ఏజెన్సీలకు ‘మధ్యాహ్న’ భారం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:39 AM
విద్యార్థుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన ఏజె న్సీ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు.. ప్రభుత్వం చెల్లించే బిల్లులు ఏమాత్రం పొంతన లేకపోవడంతో వంట చేయడం ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నానాటికీ పెరుగుతోన్న నిత్యావసరాల ధరలు
కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో మరింత భారం
ధరలకు అనుగుణంగా భోజన చార్జీల పెంపునకు ఏజెన్సీల డిమాండ్
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): విద్యార్థుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన ఏజె న్సీ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు.. ప్రభుత్వం చెల్లించే బిల్లులు ఏమాత్రం పొంతన లేకపోవడంతో వంట చేయడం ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు వడ్డించే కోడిగుడ్డు బయట మార్కెట్‌లో రూ.8 నుంచి రూ.9 ఉండగా, ప్రభు త్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుండడం ఎంత వరకు సమంజసమని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం వంట ఏజెన్సీలకు భారంగా మారుతోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి రోజురోజుకూ పెరుగుతోన్న కూరగాయలు, నిత్యావసర సరుకులతోపాటు కోడిగుడ్ల ధరలు అడ్డంకిగా మారుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పదార్థాలను వండి సకాలంలో వడ్డించే ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న వంట ఖర్చులు ప్రస్తుత మార్కెట్ ధరలకు ఏమాత్రం సరిపోవడంలేదు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు రవాణా చార్జీలు పెరిగాయి. దీంతో నిత్యావసర సరుకుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల దిగుబడి తగ్గి మార్కెట్‌లో ఒక్కసారిగా ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కోడిగుడ్ల ధరలు సైతం గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన మధ్యాహ్న భోజన మెనూను అమలు చేయడం కష్టసాధ్యంగా మారిపోతోందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 663 ప్రభుత్వ పాఠశాలలు... 39,132 మంది విద్యార్థులు
జిల్లాలో 663 ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల్లో 39,132 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం కింద అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను భరిస్తోంది. మధ్యాహ్న భోజనం అందించడానికి 1,233 కుక్స్ కం హెల్పర్స్ ఏజెన్సీలుగా పనిచేస్తున్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం వంటలు చేసి వడ్డిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం రోజువారి చార్జీల కింద ఏజెన్సీలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే ప్రాఽథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.6.78పైసలు, ప్రాఽథమికోన్నత (6 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు రూ.10.17, ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు రూ.13.17 చెల్లిస్తున్నారు. కోడిగుడ్డుకు అదనంగా రూ.6 చెల్లిస్తారు. ప్రస్తుత మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు ఒక్కో విద్యార్థికి ఒక్కో కోడిగుడ్డును అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా పారితోషికంగా నెలకు రూ.3వేలు చెల్లించనున్నారు.
ఒక్క కోడి గుడ్డుపై రూ.2 భారం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంకోసం ప్రభుత్వం అందిస్తున్న మెస్‌చార్జీ, వంట ఖర్చులు మార్కెట్ ధరల ప్రకారం ఏమాత్రం సరిపోని పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు వారంలో మూడు రోజులు అందించే ఒక్క కోడిగుడ్డుపైనే రూ.2 అదనపు భారం ఏజెన్సీలపై పడుతోంది. వంటగ్యాస్, కూరగాయలు ధరల పెరుగుదలతో ఏజెన్సీల నిర్వహణ మోయలేని భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల్లో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే సన్నబియ్యం మినహా మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం సిద్ధం చేయడానికి అవసరమైన నిత్యావసర సరుకులు ఏజెన్సీలే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం పెరుగుతున్న ధరల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా వారానికి మూడు కోడిగుడ్లు అందించడం ద్వారానే జిల్లా వ్యాప్తంగా గల ఏజెన్సీలకు రూ.70.43 లక్షల భారం పడుతోంది.
వారం రోజుల మెనూ అమలు సైతం సమస్యే..
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో సోమవారం నుంచి శనివారం వరకు మెనూ నిర్ణయించింది. ఈ మెనూ ప్రకారం కూరగాయలు, సాంబారు, పప్పు దినుసులు, ఆకు కూరలతోపాటు చిక్కి వంటి పోషకాహార పదార్థాలను అందించాల్సి ఉంటుంది. అయితే పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో నాణ్యమైన భోజనం అందించడం కష్టసాధ్యమవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావం కూరగాయల దిగుబడిపై పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్న టమాట, బీరకాయ, బెండకాయ, బీన్స్, క్యారెట్, ఆకుకూరల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. పప్పులు, వంట నూనె, పసుపు, కారం ఇతర మసాల దినుసుల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. వంటగ్యాస్ ధరలు పెరగడంతో ప్రభుత్వం నిర్ణయించిన వంటచార్జీలతో నాణ్యమైన సరుకులు అందించలేకపోతున్నామని అంటున్నారు. నాణ్యతలో రాజీపడినప్పటికీ ప్రతీనెల అప్పులు చేసి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
వంట చార్జీలను పునః సమీక్షించాలి
పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట చార్జీలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.25మె్‌సచార్జీగా నిర్ణయించాలని కోరుతున్నారు. అదేవిధంగా కోడిగుడ్లు, వంటగ్యా్‌సను ప్రభుత్వమే సరఫరా చేయాలని సూచిస్తున్నారు. ఈమేరకు వంట ఏజెన్సీ సంఘాలు జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖాధికారులకు తమ సమస్యల పరిష్కారంకోసం వినతిపత్రాలు, ధర్నాలు, ఆందోళనలు సైతం చేపడుతున్నారు.
మధ్యాహ్న భోజన వంట చార్జీలను పెంచాలి
ముంతాజ్ బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్
నిత్యావసర వస్తువుల ధరలతోపాటు కోడిగుడ్ల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలు ఆర్థికంగా నష్టపోవల్సివస్తోంది. ప్రస్తుతం మార్కెట్ రేట్లకు, ప్రభుత్వం అందిస్తున్న కుకింగ్ చార్జీలకు పొంతనలేదు. మార్కెట్‌లో ఒక్క కోడిగుడ్డు ధర రూ.8నుంచి రూ.9 ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.6 చెల్లిస్తుంది. పిల్లలకు పెద్దసైజు కోడిగుడ్డు పెట్టడం ద్వారా ఏజెన్సీ ఒక్క కోడిగుడ్డుపై రూ.2 నుంచి రూ.3 నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కుకింగ్ చార్జీలను సమీక్షించి, తక్షణమే పెంచాలి. ప్రతీ విద్యార్థికి కనీసం రూ.25 చెల్లించాలి. వంటగ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేసి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి.