నల్లగొండకు మణిహారం
ABN , Publish Date - May 01 , 2026 | 12:21 AM
నల్లగొండ జిల్లాకేంద్రంలో హైదరాబాద్ ఔటర్‌రింగురోడ్డు తరహాలో నల్లగొండ జిల్లా కేంద్రం చుట్టూ 545వ జాతీయరహదారిలో భాగంగా నిర్మిస్తోన్న నాలుగు వరుసల బైపా్‌సరోడ్డు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది.
శరవేగంగా సాగుతోన్న నిర్మాణ పనులు
అక్టోబరు 2027 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక
14 కిలోమీటర్ల నాలుగులేన్ల రహదారి
నాలుగుచోట్ల ఆర్‌వోబీ లు, మరోచోట రైల్వే ఓవర్ బ్రిడ్జి
ఇంకో రెండు కెనాల్ బ్రిడ్జిల నిర్మాణాలు
థర్డ్‌పార్టీ ఏజన్సీతో నాణ్యతా పరీక్షలు
- (ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): నల్లగొండ జిల్లాకేంద్రంలో హైదరాబాద్ ఔటర్‌రింగురోడ్డు తరహాలో నల్లగొండ జిల్లా కేంద్రం చుట్టూ 545వ జాతీయరహదారిలో భాగంగా నిర్మిస్తోన్న నాలుగు వరుసల బైపా్‌సరోడ్డు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. నల్లగొండ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివార ణతో పాటుగా ఇటు 545 జాతీయరహదారిపైన (నకిరేకల్- నాగార్జునసాగర్ సెక్షన్), అటు నార్కట్‌పల్లి- అద్దంకి-మేదరమెట్ల రహదారిపైనా వచ్చే భారీ, రవాణా వాహనాలు నగరంలోకి రాకుండా వెళ్లిపోయేలా ఈ బైపా్‌సరోడ్డుని చేపట్టారు. ఈ రహదారి నల్లగొండ పట్టణానికి మణిహారంగా మారనుంది.
నల్లగొండ చుట్టూ నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు గతంలో (నకిరేకల్- నాగార్జునసాగర్ సెక్షన్)545వ జాతీయరహదారి నిర్మాణంలో భాగంగానే నిర్మించాల్సి ఉన్నప్పటికీ నల్లగొండ నగరం నుంచి రోడ్డు వెళ్తుండటంతో అప్పట్లో ప్రజాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తూ రాగా, రోడ్లు,భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక, కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌గడ్కరీతో పలుమార్లు సమావేశాలు జరిపిన అనంతరం ఈ రోడ్డుతో ఎక్కువగా నివాసాలు నష్టపోకుండా నగరం చుట్టూ 14 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల బైపా్‌సరోడ్డుని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ డిజైన్ చేసి ఆమోదించింది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.276 కోట్లతో టెండర్లు పిలవగా, రూ.216.39 కోట్లకు ఎస్‌ఎల్‌ఎమ్‌ఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకుంది.
2027 అక్టోబరు నాటికి పనులు పూర్తయ్యేలా..
నల్లగొండ నగరానికి మణిహారంలా ఉండే ఈ నాలుగు వరుసల బైపా్‌సరోడ్డు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉంది. అక్టోబరు 2025లో పనులు ప్రారంభించగా, 2027 అక్టోబరు నాటికి అన్నిహంగులతో పనులు పూర్తిచేయాల్సి ఉంది. అందుకనుగుణంగా నిర్మాణ సంస్థ పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తిచేసి స్వాధీనం చేసుకున్న జాతీయరహదారుల అథారిటీ అధికారులు రోడ్డు నిర్మాణాన్ని, బ్రిడ్జి పనులను ఏకకాలంలో చేపట్టారు. మొదటి దశలో రోడ్డు ఫార్మేషన్ పనులు దాదాపు పూర్తికాగా, బ్రిడ్జిల నిర్మాణానికి పిల్లర్ల ఏర్పాటు పనులు సైతం కొనసాగుతున్నాయి. వేసవి ముగిసేనాటికి మట్టి పనులు మెజార్టీశాతం పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు.
