వానల్లేవ్.. వనాల్లేవ్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:09 AM
ఒకప్పుడు అడవుల్లో.. గుట్టల్లో.. చెట్ల మధ్య కనిపించే వానరాలు, ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో సంచరించడమేగాక పంట పొలాలపై స్వైరవిహారం చేస్తున్నాయి.
జనావాసాల్లోకి కోతులు
అడవులు, గుట్టలు మాయం..
పంట పొలాలు, పండ్లతోటలపై కోతుల గుంపుల దాడులు
ప్రజలనూ గాయపరుస్తున్న వైనం
పునరావాస కేంద్రాలే పరిష్కారం..
ఈ-పంచాయత్‌లో ‘మంకీ మేనస్’ సర్వే
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఒకప్పుడు అడవుల్లో.. గుట్టల్లో.. చెట్ల మధ్య కనిపించే వానరాలు, ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో సంచరించడమేగాక పంట పొలాలపై స్వైరవిహారం చేస్తున్నాయి. అడవుల్లో తినేందుకు సహజసిద్ధమైన ఆహారం దొరక్కపోవడం, తాగునీటి వనరులు తగ్గడం, గుట్టలు, చెట్లు రియల్ ఎస్టేట్ విస్తరణలో కనుమరుగవుతుండటం, ఫల వృక్షాలకు పూత, కాత తగ్గడంతో కోతుల గుంపులు మానవ ఆవాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఫలితంగా వ్యయ ప్రయాసలు పడి సాగు చేసిన పంట పొలాలు, పండ్ల తోటలు దెబ్బతింటుండగా, మరోవైపు మహిళలు, చిన్నారులు సహా ప్రజలపై కోతుల దాడులు చేస్తుండటంతో భయాందోళనలు నెలకొంటున్నాయి.
కొండలు, గుట్టలు, చెట్లు, కొమ్మలతో చిట్టడవులకు నిలయమైన జిల్లాలో దాదాపు 50వేలకు పైగా కోతులు ఉన్నట్టు అటవీశాఖాధికారుల అంచనా. వీటిలో దాదాపు 20శాతం వర కు పిల్లకోతులేనని భావిస్తున్నారు. కోతుల సంతానోత్పత్తి కారణంగా విస్తృతంగా సంఖ్య పెరగడమేగాక, అటు ఊరు వాడ ల్లో సంచరిస్తూ, ఇటు పంటపొలాల్లో నాట్లు వేసిన నుంచి కోతలకు సిద్ధమయ్యే వరకు ధ్వంసం చేస్తూ, ప్రజలకు, రైతుల కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతుల నుంచి రక్షణకు వాటి సంతానోత్పత్తి నియంత్రణతో పాటు వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లోకి తరలించేందుకు శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. అందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోతుల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీ సం రెండు, మూడు జిల్లాలను ఒక క్లస్టర్‌గా విభజించి, క్లస్టర్‌క ఒక కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కోతుల నియంత్రణకు ఆరేళ్ల క్రితం నిర్మల్ జిల్లా చింతకుంటలో రూ.2.25కోట్లతో పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో కేవలం నెలకు 100 నుంచి 200 కోతుల వరకే సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే సామ ర్ధ్యం ఉండటంతో ఆయా ప్రాంతాలకు పరిమితమంగానే ప్రయోజనాలు చేకూర్చాయి. అయితే ఇటువంటి కేంద్రాలను ప్రాంతాల వారీగా అందుబాటులోకి తీసుకురాడం ద్వారా కోతుల సంతానోత్పత్తి సంఖ్య నియంత్రణతో పా టు పట్టుబడిన కోతులను సురక్షిత పునరావాసం కల్పించే అవకాశం ఉంటుంది. కనీసం రెండు జిల్లాలకు ఒక కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ఆవాసాల నుంచి కో తులను పట్టుకుని సంతానోత్పత్తి నియంత్రణతో పాటు సురక్షిత ప్రాంతాల్లోకి పంపడం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఇబ్బందులు తొలగుతాయి. అదే విధంగా పండ్ల తోటు, పంటలను కోతుల నుంచి సంరక్షించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సైతం ఊతం లభిస్తుంది.
