Share News

ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:17 AM

జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్‌లో ఉన్న చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ చేకూరనుంది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, సమగ్ర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ ఈ నిధులను విడుదల చేసింది.

ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ

అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్‌లో ఉన్న చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయానికి మహర్దశ చేకూరనుంది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, సమగ్ర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ ఈ నిధులను విడుదల చేసింది.

పానగల్‌ సమీపంలోని ఛాయాసోమేశ్వర ఆలయం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యావరణ, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఈ నిధులతో ఆలయంతో పాటు సమీపంలోని జలవనరులను, పరిసర ప్రాంతాలను సుందరీకరణ చేస్తారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్‌ బృందం సిద్ధం చేసిన అంచనాల ఆధారంగా ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఛాయా సోమేశ్వరాలయం ఒక అద్భుత చారిత్రత్మాక శాస్త్రసాంకేతిక వైశిష్ట్యం కలిగిన శైవ క్షేత్రం కాగా, ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు, భక్తులు వస్తుంటారు. ఇక్కడి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొనడంతోపాటు ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా గడుపుతుంటారు. ఏడా మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజల్లో పాల్గొంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయంతో పాటు చారిత్రాత్మక శిల్పాలు, పురావస్తు మ్యూజియం కూడా ఉంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తిర్చిదిద్దనున్నారు.

ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కృషి...

- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ చారిత్రాత్మక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయ సోమేశ్వరాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. శివలింగంపై నిరంతరం ఛాయ కనపడేలా నిర్మించిన సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వందల ఏళ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి శివలింగంపై నిరంతరం ఛాయ కనిపించేలా నిర్మించిన ఈ ఆలయం తెలంగాణ శిల్ప కళా వైభవానికి, ప్రాచీన విజ్ఞాన నిర్మాణానికి అద్భుత నిదర్శనమన్నారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతో పాటు మరింత పర్యాటక ప్రాధాన్యం తీసుకరావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..

- మేయర్‌ బుర్రి చైతన్యశ్రీనివా్‌సరెడ్డి

పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తిర్చిదిద్దుతాం. ఆలయ అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరయ్యే లా కృషిచేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఛాయా సోమేశ్వరాల యం చరిత్రకు సజీవసాక్ష్యం. ఈ ఆలయానికి ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేయడం హర్షనీయం. ఆలయ పరిసరాల సుందరీకరణ, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిదులు ఎంతోగానో తోడ్పడతాయి. చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పానగల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. చారిత్రాత్మక ఆలయాల పరిరక్షణతోపాటు పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతోగానో కృషిచేస్తోంది.

Updated Date - Oct 24 , 2026 | 12:17 AM