సమ్మర్‌లో సరిగమలు
ABN , Publish Date - May 12 , 2026 | 11:59 PM
వేసవి సెలవులను విద్యార్థులు, చిన్నారులు వృథా చేయకుండా ఏదో ఒక వ్యాపకంలో నిష్ణాతులయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తోంది.
ఆత్మకూరు(ఎస్) మోడల్ స్కూల్‌లో సంగీత పరికరాలపై శిక్షణా శిబిరం
100 మందితో నెల రోజులపాటు..
(ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్)
వేసవి సెలవులను విద్యార్థులు, చిన్నారులు వృథా చేయకుండా ఏదో ఒక వ్యాపకంలో నిష్ణాతులయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తోంది. సినిమాల్లోనూ, టీవీల్లోనూ, సెల్‌ఫోనలో కనిపించే సంగీత సాధన పరికరాలపై అవగాహన కల్పిస్తూనే శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎ్‌స)లోని మోడల్ స్కూల్ వేదికగా ఏర్పాటు చేసిన వేసవి శిబిరం సంగీత సరస్వతీ నిలయంగా మారుతోంది. వేసవిలో తమ ప్రతిభను కనబర్చడం, ఆసక్తిని పెంపొందించుకునేందుకు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్‌లలో ఏర్పాటుచేసిన వేసవి శిబిరం ఎంతో దోహదపడుతోంది. యోగాసనాలు, ధాన్యంతో పాటు సంగీతం, గానం, కచేరీవంటి కళలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. పల్లెల్లో సాధారణ క్రీడలతో సరిపెట్టుకునే విద్యార్థులకు ఈ క్యాంపులో సంగీత సాధన పరికరాలు, క్రీడా వస్తువులతో శిక్షణ ఇస్తున్నారు. శిబిరంలో 100 మంది విద్యార్థుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రారంభంరోజు 30 మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా 100 మందితో నెల రోజులపాటు క్యాంపును నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. కళాకారులుగా రాణించాలనే అభిరుచి ఉన్న ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ ములకలపెల్లి కాటయ్య, ఎంఈవో ధారాసింగ్ తెలిపారు.