ఓడీఎఫ్.. ప్రకటనలకే పరిమితం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:21 AM
బహిరంగ మల విసర్జన రహితం (ఓడీఎఫ్) ప్రకటనలకే పరిమితమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అధికారులు ఓడీఎ్ఫగా ప్రకటించినా క్షేత్రాస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
మహిళల భద్రత.. ఆరోగ్యానికి ముప్పు
ఉమ్మడి జిల్లాలో 1.65లక్షల ఇళ్లకు మరుగుదొడ్లు కరువు
సూర్యాపేట జిల్లాలో 18.70శాతం, నల్లగొండ జిల్లాలో .... శాతం
జిల్లాలో 19,297 ఇళ్లకు అందని సౌకర్యం
నేడు అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): బహిరంగ మల విసర్జన రహితం (ఓడీఎఫ్) ప్రకటనలకే పరిమితమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అధికారులు ఓడీఎ్ఫగా ప్రకటించినా క్షేత్రాస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 1.65లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక, కుటుంబ సర్వే నివేదిక చెబుతోంది. మొత్తం 11,43,936 గృహాలు ఉండగా, వీటిలో 14.47శాతం ఇళ్లల్లో మరుగుదొడ్లు లేవు.
ప్రతీ ఒక్కరికి సురక్షిత మరుగుదొడ్డి సౌకర్యం, బహిరంగ మలవిసర్జన అరికట్ట డం.. పారిశుధ్యంపై అవగాహన పెంపు లక్ష్యంగా అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం నిర్వహిస్తున్నారు. 2001లో సింగపూర్‌కు చెందిన వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజనేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టగా, 2013లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించడం తో ప్రపంచవ్యాప్త దేశాల్లో ఏటా నవంబరు 19న వరల్డ్ టాయిలెట్డేగా నిర్వహిస్తున్నారు. 2016 సంవత్సరానికి ‘శానిటేషన్-జండర్ ఈక్వాలిటీ’ (పారిశుధ్యం-లింగ సమానత్వం) ఇతివృత్తంగా నిర్వహించాలని ప్రకటించారు. మహిళల భద్రత, ఆత్మగౌరవం, సమానత్వం అనే సందేశాన్ని ఇది చాటుతోంది. అయితే దశాబ్దాలకుపైగా సురక్షితమైన మరుగుదొడ్డి సౌకర్యం, బహిరంగ మలవిసర్జన అరికట్టడం కోసం చేపడుతున్న ఓడీఎఫ్ వంటి కార్యక్రమాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. లక్షలాది కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోని పరిస్థితిలే ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో 14.47శాతం ఇళ్లు మరుగుదొడ్లకు దూరం
స్వచ్చభారత్ లక్ష్యంగా దశాబ్దకాలంగా ప్రచార కార్యక్రమాలు, మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి నల్లగొండ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలను ఓడీఎ్ఫగా ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా పరిస్థితి మారలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక, కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడి నల్లగొండ పరిధిలో 1.65లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని నివేదికలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 11,43,936 గృహాలు ఉండగా, వీటిలో 14.47శాతం గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, మహిళలకు భద్రతకు అత్యంత కీలకమైన మరుగుదొడ్ల సౌకర్యం అందరికి అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్ర సగటు కంటే అధికం
వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే అధికంగా ఉన్నాయి. మరుగుదొడ్లు లేని గృహాల సంఖ్య రాష్ట్ర సగటు 13.30శాతం కాగా, ఇక్కడ 14.47శాతంగా ఉన్నట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. అంటే రాష్ట్ర సగటు కంటే 1.17శాతం ఎక్కువగా ఉంది. జిల్లాల వారీగా సూర్యాపేట జిల్లాలో 3,71,352 గృహాలు ఉండగా, 69,746 గృహాల్లో మరుగుదొడ్లు లేవు. అంటే 18.70శాతం కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యానికి దూరంగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 5,11,638 గృహాలకు 76,746 ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,60,766 గృహాలు ఉండగా, 19,297 ఇళ్లకు టాయిలెట్స్ లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలు ఇంకా బహిరంగ మలవిసర్జనపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
గౌరవం.. భద్రతకు ముడిపడిన సమస్య
ఇంటిలో మరుగుదొడ్డి లేకపోవడం కేవలం అసౌకర్యమే కాదు.. మహిళలు.. బాలికల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశం. తెల్లవారు జామున, చీకటిపడిన తర్వాత బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిరావడం మహిళలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. అదే విధంగా కొన్ని సామాజిక మరుగుదొడ్ల వినియోగంపై అశ్రద్ధ ఆరోగ్యాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. బస్టాండ్లు, పట్టణ కూడళ్లు, పర్యాటక ప్రదేశాల్లో సామూహికంగా వినియోగించే టాయిలెట్స్‌లో తగిన నీటి సదుపాయం లేకపోవడం, నిర్వహణా లోపాల కారణంగా పారిశుధ్యం సమస్యలు తీవ్రమతున్నాయి. అందుకే మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు వాటి వినియోగం, నీటి వసతి, పరిశుభ్రతపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు ఇలా..
జిల్లా మొత్తం మరుగుదొడ్లు శాతం
గృహాలు లేనివి
నల్లగొండ 5,11,638 76,746 15.00
సూర్యాపేట 3,71,352 69,746 18.70
యాదాద్రి 2,60,766 19,297 7.40
మొత్తం 11,43,936 1,65,789 14.49