Share News

భక్తిశ్రద్ధలతో సామూహిక గిరిప్రదక్షిణ

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:35 AM

యాదగిరిగుట్ట నృసింహుడి క్షేత్రంలో సోమవారం సామూహిక గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది.

భక్తిశ్రద్ధలతో సామూహిక గిరిప్రదక్షిణ
యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

భజనలు, కీర్తనలతో ప్రతిధ్వనించిన యాదగిరిక్షేత్రం

యాదగిరిగుట్ట అక్టోబరు 12, (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట నృసింహుడి క్షేత్రంలో సోమవారం సామూహిక గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి వేడుకల్లో భాగంగా ఆలయంలో వేకువజామున అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపి నిత్యారాధనలు జరిపించిన అర్చకులు ఆస్థానపరంగా ఆరాధనలు జరిపి ఉత్సవ మూర్తులకు హారతి నివేదించారు. ముఖమండపంలో 108 కలశాలు ఏర్పరచి వాటిపై కొబ్బరికాయలు పేర్చి అందులో పంచామృతాలు నింపి పంచసూక్త పఠనాలతో హవనం చేపట్టారు. ఉత్సవమూర్తులను, అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. పండితుల వేదమంత్రాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి 108 స్వర్ణపుష్పాలతో అర్చించారు. సాయంత్రం స్వామి వారి జన్మనక్షత్రంలో భాగంగా దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పడమర దిక్కున ప్రారంభమై..

వైకుంఠద్వారం నుంచి సామూహిక గిరిప్రదక్షిణ పడమర దిక్కునుంచి ప్రారంభమై తూర్పు దిక్కు నుంచి భక్తులు చేరుకుని కొండెక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో వేకువజాము నుంచి రాత్రి వరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున 5.30 గంటలకు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు హారతి సమర్పించగా, ఆలయ ఈవో భవానీశంకర్‌ గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. కొండచుట్టూ రెండున్నర కిలోమీటలర్ల మేర 45 నిమిషాల పాటు గిరిప్రదక్షిణ సాగింది. మధ్యాహ్నం (ఆరగింపు) వరకు నారసింహ నామంతో దివ్యక్షేత్రం ప్రతిధ్వనించింది. మెట్ల దారిన కొండెక్కిన 1000మంది భక్తులకు ఉచితదర్శనం టికెట్లను అధికారులు పంపిణీ చేశారు.

గిరిప్రదక్షిణలో 11వేల మంది భక్తులు

11వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకోగా ఉదయం క్యూలైన్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొసాగింది. యాదగిరిగుట్ట సబ్‌ డివిజన్‌ డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు పర్యవేక్షణలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బొడ్డుపల్లి భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యాదగిరికొండపై శివకేశవులకు నిత్యపూజలు శాస్రోక్తంగా కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 24,12,534 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీశంకర్‌ తెలిపారు.

నేడు గుట్ట ధర్మకర్తల పాలకమండలి సమావేశం

యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి 3వ సమావేశం ఈ నెల 13వ తేదీన కొండపైన ఉదయం 10గంటలకు ఏర్పాటు చేసినట్లు ఈవో భవానీశంకర్‌ తెలిపారు. అనంతరం 11:45 గంటలకు స్థానిక ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు

Updated Date - Oct 13 , 2026 | 12:35 AM