Share News

budget: నిధుల్లేవ్‌.. ప్రాజెక్టుల్లేవ్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:48 AM

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆదివా రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొం డ జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.

budget: నిధుల్లేవ్‌.. ప్రాజెక్టుల్లేవ్‌

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా ప్రస్తావనే కరువు

ఒక్క పథకానికీ దక్కని ప్రాధాన్యం

చేనేతపై చిన్నచూపు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆదివా రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొం డ జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రధానంగా జాతీయ రహదారు లు, పారిశ్రామిక కారిడా ర్లు, రైల్వేలైన్ల ప్రతిపాదనలపై బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆశించిన జిల్లా ప్రజానీకానికి నిరాశే ఎదురైంది.దీంతో కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే పింక్‌బుక్‌ అందుబాటులోకి వస్తేగానీ స్పష్టత రానుంది. హైదరాబాద్‌-అమరావతి-చెన్నై కారిడార్‌ మినహా మరే ప్రత్యేక ప్రాజెక్టుపై ఉమ్మడి జిల్లా ప్రస్తావనే లేకపోవడంతో ప్రజలు నైరాశ్యానికి గురయ్యారు.

జాతీయ రహదారుల ప్రస్తావన కరువు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు ప్రతిపాదించిన ఫ్యూచర్‌ సిటీ-పోర్ట్‌ సిటీ 12 లేన్ల రహదారిని కేంద్రం చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసి నిధులు ఇస్తుందని ఇరు రాష్ట్రాల ప్రజలు భావించారు. అయితే ఈ ప్రాజెక్టుకు స ంబంధించి ఎలాంటి నిధులను బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. రీజనల్‌ రింగురోడ్డు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి విస్తరణ పనులకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే హైదరాబాద్‌-అమరావతి-చెన్నై కారిడార్‌ చేపడతామని కేంద్రం ప్రకటించడం ద్వారా ఈ మార్గంలో జాతీయరహదారితో పాటు, హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థ ఏర్పాటవుతుందని భావిస్తున్నారు.

మూసీ పునరుజ్జీవాన్ని పట్టించుకోని కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి కేంద్ర బడ్జెట్‌లో ఎ లాంటి ప్రస్తావనలేదు. ఈ పథకానికి ‘నమామి గంగ’ పథకం మాదిరిగా కేంద్రం చేపడుతుందనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో నిరాశే మిగిలింది.

ఇతర ప్రాజెక్టుల్లోనూ దక్కని ప్రాధాన్యం

జిల్లాలో ఉద్యాన పంటల్లో ప్రాధాన్యం ఉన్న బత్తాయి సాగును ప్రోత్సహించడంతో పాటు, బత్తాయి మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలని కేంద్ర ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఇటీవల నల్లగొండ పర్యటన సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. కేంద్రం అమలు చేస్తున్న ‘వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌’ కింద బత్తాయి సాగును ప్రోత్సహించి, మార్కెటింగ్‌ సదుపాయం కలిపంచడంతోపాటు, నిల్వ సామర్థ్యం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. అయితే వీటికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. నూతన జిల్లాల వారీగా ప్రతీ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఎంపీలు ప్రతిపాదించినా వాటికీ ప్రాధాన్యం దక్కలేదు. సైనిక్‌ స్కూల్‌, ఐఐఐటీ విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని భావించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌ పూర్తికి నిధులు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనులు 85 శాతం పూర్తయినందున ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించింది. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువగా ఉన్న రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.34,367కోట్ల నిధులను ప్రభుత్వం కోరినా, ఆమోదం లభించలేదు. పర్యాటకరంగం ప్రస్తావనా లేదు. హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌, వ్యవసాయ రాయితీ పథకాలు, జిల్లాకో మహిళా హాస్టల్‌ ఏర్పాటు కొంత ఊరట కలిగించాయి.

