మేళ్లచెర్వు జాతరా.. మజాకా!
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:20 AM
నడకలో రాజసం, బలమైన శరీరం, అందమైన మోపురం, తీక్షనమైన కళ్లు, చూపరులను ఆకట్టుకునే రూపం ఒంగోలు జాతి గిత్తెల సొంతం. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కళ్లార్పకుండా చూడాలనిపించే ఈ గిత్తల పోటీలకు ప్రసిద్ధి.
ఒంగోలు గిత్తల బండలాగుడు పోటీలకు భారీ స్పందన
మొదటి బహుమతి రూ.7 లక్షల విలువైన ట్రాక్టర్
తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే అత్యధికం
పోటీలకు 150 జతల గిత్తలు
నడకలో రాజసం, బలమైన శరీరం, అందమైన మోపురం, తీక్షనమైన కళ్లు, చూపరులను ఆకట్టుకునే రూపం ఒంగోలు జాతి గిత్తెల సొంతం. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కళ్లార్పకుండా చూడాలనిపించే ఈ గిత్తల పోటీలకు ప్రసిద్ధి. శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల పోటీల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో పశుపోషకులు ఆసక్తి కనపరుస్తారు. గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఒంగోలు గిత్తెల పోటీలకు మంచి స్పందన లభిస్తోంది. గిత్తల ప్రదర్శనను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-మేళ్లచెర్వు)
ఒంగోలు జాతి పశువుల పోటీల కోసం శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా ప్రాంగణాన్ని ఏర్పాటుచేయడంతో పాటు పందేలను వీక్షించే అభిమానులకు చలువ పందిళ్లు వేయడంతో పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. 250 అడుగుల పొడవున ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో ఎనిమిది విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. మూడేళ్ల వయస్సు కలిగిన పశువులు, ఈ పోటీలలో మొదటిసారిగా పాల పళ్లు విభాగంలో పోటీ పడతాయి. రెండు పళ్లు, నాలుగు, ఆరు పళ్లు, న్యూకేటగిరి సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ అనే ఎనిమిది విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. నిర్దేశించిన కోర్టులో రాతి బండను ఉంచి, నిర్ణీత సమయంలో అధిక దూరం లాగిన గిత్తలను విజేతలుగా ప్రకటిస్తారు. పాల పళ్ల విభాగానికి ఐదు క్వింటాల బరువు కలిగిన రాతి బండ కేటాయించగా సీనియర్ విభాగానికి 25 క్వింటాళ్ల రాతి బండను కేటాయించారు. మిగతా జతలకు వాటి కేటగిరిని బట్టి రాయి బరువులో మార్పులు, చేర్పులు చేస్తుంటారు.
పందేల నిర్వహణకు రూ.2.5 కోట్లు
ఒంగోలు గిత్తెల పోటీల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుంది. విజేతలకు బహుమతులు, స్టేజీ నిర్వాహణ, పశుపోషకులకు, సహాయకులకు, ఎద్దులకు వసతి భోజనం, ఇతరత్రా ఏర్పాట్లకు రూ.2 నుంచి రూ.2.5కోట్ల వరకు ఖర్చవుతుంటుంది. మేళ్లచెర్వుతో పాటుగా సమీప గ్రామాల అభిమానుల నుంచి విరాళాలు సేకరించి, వీలుబట్టి ప్రతీ జతను ఒకరు, ఇద్దరు దాతలతో పూజా కార్యక్రమం, ప్రారంభోత్సవంలో వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారు. దాతల సహకారం, ప్రభుత్వ సహకారంతో ఈ పోటీలు పెద్దఎత్తున విజయవంతం చేస్తున్నారు.
ఎద్దులకు ప్రత్యేక అభిమానులు
పశుపోషకులు ఎద్దులకు ప్రత్యేకంగా నామకరణం చేయటం, పోటీల్లో నైపుణ్యాన్ని బట్టి పశువులకు, ప్రత్యేక అభిమానులు ఉంటారు. వాటి అభిమానుల గిత్తలు పోటీకి వచ్చినప్పుడు ఆనందం అవధులు దాటి, వాటి విజయానికి, తమ హర్షధ్వానాల ద్వారా ఉత్సాహపరుస్తుంటారు.
యాంకర్ పాత్రపై ప్రశంసలు
ఎద్దుల పందేల నిర్వహణలో యాంకర్ రాధాకృష్ణ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పందేల నిర్వహణలో 20 ఏళ్ల అనుభవం కలిగిన రాధాకృష్ణ తన తోటి సిబ్బంది శ్రీనివాసరావు, సుబ్బారెడ్డిలతో కలిసి ఎద్దుల యజమానుల పేర్లు, ఎద్దుల విశిష్టత, ఎద్దులు సాధించిన బహుమతులు, ప్రతీ 250అడుగుల దూరాన్ని లాగిన తర్వాత ప్రస్తుతం ఏ స్థానంలో కొనసాగుతున్నాయి అనే విషయాలు సామాన్యుల సైతం సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంటారు. అదేవిధంగా పశుపోషకులకు, నిర్వాహణ కమిటీ సభ్యులకు సమన్వయంగా ఉంటూ పోటీలు నిర్వహిస్తుండటంతో రాధాకృష్ణను అంతా అభినందిస్తున్నారు.
పశుపోషకులను
ఊరిస్తున్న బహుమతులు
మేళ్లచెర్వు ఒంగోలు జాతి పందేల్లో పెద్దమొత్తంలో ఇచ్చే బహుతులు పశుపోషకులను ఊరిస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధ ంగా ఇక్కడ బహుమతులు ఉంటాయి. పశుపోషకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆంధ్రప్రదేశ రాష్ట్రం మహానందిలో సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా రూ.1.50 లక్షలు ఇస్తుండగా మేళ్లచెర్వు పందేల్లో రూ.7లక్షలు విలువైన ట్రాక్టర్‌ను అందిస్తున్నారు. ఎనిమిది విభాగాల్లో ఒక్కో విభాగానికి 10బహుమతుల చొప్పున 80 బహుమతులు అందిస్తున్నారు. అతి తక్కువ బహుమతి రూ.15 వేలు ఉండగా, సీనియర్ విభాగంలో మొదటి బహుమతిగా ట్రాక్టర్‌ను బహుకరిస్తున్నారు. ట్రాక్టర్‌తో పాటు రాయల్ ఎనఫీల్డ్ ఇతర ఆకర్షణీయమైన బహుమతులతో పాటుగా రూ.50లక్షలు పైచిలుకు బహుమతులు పశుపోషకులకు అందిస్తున్నారు. దీంతో ప్రతీ ఏడాది 110 జతల యజమానులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.