బ్రహ్మోత్సవాలకు మట్టపల్లి క్షేత్రం ముస్తాబు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:52 PM
బ్రహ్మోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు జరుగనున్నాయి. త్రయోదశిలో నిర్వహించే కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.
మఠంపలి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు జరుగనున్నాయి. త్రయోదశిలో నిర్వహించే కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయాన్ని రకరకాల విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వేసవి దృష్ట్యా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగంణంలో చలువపందిళ్లు ఏర్పాటుచేశారు. వేసవి దృష్ట్యా నీడ, మంచీనీరు, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ బాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, మాచర్ల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు నడపనున్నారు. ఉత్సవాలను బొర్రా వెంకటవాసుదేవాచార్యులు, పరాశరం వెంకటాచార్యులు, నారాయణం హరికిరణాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో జ్యోతి తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో మట్టపల్లి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం ఐదు గంటల నుంచి దైవ దర్శనాలు ప్రారంభమవుతాయని అర్చకులు తెలిపారు.
ఇలా చేరుకోవచ్చు...
మట్టపల్లి క్షేత్రానికి చేరుకునేందుకు ప్రధానంగా మూడు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వారు వయా సూర్యాపేట మీదుగా కోదాడ, హూజూర్‌నగర్ నుంచి చేరుకోవచ్చు. సుమారు 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
హైదరాబాద్ నుంచి మట్టపల్లికి మరో మార్గం నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, హూజూర్‌నగర్ నుంచి చేరుకోవచ్చు. ఈ మార్గం 208 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు వయా పిగుడురాళ్ళ, దాచేపల్లి మీదుగా తంగెడ నుంచి మట్టపల్లి క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు
మట్టపల్లి బ్రహ్మోత్సవాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు ఆదేశించారు. ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. 30న అర్ధరాత్రి కల్యాణానికి భారీస్థాయిలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున బందోబస్తు ఏర్పాటు చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డికి సూచించారు. ఆలయం, కల్యాణ మంటపం వద్ద ఏర్పాట్లపై ఆలయ ధర్మకర్తలు విజయ్‌కుమార్, మట్టపల్లిరావును అడిగి తెలుసుకున్నారు. వారి వెంట హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఈఓ జ్యోతి, తహసీల్దార్ మంగా, ఎస్‌ఐ బాబు, సర్పంచ విజయశాంతిఅప్పారావు, అధికారులు ఉన్నారు.