అధికారుల నిర్లక్ష్యం.. రుణమాఫీ గాయబ్!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:43 AM
బ్యాంకర్లు, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతికంగా జరిగిన పొరపాటుతో అర్హత కలిగిన రైతులు రుణమాఫీ అందుకోలేకపోయారు.
అన్ని అర్హతలున్నా రైతులకు దక్కని రుణమాఫీ
ఉమ్మడి నల్లగొండలో 15వేల మందికి అందని రూ.280కోట్లు
ఏడాది తర్వాత నిధులు వెనక్కి.. రైతుల ఆందోళన
జాబితాల తయారీ సమయంలో పాత ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్
ఆన్‌లైన్‌లో కొత్త కోడ్ నమోదుతో సాంకేతిక సమస్య
వ్యవసాయశాఖ, టీజీబీ అధికారుల సమన్వయ లోపం
సీఎం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్న రైతులు
నల్లగొండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బ్యాంకర్లు, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతికంగా జరిగిన పొరపాటుతో అర్హత కలిగిన రైతులు రుణమాఫీ అందుకోలేకపోయారు. రుణమాఫీ అమలుకు లబ్ధిదారుల జాబితాలు రూ పొందించిన సమయంలోనే పూర్వపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు అధికారికంగా తెలంగాణ గ్రా మీణ బ్యాంకుగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలు తయారుచేసే సందర్భంలో వ్యవసాయశాఖ ఏఈవోలు, ఏవోలు పూర్వపు ఏపీజీవీబీకి చెందిన ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌నే రైతుల ఖాతాలకు జత చేస్తే, రాష్ట్ర వ్యవసాయశాఖ అనుమతించిన జాబితాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చిన నూతన ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ను పొందుపరిచారు. దీంతో రుణమాఫీ కోసం వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన జాబితాల్లో గ్రామీణ వికాస బ్యాంకు ఖాతా ఉన్న రైతులకు సాంకేతిక సమస్యతో నగదు బదిలీ నిలిచింది. ఈ కారణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 15వేల మంది రైతులు, సుమారు రూ.280 కోట్ల పైచిలుకు రుణమాఫీకి అర్హత పొందినా వారి రుణాలు మాఫీ కాకపోవడంతో ఈ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయా యి. బ్యాంక ర్లు, వ్యవసాయాధికారులు చేసిన తప్పిదానికి తాము బలయ్యామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి అర్హులైన ఖాతాదారులకు రుణమాఫీ వ ర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కొత్త కోడ్‌తో సాంకేతిక సమస్య
అయితే అప్పటికే ఈ ఏపీజీవీబీ శాఖలను టీజీబీలుగా గుర్తించి వాటి పరిధిలో కొత్త ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ నెంబర్లు కేటాయించడంతో పాత నెంబర్‌తో వచ్చిన నగదు బదిలీని (రుణమాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ చేయడానికి) ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ప్రాబ్లమ్‌గా రిమార్క్ చూపింది. దీంతో పలువురు రైతులు అప్పట్లో ఆందోళనలు చేశారు. నాలుగు విడతలు రుణమాఫీ కోసం వేచి చూసిన రైతులు తమకు ఎందుకు రుణమాఫీ కాలేదనే ఆరా తీసిన క్రమంలో ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ మారడం, దాన్ని రుణమాఫీ లబ్ధిదారుల జాబితాల్లో సరిచేయకపోవడం వల్ల తాము మాఫీ పొందలేక పోయామని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా అప్పట్లోనే రైతులు ఆందోళనలు చేసి, ఇదే విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బ్యాంకు అధికారులు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వ్యవసాయాధికారులు సమాధానమిచ్చి తప్పించుకున్నారు. జిల్లాల్లో కలెక్టర్లకు సైతం ఈ అంశంపై రైతులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞాపన చేసినా వారు బ్యాంకర్లతో మాట్లాడటం, ఆ సమయంలో వారికి సాంకేతిక సమస్య గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పడంతో రైతులు ఎదురుచూసిన పరిస్థితి కొనసాగింది. మరోవైపున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ గ్రామీణ బ్యాంకులో అర్హులైన రైతులకు రుణమాఫీకి కేటాయించిన సుమారు రూ.280కోట్ల పైచిలుకు నిధులు వెనక్కివెళ్లాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల ద్వారానైనా సమస్యను ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రైతులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు విన్నవిస్తున్నారు. రైతు రుణమాఫీపై ఉన్నతాధికారులకు తెలియజేశామని, ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ సరిపోలక రైతులకు దక్కని రుణమాఫీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 9 డిసెంబరు 2024 కటాఫ్ తేదీగా రైతు కుటుంబాలు యూనిట్‌గా రూ.2లక్షల పరిమితితో రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో అర్హులయ్యే లబ్ధిదారుల జాబితాలను అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన సంబంధిత వ్యవసాయాధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 78మండలాల్లో ఇదే రీతిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో పాటు మరో 21బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించారు. అయితే ఆ సమయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్లగొండ రీజియన్ పరిధిలోని (దాదాపు ఉమ్మడి జిల్లా పరిధి) 78 శాఖల నుంచి రుణమాఫీ అర్హుల జాబితాలను రూపొందించారు. అయితే ఈ జాబితాలు తయారుచేసే సమయంలో సంబంధిత బ్యాంకు అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు అర్హులైన రైతుల ఖాతాల వివరాలతో పాటు, తమ బ్యాంకులను ఏపీజీవీబీ బ్యాంకులుగానే పేర్కొంటూ, ఏపీజీవీబీగా ఉన్న సమయంలో కేటాయించిన ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌నే వ్యవసాయాధికారులకు అందజేయగా, వారు ఈ కోడ్ నెంబర్లతోనే జాబితాలను రూపొందించి ఆన్‌లైన్ చేశారు. ఈ జాబితాల ప్రకారం వ్యవసాయశాఖ ద్వారా నాలుగు విడతలుగా రుణమాఫీ నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లోకి జమచేశారు.
అప్పులు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు: మల్లారెడ్డి, రైతు సూరారం, నల్లగొండ మండలం
మా గ్రామానికి చెందిన రైతులకు నల్లగొండలోని గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నాం. మా గ్రామానికి సంబంధించి 165మంది అర్హులైన రైతుల కుటుంబాలకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయాధికారులు జాబితాలు రూపొందించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే మా గ్రామానికి సంబంధించి గ్రామీణ బ్యాంకులో ఖాతాలున్న ఎవరి రుణమూ మాఫీ కాలేదు. ఆరాతీస్తే ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ మారడంతో సాంకేతిక సమస్యతో నిధులు మా ఖాతాల్లో పడలేదని చెబుతున్నారు. బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు సమన్వయం లేకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరిగింది. ఈ విషయమై మేం జిల్లాలో అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మా గ్రామమే కాకుండా ఉమ్మడి జిల్లాలో టీజీ బ్యాంకు పరిధిలో అన్ని చోట్లా ఈ సమస్య ఏర్పడి రైతుల రుణమాఫీ డబ్బు వెనక్కి వెళ్లిపోయింది. అప్పులు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని సాంకేతిక సమస్యగా గుర్తించి తొలుత ఎంపిక చేసిన జాబితా ప్రకారం మాకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.