థర్డ్ పార్టీ ఏజెన్సీతో క్వాలిటీ కంట్రోల్ చెకింగ్
బైపా్‌సరోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మట్టి నాణ్యతలేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారా మట్టి నాణ్యతా పరీక్షలు నిర్వహించిన నివేదికలను జాతీయరహదారుల సంస్థ అధికారులు విడుదల చేశారు. ఇప్పటివరకు మట్టి వినియోగించిన ప్రతీ చెరువులో శాంపిల్స్ తీసుకొని ఎంతవరకు తవ్వాలని నిర్ణయించారో ఆ మేరకు మట్టిని సేకరించి తొలుత స్థానికంగా ఉన్న జాతీయరహదారుల సంస్థ క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో, నిర్మాణ సంస్థ యూనిట్‌లో నాణ్యతా నిర్థారణ నిర్వహించారు. ఆ తదుపరి అదే శాంపిల్స్‌తో హైదరాబాద్‌లో ప్రభుత్వ గుర్తింపుపొందిన మరో థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో నాణ్యతా పరీక్షలు నిర్వహించి నివేదికలు తెప్పించారు. ఈ నివేదికల్లో ఈ మట్టిని రోడ్డు నిర్మాణానికి వాడవచ్చని, సంతృప్తికరమైన,నాణ్యమైన మట్టిగానే పేర్కొన్న తర్వాతనే ఈ చెరువుల నుంచి మట్టిని తరలించామని జాతీయరహదారుల సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేంతవరకు నిరంతరం ప్రతీ సోర్స్ నుంచి మట్టిని తవ్వేటప్పుడు శాంపిల్స్ తీసుకొని క్వాలిటీ పరీక్షలు నిర్వహించి ఆమోదం ఉంటేనే మట్టి తవ్వకాలు జరిపిస్తున్నామని జాతీయరహదారులసంస్థ అధికారులు పేర్కొంటున్నారు.
పానగల్ ఛాయాసోమేశ్వరాలయం సమీపం నుంచి మెడికల్ కాలేజీ వరకు...
నూతనంగా నిర్మిస్తోన్న బైపా్‌సరోడ్డు పానగల్ సమీపంలోని నకిరేకల్-నాగార్జునసాగర్ జాతీయయరహదారి(565నెంబర్)పైన ఛాయాసోమేశ్వరాలయం సమీపం నుంచి మొదలై గంధంవారిగూడెం సమీపంలోని మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న నకిరేకల్-నాగార్జునసాగర్ రహదారిని కలుస్తుంది. ఛాయాసోమేశ్వరాలయం వద్ద నుంచి పానగల్ మీదుగా ఎస్‌ఎల్‌బీసీ కాల్వ, కట్టంగూరు రోడ్డు మీదుగా వెళుతూ అర్జాలబావి సమీపంలోని నార్కట్‌పల్లి- అద్దంకి-మేదరమెట్ల రహదారిని దాటుతుంది. అక్కడ నుంచి మర్రిగూడ శివార్లలోని రైల్వేట్రాక్‌ని క్రాస్‌చేస్తూ అక్కడి ఎస్‌ఎల్‌బీసీ కాల్వ మీదుగా నేరుగా మునుగోడు రోడ్డు పక్కనున్న హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా గుండ్లపల్లి రోడ్డువరకు వెళ్తుంది. అక్కడ నుంచి ఖాతాల్‌గూడ్ హౌసింగ్ బోర్డు సమీపం (దేవరకొండ రోడ్డుని క్రాస్‌చేస్తూ) నుంచి గంధంవారిగూడెం సమీపంలో నుంచి మెడికల్ కాలేజీ చివరి పాయింట్ అయిన నకిరేకల్-నాగార్జునసాగర్ రోడ్డుకి కలుస్తుంది.
12.32 కిలోమీటర్ల రోడ్డు, బ్రిడ్జిలు, వంతెనలు
మంజూరైన 14 కిలోమీటర్ల బైపాస్‌రోడ్డులో నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల రహదారి 1.68 కిలోమీటర్లు ఉండగా, దాన్ని మినహాయిం చి మిగిలిన 12.32 కిలోమీటర్ల నాలుగు లేన్ల నూతన రహదారిని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుతో పాటు ఇందులో అంతర్భాగంగా నల్లగొండ నగరం చుట్టూ నాలుగుచోట్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, మరోచోట రైల్వేఓవర్ బ్రిడ్జిని, మరో రెండు చోట్ల కెనాల్ క్రాసింగ్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. మునుగోడు రోడ్డు, దేవరకొండ రోడ్డు, కట్టంగూరు రోడ్డు, నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల రోడ్డు(ఆర్జాలబావి-మర్రిగూడమధ్యలో)ని దాటే నాలుగుచోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, మర్రిగూడ రెవెన్యూ శివార్లలో రైల్వేలేన్ దాటేచోట రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
గుర్తించిన చెరువుల నుంచి అనుమతి మేరకే మట్టి తవ్వకాలు
