దాతరుపల్లిలో అధునాతన గోదాములు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:39 AM
జిల్లాలో కొంత కాలంగా వరి సాగు పెరుగుతోంది. దాన్యం అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతోంది.
రూ.22.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ముమ్మరంగా సాగుతున్న నిర్మాణం
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్): జిల్లాలో కొంత కాలంగా వరి సాగు పెరుగుతోంది. దాన్యం అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతోంది. ఈక్రమంలో ధాన్యాన్ని నిల్వ చేయడం కష్టమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లిలో గోదాముల నిర్మాణ పనులను చేపట్టింది. ప్రస్తుతం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పంటల సాగుకు అనుగు ణంగా ధాన్యం నిల్వ చేయడం కూడా ముఖ్యమైన ప్రక్రియే.. దానికి అనుగుణంగా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ గోదాములు నిర్మాణం చేట్టాలని ప్రభు త్వం సంకల్పించింది. 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అధునాతన గోదాములు నిర్మించడానికి దాతరుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 299లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని ఎంపికచేసి, రూ. 22.75 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి 9నెలల క్రితం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తిచేసి రైతులకు అందుబాటులో తేవాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
పంట ఉత్పత్తుల భద్రత రవాణాకు అనుకూలంగా...
పంట ఉత్పత్తుల భద్రత, రవాణాకు అనుకూలంగా పర్యావరణ హితంగా మాత్రమే కాకుండా డిజిటల్ సాంకేతికతతో పాటుగా సౌర విద్యుత్ ఇంటిగ్రేటెడ్ గోదాములు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ గోదాముల్లో ధాన్యం నిల్వచేస్తే ధాన్యం తడిసిపోకుండా, తేమశాతం పెరగడం లాంటి సమస్యలతో రైతులుఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పంట ఉత్పత్తులను భద్రపర్చుకునేందుకు అవకాశం
దాతరుపల్లి గ్రామంలో నిర్మిస్తున్న అధునాతన గోదాముల్లో రైతులు వ్యవసాయం సాగుచేసి పండించిన పంట ఉత్పత్తులను నెలల పాటుగా పంటలకు ఎలాంటి నష్టం లేకుండా భద్రపర్చుకోవడానికి అవకాశం ఉంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారులకు విక్రయించి నష్టపోకుండా ధాన్యం భద్రంగా నిల్వ ఉంచుకుని మద్దతు ధర పలికినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ శాఖలు సైతం తమ ధాన్యాన్ని నిల్వ చేయడానికి అధునాతన గోదాములు ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలే కాకుండా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. గోదాములు ప్రారంభం అయితే ఎంతోమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా సుమారు 180 మంది హమాలీలు, కూలీలకు జీవనోపాధితో పాటుగా ప్రతీరోజు లారీల రాకపోకలతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పలువురు భావిస్తున్నారు. గోదాములు నిర్మాణం అవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరగకుండా పనులు చేపట్టాలి
దాతరుపల్లిలో గోదాములు నిర్మాణంపై ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ గోదాముల నిర్మాణం గుట్టల ప్రాంతంలో జరుగు తోంది. ఈ గుట్టలను తొలగించే క్రమంలో బ్లాస్టింగులు చేయాల్సి వస్తోంది. గ్రామంలో రాజరాజేశ్వరి స్వామి ఆలయం, సమీపంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. కొన్ని ఇళ్లు ఉన్నాయి. బాస్టింగుల శబ్దాలతో కట్టడాలకు పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉ ంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్లాస్టింగ్ చేపట్టే సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ ప్రమాదాలు జరుగుకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అత్యాధునిక ప్రమాణాలతో గోదాములను నిర్మిస్తామని కాంట్రాక్టర్ నరేందర్ తెలిపారు. గిడ్డంగుల శాఖ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణ పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలిపారు.