నాయక్.. చదువు తక్కువ.. నేరాలు ఎక్కువ
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:04 AM
అధికవడ్డీలు, ప్లాట్ల వ్యాపారాల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు కొల్లగొటిన ఆర్థికనేరగాడు రమావత్ మధునాయక్ తాజాగా మరో భారీ వైట్‌కాలర్ స్కామ్‌తో తెరమీదకు వచ్చాడు.
మరోసారి తెరమీదకు ఆర్థికనేరగాడు మధునాయక్!
సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసుల అదుపులో మధు, అతడి బృందం?
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): అధికవడ్డీలు, ప్లాట్ల వ్యాపారాల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు కొల్లగొటిన ఆర్థికనేరగాడు రమావత్ మధునాయక్ తాజాగా మరో భారీ వైట్‌కాలర్ స్కామ్‌తో తెరమీదకు వచ్చాడు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ విచారణ చేపట్టిన శుభక్షేత్ర వెంచర్ కేసులో మధునాయక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధునాయక్‌తో పాటు అతడి బావ భరత్, అతడి నెట్‌వర్క్‌లోని కీలకమైన ఏజంట్లపైనా ఈవోడబ్ల్యూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో సైతం అధికవడ్డీల పేరుతో భారీగా నగదు కొల్లగొట్టిన మధునాయక్, భరత్‌కుమార్ మరో ఏడుగురిపై గతేడాది పీఏపల్లి పోలీ్‌సస్టేషన్‌లో భారీగా ఫిర్యాదులు రావడంతో మధునాయక్, ఇతర నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ పోలీసులు రిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఆర్థికనేరాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ కేసుని సీఐడీ విచారణకు చేపట్టింది. సీఐడీ విచారణ కొనసాగుతున్న క్రమంలో బాధితులకు ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనం దక్కలేదు. తాము పెట్టుబడి పెట్టిన కోట్లాది రూపాయలు ఎప్పుడొస్తాయోననే ఆశతో వేలాది మంది బాధితులు ఎదురుచూస్తున్న సందర్భంలో తాజాగా మధునాయక్, భరత్‌కుమార్ మరో కీలక ఆర్థికనేరంలో నిందితులుగా పోలీసులకు చిక్కడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
శుభక్షేత్ర వెంచర్ పేరుతో రూ.6 కోట్ల వరకు..
పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుతాండాకు చెందిన రమావత్ మధునాయక్ పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలో ఇంటర్ విద్యను మధ్యలోనే వదిలేసిన మధు పురుగుమందుల కంపెనీల్లో డిస్ట్రిబ్యూటర్ల కింద ఏజెంటుగా ఉండేవారు. ఈ ఉద్యోగం చేసే సందర్భంలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు, గిరిజనతండాల్లో తిరుగుతూ పరిచయాలు విస్తృతంగా పెంచుకున్నాడు. అదే సమయంలో తమ గ్రామంలో తనకు వరసకు సోదరుడయ్యే రమావత్ బాలాజీనాయక్ అధికవడ్డీల నెట్‌వర్క్ నడుపుతూ భారీగా నగదు సమీకరణచేస్తున్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లపాటు అతడి వద్ద ఏజంటుగా పనిచేశాడు. ఆ సమయంలో బాలాజీనాయక్ కోట్లాది రూపాయలను ఎలా సేకరిస్తున్నాడు? ప్రజల్ని ఎలా నమ్మిస్తున్నాడనే అంశాన్ని దగ్గరగా పరిశీలిస్తూ వచ్చాడు. ఇదే సమయంలో మధు బావ జహీరాబాద్‌కు చెందిన భరత్ కుమార్, త్రిపురారం మండలం వస్త్రాంతండాకు చెందిన బాబు, మరో వ్యక్తి రమే్‌షతో కలిసి సొంతంగా నగదు సమీకరణ మొదలుపెట్టాడు. బాలాజీనాయక్ వందకు నెలకు రూ.15 వడ్డీ ఇస్తే తాము రూ.18 వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. తాము జహీరాబాద్ వద్ద గోకుల్‌నందన్ ఇన్‌ఫ్రా పేరుతో వెంచర్ ఏర్పాటుచేశామని, దాంట్లో ముందస్తు పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మిస్తూ బ్రోచర్లు విడుదల చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లో తనకు రెండు పబ్బులున్నాయని, స్పాసెంటర్లు ఉన్నాయని, ఏపీలోని కర్నూల్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని పేర్కొంటూ డాక్యుమెంట్లు సైతం చూపించి నమ్మించారు. ఏజెంట్ల వ్యవస్థను బలంగా ఏర్పాటు చేసుకొని నగదు సమీకరణ చేశాడు. హైదరాబాద్‌లో గోకుల్‌నందన్ ఇన్‌ఫ్రా ఐడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలాసవంతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా లగ్జరీగా కనిపించేలా జీవనశైలిని మార్చి జిల్లాలో సంచరించేవాడు. స్వగ్రామంలో జనాల్ని బాగా నమ్మించే ఉద్దేశంతో భారీ స్థాయిలో ఇల్లు నిర్మించాడు. స్వగ్రామంతో పాటు సమీప ప్రాంతాల్లో, మిర్యాలగూడ పట్టణంలో వ్యవసాయభూములు, ఇళ్లు కొనుగోలు చేశారని, తమ బంధువలు పేర్లపై వీటిని పెట్టి ఇదంతా తమదేనని నమ్మించాడు. పలుగుతండా మొదలుకొని పీఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, హాలియా, తిరుమలగిరి సాగర్,దామరచర్ల మండలాల్లోని తండాల వాసులతో పాటు మిర్యాలగూడలోనూ ఏజంట్లను నియమించుకుని రూ.