బైపా్‌సరోడ్డు నిర్మాణానికి సుమారుగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, మరో 4 లక్షల మెట్రిక్‌టన్నుల మేర కంకర వినియోగించాల్సి ఉంటుందని అంచనావేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర మట్టిని సేకరించేందుకు జాతీయరహదారుల సంస్థ జిల్లాలో ఈ రోడ్డు నిర్మాణమవుతున్న సమీప ప్రాంతాల్లోని మట్టి గుట్టలతో పాటు, చెరువుల్లో నుంచి మట్టిని సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పథకం కింద చెరువుల పునరుద్ధరణ పథకాన్ని చేపట్టగా, ఆ పథకం కింద గుర్తించిన చెరువుల్లో మట్టిని జాతీయరహదారుల సంస్థ చేపట్టే రోడ్ల నిర్మాణాలకు వాడుకోవచ్చని పేర్కొంటూ మార్చి, 2025లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల ఆధారంగానే కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జాతీయరహదారుల సంస్థ కోరిన ప్రకారం జిల్లాలోని చెరువుల నుంచి ఈ బైపాస్ రోడ్డుకు మట్టిని తరలించేందుకు అనుమతులిచ్చారు. దీని ప్రకారమే జిల్లాలోని కంచనపల్లి, పానగల్, దోమలపల్లి, బుద్ధారం తదితర చెరువులతో పాటు అనంతారం గుట్టల నుంచి మట్టినితవ్వి ఈ రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. తవ్విన మట్టికి నిబంధనల ప్రకారం మైనింగ్ శాఖకు సీనరేజీ, జిల్లా మినరల్ ఫండ్, పర్మీట్ టాక్స్‌ని నిర్మాణ సంస్థ చెల్లిస్తోంది. నిర్మాణ సంస్థ ప్రతినెలా తీసుకునే బిల్లుల్లోనే ఈ టాక్స్‌లన్నీ డిటక్షన్ అవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఈ రోడ్డునిర్మాణానికి వాడిన మట్టి, కంకరకు గాను రూ.2.92 కోట్ల మేర మైనింగ్ సీనరేజీ, జిల్లా మినరల్ ఫండ్, పర్మిట్ టాక్స్ రూపంలో చెల్లించారు. ప్రతి నెలాఖరులో ఇచ్చే బిల్లుల ఆధారంగా ఆటోమేటిక్‌గా వాడిన మట్టికి పన్నులు డిడక్షన్ అవుతున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు 5 లక్షల మెట్రిక్‌టన్నుల వరకు మట్టి వినియోగించారని అధికారులు పేర్కొన్నారు.
నిర్మాణ తర్వాత ఐదేళ్ల పాటు నిర్వహణ
ఈపీసీ పద్ధతిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తిచేయడంతో పాటు, ఆ తదుపరి మరో ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు సైతం ఈ నిర్మాణ సంస్థనే చేపట్టాల్సి ఉంది. నాణ్యతలేకుండా నిర్మాణం చేపడితే, ఆ తర్వాతనైనా ఐదేళ్ల పాటు ఆ సంస్థనే నిర్వహణలో ఉంటుందని చిన్నమరమ్మతు వచ్చినా మళ్లీ ఆ సంస్థతోనే నిర్మింపజేస్తామని ఒక్కరూపాయి కూడా ప్రభుత్వం నుంచి వెచ్చించేది ఉండదని పూర్తి నాణ్యతతో రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జాతీయరహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారు.
జిల్లా కమిటీ అమోదంతోనే మట్టితవ్వకాలు
బైపాస్ రోడ్డు నిర్మాణానికి చెరువుల్లో మట్టిని తవ్వేందుకు కేంద్రం నుంచి అనుమతులున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన అనంతరమే చెరువుల్లో నిర్ణీత పరిధిమేరకు మట్టి తవ్వకాలకు అనుమతిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కూడిన కమిటీ నిర్థారించిన తర్వాతనే నిర్ణీత పరిధిలో తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎక్కడైనా పరిధి మించి తవ్వినా, లేక ఈరోడ్డు నిర్మాణం కోసం తవ్విన మట్టిని వేరే చోటకు తరలించినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్, మైనింగ్ అధికారులు పేర్కొన్నారు.
పూర్తి నాణ్యతతో రోడ్డు పనులు : ధర్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్, జాతీయరహదారుల సంస్థ
నల్లగొండ నగరం చుట్టూ నకిరేకల్-నాగార్జునసాగర్ సెక్షన్‌లో నిర్మిస్తోన్న నాలుగు వరుసల బైపా్‌సరోడ్డు పనులు పూర్తి నాణ్యతతో కొనసాగుతున్నాయి. మట్టి తవ్వకాలకు నిర్ణయించిన ప్రతీ సోర్స్ నుంచి శాంపిల్స్ సేకరించి థర్డ్‌పార్టీ ఏజెన్సీతో క్వాలిటీ చెకింగ్ చేసి క్వాలిటీ నిర్థారణ జరిగిన తర్వాతనే ఆ సోర్స్ నుంచి మట్టిని తరలించేలా చూస్తున్నాం. క్వాలిటీ చెకప్ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోము. అదేవిధంగా నాణ్యతలేదని, నల్లమట్టి, బండరాళ్లు వాడుతున్నారనేవి ఆరోపణలు మాత్రమే. జాతీయరహదారుల సంస్థ నిర్థేశించిన ప్రమాణాల మేరకు రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి ఈఈ స్థాయి మొదలుకొని ఏఈల వరకు ప్రతిరోజూ పనిప్రదేశంలో ఉండి పర్యవేక్షణ, నాణ్యతాపరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఈ రోడ్డు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.