Share News

ఇకపై ఆన్‌లైన్‌లోనే..

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:03 AM

డిజిటల్‌ విధానంలో ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ ఫ వివరాలు నమోదు చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

  ఇకపై ఆన్‌లైన్‌లోనే..

(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన్‌)

ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న పురపాలకశాఖ ఒ క్కో అడుగు ఆచితూచి వేస్తోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల పరిధిలోని దుకాణ సముదాయా ల్లో నిర్వహించే వాణిజ్య, వ్యాపారాలకు ట్రేడ్‌ లైసెన్స్‌లను జారీ చేయడంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అవకతవకలు జరగకుండా ఆయా దుకాణాల వివరాలను, అందించే లైసెన్స్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది.

ఆదాయానికి గండి కొట్టకుండా..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వ్యాపారాలు, దుకాణాలు వందల సంఖ్యలో ఉండగా ట్రేడ్‌ లైసెన్స్‌ పొందిన వారు పదుల్లోనే ఉండటం గమనార్హం. విద్య, వైద్య పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా పట్టణంలో ఏటేటా జనాభా పెరుగుతోంది. మరోవైపు పట్టణానికి వచ్చి వారి సంఖ్య గణనీయంగా ఉండటంతో వ్యాపారకేంద్రాలు చాలా విస్తరించాయి. ఆ వ్యాపార కేంద్రాల్లో అనుమతి పొందని దుకాణాలే అధికంగా ఉన్నాయి. ట్రేడ్‌ లైసెన్స్‌ పొందితే లైసెన్స్‌ ఫీజు చెల్లించడంతో పాటు సంవత్సరానికి (నిబంధనలకు అనుగుణంగా) రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకనుకున్న చోటా, బడా వ్యాపారులు కిమ్మనకుండా దుకాణాలు నడిపిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక సిబ్బంది ఆయా కేంద్రాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

పట్టణంలో ఇలా..

మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఇప్పటికి 1783 ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉన్నట్లు మునిసిపల్‌ రెవెన్యూ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆయా దుకాణాలకు 2024 వరకూ 2016లో నాటి కౌన్సిల్‌ తీర్మానం చేసిన ఫీజు వర్తింపునే అమలు చేసేవారు. అంతేకాక 59 రకాల వ్యాపారాలకు ఒకే విధమైన ట్రేడ్‌ లైసెన్స్‌ ఉండేదని మునిసిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. మారిన నిబంధ

నల ప్రకారం వ్యాపారాన్ని బట్టి, దుకాణ సముదాయ కొలతల (విస్తీర్ణం)ను బట్టి ఫీజును ఖరారు చేయడంతో పాటు వ్యాపార రకాలను బట్టి లైసెన్స్‌లు డిజిటల్‌ విధానంలో జారీ చేయునున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ప్రతీ ఒక్కరూ

ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి

మిర్యాలగూడ పట్టణ పరిధిలోని దుకాణాలలో వ్యాపా రం నిర్వహించే ప్రతీ ఒక్కరూ ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. అనుమతి పొందితే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, రెన్యువల్‌ చేసుకోవాల్సి వస్తుందని ఎగనామం పెడితే ఊరుకోబోం. ఒక వ్యాపారం పేరుతో అనుమతి పొంది మరో వ్యాపారం చేసే వారిపైనా దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే చట్టపరమైన చర్యలకు వ్యాపారులు బాధ్యులు అవుతారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రేడ్‌ లైసెన్స్‌ జారీని డిజిటలైజేషన్‌ చేస్తున్నాం.

- గణవేణి శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌, మిర్యాలగూడ

Updated Date - Apr 09 , 2026 | 12:04 AM