చేనేతకు దక్కని ఊరట

(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): వ్యవసాయం తర్వాత రెండో ప్రధాన రంగమైన చేనేతకు కేంద్ర బడ్జెట్‌లో మరోసారి చిన్నచూపే దక్కింది. ఈ రంగానికి కేంద్రం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. 2024-25, 2025-26 బడ్జెట్లలోనూ రూ.200కోట్లే కేటాయించారు. టెక్స్‌టైల్‌ రంగాని కి కూడా గత ఆర్థిక సంవత్సరంలాగే రూ.5,272కోట్లు కేటాయించింది. చేనేతకు కేటాయించిన నిధులు ఈ శాఖలోని ఉద్యోగుల జీత భత్యాలకే సరిపోనుంది. రాష్ట్రంలో సుమారు 60వేల కుటుంబాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20వేల కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిధులు పెంచకపోవడంతో ఈ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయి రోడ్డున పడతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ చేనేత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సైతం కేంద్రం పట్టించుకోలేదు. ఉపాధి, కనీస వేతనాల ఊసే లేదు. చేనేతకు రిజర్వ్‌ అయిన 11 రకాల వస్త్రాలను మిల్లుల్లో తయారు చేయకుండా అజమాయిషీ చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం పరోక్షంగా నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రానికి గుండు సున్న :ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని. రాష్ట్రానికి బడ్జెట్‌లో దక్కిన వాటా గుండు సున్న. రాష్ట్రం నుంచి కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నులు వస్తున్నా, తిరిగి నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి వివక్ష చూపింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించకపోవడం విచారకరం. పంటలకు కనీస మద్దతు ధర చట్టంపై ఎలాంటి ప్రకటన లేదు. ఎరువుల సబ్సిడీలో కోత విధించి రైతులపై పెనుభారం మోపుతోంది. పోచంపల్లి, నారాయణపూర్‌, పుట్టపాక చేనేత కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్నట్లుగా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయకపోవడం శోచనీయం. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ బాధితుల పునరావాసానికి, ఫ్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బలోపేతానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం విచారకరం. రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణకు సంబంధించి కేంద్ర వాటా నిధులపై స్పష్టత లేదు. నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. బడ్జెట్‌ పూర్తిగా కార్పొరేట్‌ అనుకూలంగా ఉంది.

రాష్ట్రానికి తీరని అన్యాయం :బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్‌, డీసీసీ అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై పక్షపాత ధోరణి అవలంభిస్తోంది. ప్రా జెక్టుల ప్రతిపాదన,పెండింగ్‌ ప్రాజెక్టుల నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపింది. రాష్టం నుంచి బీజేపీకి 8మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నా నిధులు రాబట్టడంలో పూర్తి గా విఫలమయ్యారు. కేంద్రప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తి కి తిలోదకాలు ఇవ్వడం విచారకరం. సమాఖ్య వ్యవస్థ లో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాలి. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ వివక్షకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు.

సాధారణ బడ్జెట్‌ : పెద్దిరెడ్డి గణేష్‌, బ్యాకింగ్‌ రంగ నిపుణులు

బడ్జెట్‌లో దిగువ తరగతి, మధ్య తరగతి ప్రజలకు వెసులుబాటు కల్పించే అంశాలు లేవు. దేశ ఆర్థిక ప్రగతిని, మౌలిక వసతులను సుస్థిర పరిచేలా ఉంది. అమెరికా టారి్‌ఫల పెంపుదల, అంతర్జాతీయ రాజకీయ నేపథ్యంలో ఆర్థిక స్థితిని స్థిరీకరించే దిశగా చర్యలు తీసుకున్నట్టు బడ్జెట్‌ ఉంది. దేశీయ రంగాన్ని పటిష్ట పరుస్తూ డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు, క్లౌడ్‌ సెంటర్స్‌ సేవలకు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇన్‌కంటాక్స్‌లో ఎలాంటి మార్పులేదు. కేవలం పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేశారు.

ప్రజావ్యతిరేక బడ్జెట్‌ : సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

కేంద్ర బడ్జెట్‌ ప్రజావ్యతిరేకంగా ఉంది. బడ్జెట్‌ను రూ.49,64,842కోట్లకు తగ్గించారు. అన్ని రంగాలకు కోత విధించారు. అంగన్‌వాడీ, స్కాలర్‌షిప్‌, సంక్షేమ నిధులను తగ్గించారు. కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోతాయి. కొత్త పనులకు సరిపోయే పరిస్థితి లేదు. ఉపాధిహామీకి 125రోజుల పనిదినాలు ఇస్తామంటూ రూ.95,000కోట్లు కేటాయించడం సరికాదు. 125 రోజుల పనిదినాలకు రూ.3లక్షల కోట్లు అవసరం. బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడుతుంది.

Updated Date - Feb 02 , 2026 | 12:48 AM