Share News

కో ఆప్షన్‌పై కోటి ఆశలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:55 AM

నల్లగొండ కార్పొరేషన్‌లో అయిదుగురు, ఇతర అన్ని మున్సిపాల్టీల్లో నలుగురు చొప్పున కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశముంది. ఎన్నికల్లో పోటీ అవకాశం పొందలేకపోయినవారు, పోటీ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోఆప్షన్‌ సభ్యులుగా హామీ పొందనివారు ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

కో ఆప్షన్‌పై కోటి ఆశలు

పదవులకోసం నేతల చుట్టూ ఆశావాహుల చక్కర్లు

కార్పొరేషన్‌లో అయిదుగురికి, మునిసిపాలిటీల్లో నలుగురికి అవకాశం

తిరుమలగిరి మినహా అన్నిచోట్లా కాంగ్రె్‌సకే పదవులు

త్వరలో నోటిఫికేషన్‌ రానుందనే సంకేతాలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు మరో 17 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. మొదటి కౌన్సిల్‌ సమావేశాలు సైతం విజయవంతంగా ముగిశాయి. ఇక మిగిలింది కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక. ఈ నోటిఫికేషన్‌ కోసం ఆశావాహులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

నల్లగొండ కార్పొరేషన్‌లో అయిదుగురు, ఇతర అన్ని మున్సిపాల్టీల్లో నలుగురు చొప్పున కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశముంది. ఎన్నికల్లో పోటీ అవకాశం పొందలేకపోయినవారు, పోటీ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోఆప్షన్‌ సభ్యులుగా హామీ పొందనివారు ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కార్పొరేషన్‌/ మున్సిపాల్టీల్లో తొలి సమావేశం నిర్వహించిన 60 రోజుల్లోపు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి చేయాలి. ఇందుకోసం కమిషనర్లు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాల్టీల్లో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తారనే సమాచారంతో ఆశావాహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్లు, ఇతర కీలకనేతలను కలిసి ఈ పదవులిప్పించాలని కోరుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌లో అయిదుగురు కోఆప్షన్‌ కార్పొరేటర్లతోపాటు 17 మున్సిపాల్టీల్లో 68మంది కోఆప్షన్‌ సభ్యులు ఈ కోటాలో ఎన్నికవుతారు.

తిరుమలగిరి మినహా అన్ని చోట్లా కాంగ్రెస్‌కే..

ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు, మిగిలిన 17 మున్సిపాల్టీల్లో తిరుమలగిరి మినహా అన్నిచోట్లా కోఆప్షన్‌ పదవులు కాంగ్రెస్‌ నేతలకే దక్కనున్నాయి. కాంగ్రెస్‌ పాలకవర్గాలు కొలువుదీరిన మున్సిపాల్టీల్లో భూదాన్‌పోచంపల్లి మినహా అన్నింటిలో ఆపార్టీకే పూర్తి మెజార్టీరావడంతో కోఆప్షన్‌ పదవులు సైతం వారికే అవకాశముండడంతో పోటీ తీవ్రత పెరిగింది. ఎన్నికల సమయంలో మాజీ కౌన్సిలర్లు పలువురికి పోటీ చేసే అవకాశం రానిచోట ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితోపాటు క్రిస్టియన్‌ మైనార్టీలు దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆ పదవులను ఆశిస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాల్టీలో బీఆర్‌ఎ్‌సకు స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఇక్కడ ఆపార్టీ వారికే కోఆప్షన్‌ పదవులు దక్కుతాయి.

పరిపాలనపై అవగాహన

తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019లో పేర్కొన్న ప్రకారం ప్రతీ మున్సిపాల్టీలో నలుగురు సభ్యులను, కార్పొరేషన్లలో అయిదుగురు సభ్యులను కోఆప్షన్‌సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో మున్సిపాల్టీల్లో మున్సిపల్‌ పరిపాలన, నిర్వహణపై పరిజ్ఞానం, అవగాహన ఉన్న ఇద్దరిని, కార్పొరేషన్లలో అయితే ముగ్గురిని ఈకోటాలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్‌ పరిజ్ఞానమున్నవారి కోటాలో ఎన్నికయ్యే వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలో మరో ఇద్దరి చొప్పున మైనార్టీ వర్గాలనుంచి ఎన్నుకుంటారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు/కార్పొరేషన్‌లో కార్పొరేటర్లుగా ఎన్నిక కాని మైనార్టీలను గుర్తించి వారికి ఈ కోటాలో ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. కోఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేయాలంటే సదరు అభ్యర్థి ఇదే పట్టణ స్థానికసంస్థలో ఓటరుగా నమోదై ఉండడంతోపాటు నోటిఫికేషన్‌ తేదీ నాటికి 21 సంవత్సరాలకు పైబడి వయసు ఉండాలి. ఈ కోఆప్షన్‌ సభ్యులు కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో సమానంగా అన్ని విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తారు. సమావేశాల్లోనూ పాల్గొంటారు. కౌన్సిళ్లలో ఓటుహక్కు మాత్రం వీరికి ఉండదు.

