ప్రజారోగ్యంతో చెలగాటం
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:27 AM
జిల్లాకేంద్రంలో తోపుడు బండ్లపై మటన్ విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు సైతం కేవలం ఆదివారం మాత్రమే కోస్తున్నారు కాబట్టి మాంసం తాజాగా ఉం టుందని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన మాంసం వండుకొని తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
తోపుడు బండ్లపై మాంసం విక్రయాలు
అపరిశుభ్ర వాతావరణంలో మాంసం దుకాణాలు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన్) : జిల్లాకేంద్రంలో తోపుడు బండ్లపై మటన్ విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు సైతం కేవలం ఆదివారం మాత్రమే కోస్తున్నారు కాబట్టి మాంసం తాజాగా ఉం టుందని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన మాంసం వండుకొని తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కనీసం పరిశుభ్రత పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
జిల్లావ్యాప్తంగా మునిసిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మాంసం విక్రయిస్తున్నారు. పరిశుభ్రమైన మాంసాన్ని విక్రయించే విషయంలో ప్రభుత్వ శాఖలైన మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. విక్రయించేందుకు సిద్ధం చేసిన గొర్రెలు, మేకలు, ఇతర వాటిని పశువైద్యాధికారులు పరిశీలించి ఆరోగ్యకరంగా ఉన్నాయని ధ్రువీకరిస్తే వాటిని కోయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఆ దిశగా ఎక్కడ కూడా ధ్రువీకరిస్తున్న సందర్భాలు లేవు. జిల్లావ్యాప్తంగా సాధారణ రోజుల్లో 60 నుంచి 80 వరకు గొర్రెలు, మేకలు, గొర్రె, మేకపోతులను కోస్తున్నారు. ఏవైనా శుభకార్యాలు, పండుగలు, సెలవు దినాల్లో రెట్టింపు సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. వీటికి అదనంగా టన్నుల కొద్ది చికెన్ విక్రయిస్తున్నారు. సాదారణ రోజుల్లో జిల్లాకేంద్రంలో 15 నుంచి 20 వరకు మటన్ దుకాణాలు ఉండగా, ఆదివారం వచ్చిందంటే చాలు జిల్లాకేంద్రంలో సుమారు 100 నుంచి 150 వరకు తోపుడుబండ్ల మాంసం విక్రయాలు వెలుస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే మటన్ 2వేల నుంచి 2,500 కిలోల మాంసం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్యకరమని ధృవీకరిస్తేనే..
మాంసం విక్రయాలు జరపాలంటే మునిసిపాలిటీలు, మండలకేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించిన కబేళాలు ఉండాలి. అయితే జిల్లాలోని మునిసిపాలిటీల్లో మాత్రం కబేళాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కబేళాలో కనీసం శుభ్రత కూడా పాటించడంలేదు. అంతేకాకుండా కోయడానికి సిద్ధంగా ఉన్న జీవాలను ఒక రోజు ముందుగానే కబేళాకు తరలించాల్సి ఉంది. అక్కడ ప్రభుత్వ పశువైద్యాధికారి పరిశీలించాల్సి ఉంది. మరుసటి రోజు వాటిని కోసే ముందు వాటికి మత్తు ఇచ్చిన తర్వాత సంబంధిత జీవాలు మత్తులోకి వెళ్లిన తర్వాతనే వాటిని వదించాల్సి ఉంది. అనంతరం వాటిని శుభ్రపర్చిన తర్వాత కూడా జీవాల్లోని అవయవాలను కూడా పశువైద్యాధికారి పరిశీలించి ఆరోగ్యకరమైన మాంసమని ధ్రువీకరిస్తేనే విక్రయించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడ కూడా అమలుకు నోచడంలేదు. మాంసం విక్రయించే వ్యాపారులు ప్రతీరోజు ఒకటి, రెండు జీవాలను వదించేందుకు మునిసిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల నుంచి అనుమతి పొంది అంతకంటే రెట్టింపు సంఖ్యలో జీవాలను వదించి మాంసం విక్రయిస్తున్నారు.
అనారోగ్యంపాలు..
జిల్లాలో మాంసం విక్రయాలు అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. వ్యాధుల భారిన పడిన జీవాలను విక్రయిస్తుండడంతో వాటిని తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మాంసం విక్రయాలు రోడ్ల పక్కన, మురుగు కాల్వలపైన, చెత్త, చెదారం ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
జిల్లాలో అనుమతులు లేకుండా అపరిశుభ్రత వాతావరణంలో మాంసం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు. అపరిశుభ్ర వాతావరణం, వ్యాధులకు గురైన జీవాలను వదించి విక్రయించడం వల్ల వాంతులు, విరేచనాలు, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపనున్నాయి. దీంతోపాటు క్షయ వ్యాధి కూడా వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. మునిసిపల్ అధికారులు మాత్రం మాంసం, చికెన్ విక్రయించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. కానీ నిబంధనలు పరిశీలించడంలేదు.
కొనుగోలు చేయాలంటే భయమేస్తోంది : నరేష్, సూర్యాపేట
సూర్యాపేటలో మాంసం కొనుగోలు చేయాలంటే భ యమేస్తుంది. ఎక్కడ కూడా పరిశుభ్రమైన ప్రాంతంలో మాంసం విక్రయించడంలేదు. ఈగలు, దోమలు మాం సంపై వాలకుండా కనీస చర్యలు చేపట్టడంలేదు. ము నిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ప్రత్యేక రోజుల్లో అయితే వ్యాధులకు గురైన జీవాలను సైతం వదించి మాంసాన్ని విక్రయిస్తున్నారు.
ధ్రువీకరించిన మాంసాన్నే విక్రయించాలి: సీహెచ్. హన్మంతరెడ్డి, మునిసిపల్ కమిషనర్, సూర్యాపేట
అధికారులు ధ్రువీకరించిన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. మునిసిపాలిటీల్లో అన్ని సౌకర్యాలతో కూడిన కబేళాలను ఏర్పాటుచేశాం. మాంసం విక్రయదారులు మునిసిపల్ అనుమతితో కూడిన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. అపరిశుభ్ర వాతావరణం, వ్యాధులకు గురైన జీవాల మాంసాన్ని తీసుకోవడంవల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.