సీబీఐ చేతికి నిఖిల్‌నాయక్ మృతి కేసు
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:21 AM
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ధరావత నిఖిల్‌నాయక్ మృతి కేసును విచారణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు సూర్యాపేట పోలీసులు, సీఐడీ విభాగాలు కేసు విచారించినా పురోగతి లేకపోవడంతో నిఖిల్‌నాయక్ తండ్రి ధరావత భాస్కర్ మే 8వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు.
ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు
2022లో అనుమానాస్పద రీతిలో నిఖిల్‌నాయక్ మృతి
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేటక్రైం)
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ధరావత నిఖిల్‌నాయక్ మృతి కేసును విచారణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు సూర్యాపేట పోలీసులు, సీఐడీ విభాగాలు కేసు విచారించినా పురోగతి లేకపోవడంతో నిఖిల్‌నాయక్ తండ్రి ధరావత భాస్కర్ మే 8వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ఈనెల 9న సీబీఐ అధికారులకు కేసును అప్పగించింది. సమగ్రంగా విచారించి వివరాలు అందజేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. దీంతో కేసుకు సంబంధించిన జిల్లా పోలీసులు, సీఐడీ అధికారుల వద్ద ఉన్న ఫైళ్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో నిఖిల్‌నాయక్ తల్లిదండ్రులు, పలువురిని విచారించనున్నారు.
పూర్వాపరాలు
సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన నిఖిల్‌నాయక్ 9వ తేదీ అక్టోబరు 2022న సూర్యాపేటలోని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఈ విషయమై తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కొన్నిరోజుల తర్వాత నిఖిల్‌నాయక్ మృతదేహం చిలుకూరు సమీపంలోని కట్టకొమ్మగూడెం వద్ద నాగార్జునసాగర్ కాల్వలో లభించింది. అయితే అక్కడికి ఎలా వెళ్లాడనేందుకు పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయం నుంచి ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలు సేకరించారు. రాత్రి సమయంలో నిఖిల్‌నాయక్ స్నేహితులతో కలిసి జనగాం క్రాస్‌రోడ్డు సమీపంలో మద్యం తాగాడు. అనంతరం సమీపంలోని బంధువు ఇంటికి వెళ్లాడు. అప్పటికే నిఖిల్‌నాయక్ మిత్రులు నకిరేకల్‌లో ఉండడంతో వారిని సూర్యాపేటకు పిలిచాడు. వారందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం అందరూ వారి వారి నివాసాలకు వెళ్లిపోయారు. అప్పటికీ నిఖిల్‌నాయక్ జనగాం క్రాస్‌రోడ్డు సమీపంలోని ఓ కాలనీలోని బంధువు ఇంటి వద్దనే ఉన్నాడు. అనంతరం కాసేపటికి అక్కడి నుంచి జనగాం క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చాడు. అక్కడి నుండి ఎటు వెళ్లాడు, ఎవరితో వెళ్లాడనే విషయాలు తెలియడం రాలేదు. ఆ విషయాలు తెలిస్తే నిఖిల్‌నాయక్ మృతి కేసు కొంత పురోగతి సాధించే అవకాశం ఉండేది. ఈ కేసు విషయమై పోలీసులు నెల రోజులు సుమారు 50మంది కాల్‌డేటాలను పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా నిఖిల్‌నాయక్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన కొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. నిఖిల్‌నాయక్ తల్లిదండ్రులతో పాటు వివిధ కులసంఘాలు కేసును ఛేదించాలని హెచఆర్‌సీలో ఫిర్యాదుచేశారు. నిఖిల్‌నాయక్ తల్లిదండ్రులు దీక్ష చేశారు. కులసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేశారు.
పనిచేయని సీసీ కెమెరాలు
సూర్యాపేట జిల్లాకేంద్రంలో పలు ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. క్లిష్టమైన కేసులను సీసీకెమెరాల ఆధారంగా ఛేదించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి, జనగాం క్రాస్‌రోడ్, ఖమ్మం క్రాస్‌రోడ్, దంతాలపల్లి రోడ్లు ఉన్నాయి. నిఖిల్‌నాయక్ జనగాం క్రాస్‌రోడ్డు నుంచి మునగాల వైపు ఎలా వెళ్లాడు, ఎవరితో వెళ్లాడు అనే విషయాలు స్పష్టం కాలేదు. ఆ సమయంలో జనగాం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న సీసీకెమెరాలతో పాటు సమీపంలోని కెమెరాలు పనిచేయలేదు. దీంతో నిఖిల్‌నాయక్ సంఘటనా స్థలానికి ఎలా వెళ్లాడనేది మిస్టరీగా మారింది.
పోలీసులకు సవాల్‌గా కేసు
నిఖిల్‌నాయక్ మృతి పోలీసులకు సవాల్‌గా మారి ంది. ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన రికార్డు సూర్యాపేట పట్టణ పోలీసులకు ఉంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్లి కూడా ఘరానాదొంగలు, ఇతర మోసగాళ్లను పట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ నిఖిల్‌నాయక్ మృతి కేసు మాత్రం మిస్టరీగానే మారి ంది. ఆధారాలు లభించక కష్టంగా మారింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించారు.
చిక్కుముడి వీడక సీఐడీకి..
నిఖిల్‌నాయక్ మృతి కేసును ఛేదించేందుకు అప్పటి ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేక టీంను ఏర్పాటుచేశారు. డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలతో కూడిన టీంను ఏర్పాటుచేశారు. ఈ టీం అంతా నెల రోజుల పాటు కేసును ఛేదించే విషయంలో కఠోరంగా శ్రమించారు. అయినా సాంకేతికంగా ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. ఫోరెన్సిక్ నిపుణులతోనూ పరీక్షలు చేయించారు. అయినా కేసు చిక్కుముడి వీడకపోవడంతో సీఐడీకి అప్పగించారు. ఏదేమైనా నిఖిల్‌నాయక్ మృతి కేసును సీబీఐ అధికారులైనా ఛేదించాలని కోరుతున్నారు.