Share News

జిల్లాకు కొత్త బాస్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:49 AM

జిల్లాకు కొత్త బాస్‌ వచ్చారు. జిల్లాలో 16 నెలలపాటు తనదైన మార్క్‌తో పాలన కొనసాగించిన హనుమంతరావు బదిలీ కాగా, ఆయన స్థానంలో అనురాగ్‌ జయంతి బాధ్యతలు స్వీకరించారు.

జిల్లాకు కొత్త బాస్‌

నూతన కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి

కలెక్టర్‌ ఛాంబర్‌లో బాధ్యతల స్వీకరణ

దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎం.హనుమంతరావు బదిలీ

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): జిల్లాకు కొత్త బాస్‌ వచ్చారు. జిల్లాలో 16 నెలలపాటు తనదైన మార్క్‌తో పాలన కొనసాగించిన హనుమంతరావు బదిలీ కాగా, ఆయన స్థానంలో అనురాగ్‌ జయంతి బాధ్యతలు స్వీకరించారు. అర్హులందరికీ సంక్షేమ పథ కాలు అందించడమే లక్ష్యంతో ముందుకు సాగుతామంటున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు గురువారం స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

జిల్లా కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతి బాధ్యత లు చేపట్టారు. జిల్లా సమీకృత కార్యాలయాల స ముదాయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో గురువారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఎం.హనుమంతరావును దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనురాగ్‌ జయంతిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అ నురాగ్‌ జయంతికి అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, కె.వెంకారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇప్పటివరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎం.హనుమంతరావు 2024అక్టోబరు 28న జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 16 నెలలపాటు ఆయన జిల్లాలో తనదైనశైలిలో పరిపాలన సాగించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేసి, తనదైన మార్క్‌ సాధించారు.

గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించిన అనుభవం...

నూతన కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనురాగ్‌ జయంతి 2015 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. విశాఖ పట్టణానికి చెందిన అనురాగ్‌ జయంతి విద్యాభ్యాసం ఒడిశాలో కొనసాగింది. 23 సంవత్సరాల వయస్సులోనే ఇంజనీరింగ్‌ పట్టభద్రుడై, సోషియాలజీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా 2014లో యూపీఎస్సీ పరీక్ష రాసి అఖిల భారత స్థాయిలో 55వ ర్యాంక్‌ సాధించారు. ఆయన దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని పలు శాఖల్లో సబ్‌ కలెక్టర్‌ నుంచి కలెక్టర్‌ వరకు పలు హోదాల్లో విఽధులు నిర్వహించారు. 2015 తెలంగాణ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా మొదట బోధన్‌ సబ్‌కలెక్టర్‌గా విధులు ప్రారంభించారు. ఆ తర్వాత ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా, ఖమ్మం సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జీహెచ్‌ఎంసీ రాజేందర్‌నగర్‌ జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.

క్షేత్రస్థాయికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ప్రజలకు ప్రభుత్వశాఖల ద్వారా సేవలు.. నాణ్యమైన విద్యా, వైద్యం అందించడ మే అత్యంత ప్రాధాన్య అంశాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన ఆయన గురువారం కలెక్టరేట్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ద్వారా ప్రజలకు సముచిత సేవలు జాప్యం లేకుండా అందించడానికి కృషి చేస్తామన్నారు. అన్నిస్థాయిల్లో మౌలిక వసతులను ప్రజలకు అందేవిధంగా పర్యవేక్షిస్తామన్నారు. అదేవిధంగా మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా అందాల్సిన అన్ని రకాల పౌర సేవలు, ప్రభుత్వ విద్యా, వైద్య సదుపాయాల సకాలంలో అందించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్య పథకాలను అమలుచేసి, జిల్లా అభివృద్ధికి పాటుపడనున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అట్టడుగు లబ్ధిదారుడి వరకు చేరుకునే విధంగా కృషి చేస్తామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ సేవలు అందించిన అవగాహనతో జిల్లా ప్రజలకు తగిన పాలనా సేవలు అందిస్తామన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:49 AM