స్థానిక సంస్థలకు ఆర్థిక భారం
కోతుల బెడదను ఎదుర్కొవడం ప్రస్తుతం ప్రభుత్వాల కు, ప్రధానంగా స్థానిక సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు అభివృద్ధి నిధులను కోతుల నియంత్రణ కోసం మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో ఈ ఏడాది నిధులను కోతుల పట్టివేత కోసం వ్యయం చేశారు. అదే విధంగా భువనగిరిలో సైతం కోతులను పట్టుకునేందుకు సుమారు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వ్యయం చేశారు. మునిసిపాలిటీలు, పంచాయతీలు నిధులతో కోతులను పట్టి తరలించాలని ప్రజల నుంచి డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. భువనగిరి కలెక్టరేట్‌లో సైతం సెప్టెంబరు మాసంలో కోతుల గుంపుల సమస్యను తట్టుకోలేని అధికారులు వాటిని పట్టివేయించి, అటవీ ప్రాంతాలకు తరలించారు. గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామ ప్రజలే ఇంటికి రూ. 300 చొప్పున నిధులు సేకరించి కోతులను పట్టించి, అటవీప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో కనీసం నెల, రెండు నెలలు కూడా ఉపశమనం కలుగ డం లేదని, తిరిగి మళ్లీ వచ్చి కిష్కింధకాండను కొనసాగిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. కోతులను పట్టుకుని అడవులకు తరలించే నిపుణులు రాష్ట్రంలో అందుబాటులో లేరు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వారి తో కోతుల పట్టివేత ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.500 నుంచి రూ.1,100 వరకు వారు చార్జ్ చేస్తున్నారని స్థానిక సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కోతుల పట్టివేత, తరలింపు భారమవుతుండగా, పట్టుకున్న కోతల సంఖ్య తప్పుగా చెబుతుండటంతో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ-పంచాయతీలో ‘మంకీ మేనస్ సర్వే’
కోతుల బెడద నివారణ ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టిసారించింది. గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా కోతుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఈ-పంచాయత్‌లో ‘మంకీ మేనస్ సర్వే’ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే ద్వారా ఆయా గ్రామాల పరిధిలో కోతుల సంఖ్య, వాటి ఉనికి, పంట నష్టం, ఆవాస ప్రాంతా ల్లో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించి ఈ-పంచాయత్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. జిల్లాలోని 427 పంచాయతీల్లో గ్రామాల వారీగా కోతుల వివరాలను సేకరించిన ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీనివా్‌సరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ సమాచారం ఆధారంగానే సమస్య తీవ్రత, నష్టం గుర్తించి వాటి నియంత్రణకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే అవకాశాలు ఉంటాయన్నారు.
శాశ్వత పరిష్కారమెప్పుడు?
కోతులను పట్టుకోవడం.. కొంత దూరంలో అటవీ ప్రాంతంలో వదిలివేయడం.. మళ్లీ అవే కోతులు ఆయా ప్రాంతాల్లోకి తిరిగి వచ్చి జనావాసాల్లో వీరవిహారం చేయడం పరిపాటిగా మారిం ది. దీంతో ఈ తంతుకు మంగళంపాడి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలి. అందుకోసం శాస్త్రీయపద్ధతిలో దీర్ఘకాలిక కార్యాచరణను రూపొందించాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అందులో ప్రధానమైనవి అడవుల పునరుద్ధరణ, స్థానికంగా ఫల వృక్షాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ది చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అదే విధంగా కోతులకు ఆహారం వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, సంతానోత్పత్తి నియంత్రణ, వ్యంధత్వ శస్త్ర చికిత్సలు, కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కోతుల సమస్య ప్రస్తుతం వన్యప్రాణి సమస్యగా మాత్రమేగాక, రైతుల జీవనాధారం, ప్రజల భద్రత, స్థానిక సంస్థలపై ఆర్థిక భారంగా పరిణమించిన సమస్యగా మారింది. సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక కార్యాచరణను చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.