Share News

మతశక్తులపై బహుముఖ పోరాటాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:04 AM

నల్లగొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీతో పాటు వాటి అనుబంధ మతతత్వ సంస్థ విధానాలను ఎదుర్కొనేందుకు రాజకీయ, సైద్ధాంతిక, ఆందోళనాత్మక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థాగత రంగాలలో బహుముఖ పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకెఎస్‌) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావ్లే పిలుపునిచ్చారు

 మతశక్తులపై బహుముఖ పోరాటాలు

నల్లగొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీతో పాటు వాటి అనుబంధ మతతత్వ సంస్థ విధానాలను ఎదుర్కొనేందుకు రాజకీయ, సైద్ధాంతిక, ఆందోళనాత్మక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థాగత రంగాలలో బహుముఖ పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకెఎస్‌) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావ్లే పిలుపునిచ్చారు. ఏఐకెఎస్‌ 36వ జాతీయ మహాసభల్లో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో దేశీయ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూర్చే విధానాలు అమలవుతున్నాయన్నారు. దీంతో సామ్రాజ్యవాద శక్తులకు దేశం మరింత లొంగిపోయే పరిస్థితులు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తుల రాజకీయ సైద్ధాంతిక ప్రభావం భారత రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వామపక్షాల బలోపేతం అవసరం

రాజకీయ పోరాటాలకే పరిమితం కాకుండా ప్రజల్లో చైతన్యం కల్పించేలా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని అశోక్‌ ధావ్లే సూచించారు. ప్రజాస్వామిక, లౌకిక శక్తులను ఏకం చేయడంతో పాటు వామపక్షశక్తులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్ష ఉద్యమాల స్వతంత్రశక్తిని ముఖ్యంగా అఖిల భారత కిసాన్‌ సభ సంస్థాగత బలాన్ని భారీగా వేగంగా పెంచుకోవాలన్నారు. అది జరిగినప్పుడే సమూలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు మార్గం సుగమమవుతుందన్నారు.

ఫ ఐక్య ఉద్యమాల ద్వారానే రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి విజ్జు కృష్ణన్‌ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కరువు సహాయం ప్రకటించకపోతే లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం నుంచి రైతులను కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఫ అనంతరం ప్రముఖుల మృతికి ఏఐకెఎస్‌ మహాసభ సంతాపం ప్రకటించింది. ఈ సంతాప తీర్మానాలలో పలువురు ప్రముఖుల సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.

రైతు పోరాటాల చరిత్రతో విడదీయరాని బంధం

ఫ ఆహ్వాన సంఘం అధ్యక్షలు జూలకంటి రంగారెడ్డి

దేశంలో రైతు పోరాటాల చరిత్రలో అఖిల భారత కిసాన్‌ సభ 9దశాబ్దాల ప్రయాణం విడదీయరానిదని ఆహ్వాన సంఘంఅధ్యక్షడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గొప్ప పోరాట వారసత్వాన్ని వర్తమానంతో అనుసంధానం చేయడానికి ఇది ఒక చారిత్రాత్మక అవకాశమన్నారు. రైతులు ఐక్యతతో సంఘటితమైనప్పుడు వారు చరిత్ర గమనాన్ని మార్చగలరని అభిప్రాయపడ్డారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడడమే కాకుండా సమాజంలో ప్రజాస్వామ్య పరివర్తనకు కూడా నాయకత్వం వహించగలరన్నారు. భవిష్యత్‌ పోరాటాలకు మార్గాన్ని నిర్ధేశించుకోవడానికి, ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సభలు స్ఫూర్తినిస్తాయన్నారు. నల్లగొండ రైతులకు పోరాటాలతో విడదీయరాని అనుబంధం ఉందని, నిజాం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజకార్ల దారుణాలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాముల దోపిడి, వెట్టిచాకిరి విధానంపై పోరు భారత దేశ చరిత్రలో ఒక అసాఽధారణ అధ్యాయంగా మిగిలిపోయాయన్నారు. మహాసభలో ఏఐకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్‌, ఆహ్వాన సంఘం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:04 AM