Miryalaguda district : తెరపైకి మిర్యాలగూడ జిల్లా
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:28 AM
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోనూ కొత్త జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులతో పాటు గతంలో ఉన్న డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
పునర్ వ్యవస్థీకరణకు కమిషన్ ఏర్పాటుకు సీఎం ప్రకటనతో ఊతం
దేవరకొండను జిల్లాగా చేయాలని గతంలో డిమాండ్లు
మిర్యాలగూడకు అన్ని అర్హతలున్నాయనే వాదన
రాజకీయ మద్దతు లభిస్తేనే సాకారం
నల్లగొండ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోనూ కొత్త జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులతో పాటు గతంలో ఉన్న డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితితో పాటు ఆ ప్రాంత మేధావులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో 2106లో జిల్లాల విభజన సందర్భంలో మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాం డ్ వచ్చినా, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. అప్పట్లో దేవరకొండ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి రాగా దాన్ని సైతం పక్కన పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లానే పెద్ద జిల్లాగా ఉండడంతో ఇక్కడ ఇంకో జిల్లా ఏర్పాటుకు సానుకూలత ఉందని భావిస్తున్న మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
మిర్యాలగూడకు అన్ని అర్హతలున్నాయని..
మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా చేసి, నాగార్జునసాగర్, దేవరకొండ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను కలిపాలనే డిమాండ్ 2016లో జిల్లాల విభజన సందర్భంగా తెరపైకి వచ్చింది. మిర్యాలగూడ జిల్లాకు అన్ని అర్హతలున్నాయని జిల్లా సాధన ఉద్యమనాయకులు పేర్కొంటున్నారు. నిజాం హయాంలోనూ మిర్యాలగూ డ తహసీల్‌గా ఉండేదని (అప్పట్లో డివిజన్‌కేంద్రం), ఆ తర్వాత స్వాతంత్ర్యానంతరం తాలూకాగా, రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైందని చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో 1962 నుంచి 2009 లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వరకు మిర్యాలగూడ కేంద్రంగా లోక్‌సభ స్థానం కూడా కొనసాగిందనేది వాదన. అదేవిధంగా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా రాష్ట్రంలోనే నెంబర్‌వన్ ప్రాంతంగా ఉండడంతో పాటు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ప్రాంత పరిధిలోకే వస్తుందని, సహజసిద్ధ కృష్ణానది సరిహద్దుగా ఏపీకి సరిహద్దు ఉంటుందని, రెండు జాతీయ రహదారులతో పాటుగా, రైల్వే జంక్షన్ కూడా ఉందని చెబుతున్నారు. వ్యాపార కేంద్రంగా ఉండడంతో పెద్దసంఖ్యలో ఉపాధి కల్పనకు అవకాశం ఏర్పడిందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాగా ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే అభివృద్ధికి మూలకేంద్రంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని స్థానిక మేధావులు, రాజకీయనాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి జిల్లా సాధన ఉద్యమ సమయంలో దాదాపు అన్ని పార్టీల ప్రధాన నేతలు మద్దతిచ్చారని, ఇప్పుడు సైతం వారంతా ఏకతాటిపైకి వచ్చి జిల్లా సాధనకు మద్దతుగా నిలిచి ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరుతున్నారు. అయితే జిల్లా పరిధిలో ప్రతిపాదించే దేవరకొండ నియోజకవర్గం నుంచి మిర్యాలగూడ జిల్లాలో కలిసేందుకు 2016లో సుముఖత వ్యక్తం కాకపోగా, దేవరకొండ కేంద్రంగా అచ్చంపేటతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని కొంత ప్రాంతాన్ని కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ కొనసాగింది. అప్పటి హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సైతం ఈ జిల్లా ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వం ఈ డిమాండ్ సాధ్యం కాదని, పూర్వపు జిల్లాల పరిధిలోనే కొత్త జిల్లాల విభజన చేయాలని, భౌగోళికంగానూ దేవరకొండ జిల్లా ఏర్పాటు వీలుకాదని వివరించి దాన్ని పక్కనబెట్టింది. తాజాగా దేవరకొండ ప్రాంతానికి నల్లగొండనే దగ్గరగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుంచి సైతం మిర్యాలగూడ జిల్లా కోసం వస్తోన్న డిమాండ్‌కు ఏ మేరకు మద్దతు వస్తుందనే అంశంపై ఆధారపడి ఈ డిమాండ్ నిలబడుతుందా? లేదా? అనేది తేలనుంది. జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటుచేశాక గానీ ఈ విషయంలో రాజకీయపార్టీలు, నేతలు, ఈ ప్రాంతంలోని ప్రజల అభిప్రాయాలపై స్పష్టత రానుంది. జిల్లా ఏర్పాటుకు ఆకాంక్షించే వర్గాలు, రాజకీయ నాయకులు, పార్టీలు సైతం ఏ మేరకు అంగీకరింపజేస్తారనే దానిపైనే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు అంశం ముడిపడి ఉంది. ఈ వర్గాలు రాజకీయ కార్యాచరణకు సిద్ధమైతే తప్ప జిల్లా సాధన సాధ్యంకాదనే అభిప్రాయం వెల్లడవుతోంది.