వందల కోట్లు వసూలు చేశాడని అభియోగాలు ఎదుర్కొన్నాడు. నెలనెలా వడ్డీలు ఠంఛనుగా చెల్లిస్తుండడంతో నమ్మిన జనాలు ఒకరిని చూసి ఒకరు భారీగా ఇతడికి పెట్టుబడులు ఇచ్చారు. భారీగా పెట్టుబడులు సమీకరించే క్రమంలో కొందరు పెట్టుబడిదారులను లగ్జరీ కార్లలో తీసుకెళ్లి హైదరాబాద్‌లో ఆఫీసు, జహీరాబాద్‌లో వెంచర్, కర్నూల్ ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీ, మైనింగ్ ప్రాంతాలను చూపి ఇదంతా తమదేనని నమ్మించాడని, ఇదంతా చూసిన మైకంలో తాము రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బంతా అతడి చేతిలో పెట్టామని బాధితులు పలువురు ఆ తర్వాత వాపోయారు. జిల్లాలో ఇతడి వద్ద ఏజంట్లుగా పనిచేసిన కొందరు వ్యాపారులు ఆ తర్వాత బిచాణా ఎత్తివేయగా, మరికొందరు డబ్బులిచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక సొంత భూములు అమ్మి మరీ చెల్లించారు. అయితే కొన్నాళ్ల తర్వాత గతేడాది జూలై నుంచి వడ్డీలు చెల్లించడంలో జా ప్యం కావడం, లేకపోతే అందుబాటులో లేకపోవడం, ఫోన్లకు సమాధా నం చెప్పకపోవడంతో అనుమానం మొదలైన బాధితులు వెంటపడగా, చివరకు బిచాణ ఎత్తివేసి పరారయ్యాడు. గతేడాది అక్టోబరులో గుడిప ల్లి పోలీ్‌సస్టేషన్‌లో వచ్చిన ఫిర్యాదుల మేరకు నల్లగొండ పోలీసులు మ ధునాయక్‌ని, అతడి సహచరులు 8మందిని అరెస్టు చేసిన విషయం తె లిసిందే. అరెస్టు సమయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజల నుంచి అప్పు రూపంలో తీసుకున్న కోట్లాది రూపాయల డబ్బుల తో మధునాయక్ హైదరాబాద్‌లో పబ్, బార్‌అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్ కోసం దాదాపు రూ.2.50కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లలో రూ.40లక్షలు, స్టాక్ మార్కెట్లలో ఇంట్రా ట్రేడింగ్‌లో రూ.60లక్షలు పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు పేర్కొన్నాడు. అ రెస్టు సమయంలో మధు బంఽధువుల పేరున పెట్టిన భూమి, మిర్యాలగూడలోని ఇళ్ల ఆస్తుల పత్రాలను, అదేవిధంగా నాలుగు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మధునాయక్ కారులోనే అతను సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు అధిక సంఖ్యలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఆర్థిక నేరాల తీవ్రత భారీ గా ఉండడంతో నవంబరులో ఈ కేసుని స్వాధీనం చేసుకున్న సీఐడీ అ ప్పటి నుంచి విచారణ సాగిస్తోంది. ఈ కేసు కొలిక్కిరాక మునుపే తా జాగా అత్యంత సంచలనం సృష్టించిన శుభప్రద వెంచర్ కేసుతో మధునాయక్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.
డబ్బులు విషయం తేల్చాలంటోన్న బాధితులు
తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ నమోదు చేసిన శుభక్షేత్ర వెంచర్ కేసులో మధుతో పాటు అతడి బావ భరత్‌కుమార్, మరికొందరు ఏ జెంట్లపై 33మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ.6 కోట్లకు పైగా నగదు కొల్లగొట్టారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది.
సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలోని ఈ వెంచర్‌లో రూ.5 లక్షలు ఆపై పెట్టుబడులు పెడితే, ఒక్కొక్కరికి 102 చదరపు గ జాల స్థలంతో పాటు, నెలనెలా రూ.25వేల చొప్పున ఇస్తామని నమ్మబలికి బాధితుల నుంచి నిధులు సమీకరించారని, అయితే ఆరునెలలు గ డిచిపోయినా ప్లాట్ల రిజిస్ట్రేషన్ కాకపోవడం, నెలనెలా ఇస్తామన్న డ బ్బు ఇవ్వకపోవడంతో పాటు మియాపూర్‌లోని ఆఫీసు వద్దకు వెళితే బౌన్సర్లతో అడ్డుకుంటుండటంతో ఈ 33 మంది కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ గాయని వ్యవహారంలో పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదయిన కేసులోనూ గాయనితో పాటు, రమావత్ మధునాయక్, అతడి బావ భరత్‌కుమార్‌పైనా కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో సదరు గాయనితోనూ మధునాయక్ నడిపిన లావాదేవీలున్నాయా?? మధునాయక్ నల్లగొండ జిల్లాలో సేకరించిన కోట్లాది రూపాయల డబ్బు ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఎక్కడ దాచాడు? అనే అంశంపై ఇటు సీఐడీ విచారణలో, తాజాగా నమోదైన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ విచారణలోనైనా నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని నల్లగొండ జిల్లాలో మధునాయక్ బాధితులు కోరుతున్నారు.