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విధానమిదే...!

మున్సిపాల్టీలు/కార్పొరేషన్‌లో కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునేందుకు మున్సిపల్‌ చట్టం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచింది. దాని ప్రకారం పాలకవర్గ మొదటి సమావేశమనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నోటిఫికేషన్‌ తేదీ నుంచి వారం రోజుల పాటు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ అర్హతలను తెలియజేసే డాక్యుమెంట్లను కూడా తమ దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత మూడురోజుల్లో వాటిని పరిశీలించి అర్హులైనవారి జాబితాను వెల్లడిస్తారు. అనంతరం ము న్సిపాల్టీ/కార్పొరేషన్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను కౌన్సిల్‌ ముందు ప్రవేశపెడతారు. నిర్ణీత సభ్యులకు సమానంగా దరఖాస్తులు వస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎన్నిక ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్‌ చేపడతారు. కౌన్సిల్‌లో కోరం సభ్యులుంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. లేకపోతే మరో సమావేశానికి వాయిదా వేస్తారు. కో రం సభ్యులుంటే మూజువాణి ఓటు ద్వారా సామాన్య మెజార్టీ ప్రకారం కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. వరుసగా రెండు సమావేశాల్లోనూ కోరం లేకపోతే, మూడో సమావేశంలో ఎంద రు సభ్యులు హాజరైనప్పటికీ కోరంతో పనిలేకుండా కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికవ్వాలంటే..

ఈ కోటాలో కోఆప్షన్‌సభ్యులుగా ఎన్నికవ్వాలంటే సదరు అ భ్యర్థులు గతంలో మున్సిపాల్టీ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్లుగా, లేక గ్రామపంచాయతీ సర్పంచ్‌, లేక వార్డుసభ్యులుగా కనీసం అయిదేళ్లపాటు పనిచేసి ఉండాలి. లేక మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా మూడేళ్ల పాటు పనిచేసినవారు కూడా ఈ పదవికి పోటీపడవచ్చు. లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాల్లో గెజిటెడ్‌ హోదాలో రిటైరయిన వా రు కూడా ఈ కోటాలో కోఆప్షన్‌ సభ్యులుగా పోటీచేయవచ్చు.

మైనార్టీ కోటాలో పోటీపడేవారి అర్హతలు

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఇద్ద రు మైనార్టీ వర్గాల వారిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. తాజాగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో ఎన్నిక కాలేకపోయిన మైనార్టీ వర్గాల వారికి ఈ కోటాలో అవకాశమిచ్చేందుకు ప్రాధాన్యమిస్తారు. ఈ కోటాలో ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, పార్శీ వర్గాల నుంచి ఎన్నుకుంటారు.

ట్రాన్స్‌జెండర్లకు కో ఆప్షన్‌ పదవి ఇస్తామనే హామీపై సందిగ్ధం...

ట్రాన్స్‌జెండర్లకు అన్ని మున్సిపాల్టీల్లో కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు కృషిచేస్తామని జనవరిలో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడలేదని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నోటిఫికేషన్‌ ఇచ్చేనాటికే జీవో ఇస్తే తప్ప వారి ఎన్నికపై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేమని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. జీవో ఇస్తే ప్రస్తుతమున్న కోటాలోనే వారిని సర్దుబాటు చేసేలా సవరిస్తారా..? లేక ఆ వర్గానికి మరో కో ఆప్షన్‌ సభ్య పదవిని అదనంగా కేటాయిస్తారా..? అనే అంశం తేలనుంది. ట్రాన్స్‌జెండర్లకు కో ఆప్షన్‌ నియామకాలపైనా నోటిఫికేషన్‌లోపే జీవో వస్తే తప్ప సీఎం హామీకి మో క్షం కలగదని స్పష్టమవుతోంది.

Updated Date - Mar 07 , 2026 | 12:55 AM