుల నుం చి మిగిలిన ధాన్యాన్ని వేరే మిల్లులకు పంపాల్సిన అధికారు లు అలా చేయకుండా, సంబంధిత మిల్లర్లని కాపాడడమే కాకుండా రాష్ట్రస్థాయి అధికారుల అనుమతులేవీ లేకుండానే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈ రెండు మిల్లులకు ఆ సీజన్‌లలో అదనపు ధాన్యాన్ని సైతం కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కేసులు నమోదయిన నేపథ్యంలో 2022-23 సీజన్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన మొత్తం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ కేటాయింపులు, తాజాగా విజిలెన్స్ తనిఖీల అనంతరం వెలుగులోకి వచ్చిన సుమారు రూ.1,000 కోట్లవరకు ఉన్న ధాన్యం షార్టేజీ కుంభకోణాన్ని మిల్లుల యజమానులకు పరిమితం చేయకుండా మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా ఉన్నతస్థాయి వరకు సంబంధిత అక్రమార్కులకు సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ జరిపి వారిపైనా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మొత్తం వ్యవహారాన్ని వెలికితీసి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలనే సూచనలు వస్తున్నాయి. ఈ స్కామ్ నుంచి బయటపడేందుకు ఇటు అక్రమవ్యాపారులు, అటు ఉద్యోగ, అధికారులు ఇప్పటికే కీలకమైన రాజకీయనేతలను ఆశ్రయించారని, రాజకీయనేతలు సైతం వారిని దగ్గరకు రానీయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడాలని, ప్రభుత్వధనాన్ని కాపాడడమే లక్ష్యంగా వారంతా చొరవ తీసుకోవాలనే సూచనలు పౌరసమాజం నుంచి వస్తున్నాయి.
ధాన్యం స్కామ్ నిందితులపై ఆర్‌ఆర్ యాక్ట్ ..!
రంగంలోకి తహసీల్దార్లు
సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన వ్యాపారులపై ఆర్‌ఆర్ యాక్ట్(రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏడు మిల్లులపై పోలీసులు కే సులు నమోదు చేయగా తాజాగా మాయం చేసిన ధాన్యాన్ని రికవరీ చేసేందుకు మిల్లుల నిర్వాహకులపై ఆర్‌ఆర్ యాక్ట్ అమలుచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ధాన్యం విలువలో 25 శాతానికి తగ్గకుండా అపరాధ రుసుముతో కలిపి మొత్తం విలువను వసూలు చేయనున్నారు. అందుకోసం నిందితుల ఆస్తులను, మిల్లులను, ఇతర వస్తువులను జప్తు చేయనున్నారు. 25శాతం జరిమానాతో సహా పక్కదారి పట్టించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు. ఇందుకోసం తహసీల్దార్లకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు రాగా, వారు కార్యాచరణ మొదలుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.