Share News

నేతల ఆటంకం ఉపాధ్యాయులకు సంకటం

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:13 AM

ప్రీప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల నియామకాలు చేపట్టలేకపోవడంతో జిల్లాలో తరగతుల నిర్వహణ ఉపాధ్యాయులకు సంకటంగా మారింది.

నేతల ఆటంకం  ఉపాధ్యాయులకు సంకటం

ఆగస్టులోనే మెరిట్‌ జాబితా ఖరారైనా రాజకీయజోక్యంతో బ్రేక్‌

సిఫార్సుచేసిన వారికే ఉద్యోగాలివ్వాలని పట్టుబడుతోన్న ప్రజాప్రతినిధులు

నిబంధనలు మార్చలేమని ఉన్నతస్థాయి అధికారులు పేర్కొన్నా కదలని ప్రక్రియ

కొత్త మార్గదర్శకాలు వస్తే తప్ప నియామకాలు చేసేలా పరిస్థితి లేదంటోన్న విద్యాశాఖ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : ప్రీప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల నియామకాలు చేపట్టలేకపోవడంతో జిల్లాలో తరగతుల నిర్వహణ ఉపాధ్యాయులకు సంకటంగా మారింది. జిల్లాలో ఈ విద్యాసంవత్సరం 124 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించిన విద్యాశాఖ అందుకోసం ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలకోసం నోటిఫికేషన్‌ జారీచేసింది. అయి తే రాజకీయకారణాలతో ఈ నియామక ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు.

జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో నియామక ప్రక్రియ పూర్తికాకపోవడంతో సుమారు మూడు నెలల నుంచి ప్రీ ప్రైమరీ తరగతులను సైతం సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులే నిర్వహించాల్సి వస్తుండడంతో పనిభా రం పెరిగింది. అంతేగాక చిన్నారులకు సైతం అవసరమైన ప్రీప్రైమరీ విద్య అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లను తొలుత మెరిట్‌ ప్రకారం ఎంపికచేసినా పలు చోట్ల రాజకీయనాయకు లు వారికి అనుకూలమైనవారికి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది. నియామకాలు లేకపోవడంతో అట్టహాసంగా ప్రారంభించిన ప్రీప్రైమరీ తరగతులు అలంకారప్రాయంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి.

మెరిట్‌ ప్రకారం నియమించాలని డిమాండ్లు

ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం మెరిట్‌ జాబితాను ఖరారుచేసిన విద్యాశాఖ జాబితాను ఆగస్టులో వెల్లడించింది. అదే సమయంలో ఉద్యోగం వచ్చినట్లేనని సంబరపడ్డ నిరుద్యోగులు ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో తీవ్రనిరాశకు గురవుతున్నారు. ఇతర జిల్లాల్లో ఈ పోస్టులకు నియామకాలు జరగడంతో పాటు శిక్షణ సైతం పూర్తయి, అభ్యర్థులు ఉద్యోగాలు చేసుకుంటుంటే, జిల్లాలో మాత్రం మెరిట్‌ జాబితా వెల్లడించి మూడు నెలలు గడిచినా నియామకాలు చేయకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయనేతల ఒత్తిడితోనే మెరిట్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను నియమించకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మెరిట్‌ జాబితాను పక్కనపెట్టి రాజకీయనేతల సిఫార్సులతో ఉద్యోగాలిస్తే ఆందోళన చేస్తామని, మెరిట్‌ ఆధారంగానే తక్షణం నియామక ప్రక్రియ చేపట్టాలని సంబంధిత నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

రాజకీయ జోక్యంతో...

జిల్లాలో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు 124 ఇన్‌స్ట్రక్టర్‌, మరో 124 ఆయా పోస్టులను తాత్కాలిక పద్ధతిలో విద్యా సంవత్సరంలో 10నెలల పాటు పనిచేసేందుకు విద్యాశాఖ జూలైలో నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎంపిక చేయాల్సిన అభ్యర్థుల అర్హతలు, నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఇన్‌స్ట్రక్టర్‌, ఆయాల పోస్టులకు జూలై చివరివారంలోనే జిల్లా అధికారులు మెరిట్‌ జాబితాను ఖరారుచేసి, వెబ్‌సైట్లలో అప్లోడ్‌ చేశారు. మెరిట్‌ అభ్యర్థులను సంబంధిత పాఠశాలల్లోని ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు విధుల్లో చేర్చుకోవాలని ఆగస్టు 2న ఎంఈవోలకు సైతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఎంపిక జాబితాను పంపారు. ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండ గా, జాయినింగ్‌, శిక్షణ ప్రక్రియలకు బ్రేక్‌పడింది. అధికారులు మెరిట్‌ ప్రకారం ఎంపికచేసిన జాబితాలో తాము సిఫార్సుచేసిన అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో కీలక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేశారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక సూచనల ప్రకారం, ఎంపికచేసిన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను విధుల్లో చేర్చుకోవద్దని ఎంఈవోలకు విద్యాశాఖాధికారుల ద్వారా సూచించడం తో ప్రక్రియ నిలిచింది. రాజకీయనేతలు వారు సిఫార్సుచేసిన అభ్యర్థులనే నియమించాలని పట్టుబడుతుండడంతో విధుల్లో చేర్చుకోకపోవడంతోపాటు శిక్షణ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విషయం విద్యాశాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారినుంచి వచ్చే తదుపరి ఆదేశాలు ఎలా ఉంటో అలా నడుచుకుంటామని పేర్కొన్న జిల్లా అధికారులు నియామక ప్రక్రియను పక్కనపెట్టారు. మరోవైపు తాము సిఫార్సుచేసినవారికే ఉద్యోగాలిప్పించాలనే పట్టుదలతో ఉన్న ప్రజాప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులను సైతం కలిసి నియమ, నిబంధనలు, అర్హతల్లో సడలింపులు, మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సవరణలు, నియమ, నిబంధనల సడలింపులు, కొత్త మార్గదర్శకాలు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా నియామక ప్రక్రియకు మార్గదర్శకాలు ఉండటంతో ఇప్పుడు ప్రత్యేకంగా మార్పులు, చేర్పులు చేసే పరిస్థితి లేదని ఉన్నతస్థాయి అధికారులు జిల్లా అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాజకీయ కారణాలతో నియామకాల ప్రక్రియ ఆగడంతో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ ఉపాధ్యాయులకు భారంగా మారగా, విద్యార్థులకు సరైన ప్రీప్రైమరీ బోధన అందని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Oct 07 , 2026 | 01:13 AM