Share News

తాగునీటి ఎద్దడి.. ఉండదిక!

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:38 AM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిషన్‌భగీరథ, పంచాయతీరాజ్‌శాఖల సమన్వయంతో తాగునీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

తాగునీటి ఎద్దడి.. ఉండదిక!

మిషన్‌భగీరథ, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు

(ఆంధ్రజ్యోతి,భానుపురి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిషన్‌భగీరథ, పంచాయతీరాజ్‌శాఖల సమన్వయంతో తాగునీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అందుకు రూ.9కోట్ల మేర ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో ఈ రెండు శాఖలు నివేదికలు రూపొందిస్తున్నాయి.

ప్రస్తుతం నీటి కొరత ఉన్న గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునే పనుల్లో రెండు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక నిధులతో అద్దెబోర్లు, పంపుసెట్లు, డ్రై బోర్లు దగ్గర కొత్త బోర్లు, అద్దెకు ప్రైవేట్‌ బోర్లు, పైపులైన్ల లీకేజీలు, కొత్త ట్యాప్‌ కనెక్షన్లు, ట్యాంకుల మరమ్మతులు, అత్యవసరమైతే పంచాయతీల ట్యాంకర్లతో నీటిని సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కృష్ణానది టెయిల్‌పాండ్‌, పాలేరు రిజర్వాయర్‌ ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయని ఈ రెండు శాఖల అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి జిల్లాకు తాగునీటికి సరఫరా చేయనున్నారు.

నీటి నిల్వలను సద్వినియోగం చేసేలా

తాగునీరు జనవరి వరకు సరిపోయేలా ఇటీవలే పాలే రు రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల చేశారు. జిల్లాకు రోజు వారీగా 120ఎంఎల్‌డీ నుంచి 130 ఎంఎల్‌డీ నీరు సరఫరా అవుతోంది. జిల్లా జనాభా 8,25,000కు సరిపడా నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రావెల్‌ శాఖలకు ఉంది. మిషన్‌భగీరథ ద్వారా జిల్లాలోని 486 పంచాయతీల్లోని 836 ఆవా సా ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలంలోని టెయిల్‌పాండ్‌ నుంచి పైపులైన్ల ద్వారా నీటినీ సరఫరా చేస్తున్నారు. టెయిల్‌పాండ్‌ నుంచి పైపులైన్‌ ద్వారా అవంతిపురం డబ్యూటీ వో వద్దకు రావాటర్‌ చేరుకుంటోంది. డబ్యూటీవోలో రావాటర్‌ను శుద్ధిచేసి ట్యాంకులకు, అక్కడి నుంచి పైపుల ద్వారా నల్లాలకు చేరుతోంది. ఇక్కడి నుంచి హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని 107 ఆవాసాలకు, అవంతిపురం నుంచి ఇమాంపేట డబ్యూటీవోకు 95 ఎంఎల్‌డీ నీరు చేరుతోంది. ఇమాంపేట నుంచి పెన్‌పహాడ్‌, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలోని అన్ని 180 ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పాలేరు నుంచి 392 ఆవాసాలకు నీరు వస్తోంది. పాలేరు నుంచి వచ్చే నీరు చందుపట్ల వద్ద డబ్యూటీవోలో 18 ఎంఎల్‌డీ, చిల్పకుంట డబ్యూటీవోలో 20 ఎంఎల్‌డీ, మోతె మండలం అన్నవారిగూడెంలో డబ్యూటీవోలో 5 ఎంఎల్‌డీ నీటిని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఐదు ము నిసిపాలిటీలకు సైతం సరఫరా అవుతోంది. జిల్లాలో 2,30,000నల్లాలు, 2,604 బోర్లు, 1,290 ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకులు, 96 తాగునీటి బావులు ఉన్నాయి. తాగునీటికి సంబంధించి సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్లు 786, త్రిఫేజ్‌ కనెక్షన్లు 2,204 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

తాగునీటికి ఇబ్బందులు రానివ్వం : శ్రీనివాసరావు, మిషన్‌భగీరథ అధికారి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తాం. ఇంట్రావెల్‌, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా నివేదికలను తయారు చేస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న చోట మరింత జాగ్రత్తలు తీసుకుంటాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రెండు శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Oct 31 , 2026 | 12:38 AM