చెరువులు, కుంటల మట్టిపై మాఫియా కన్ను
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:16 AM
చెరువులు, కుంటలపై మట్టిమాఫియా కన్నుపడింది. పూడికతీసి చెరువుల్లో నీటి నిల్వల పెంపు, రైతుల సాగుభూములను సారవంతం చేసేందుకు చెరువుమట్టి తరలించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తున్నారు.
పూడికతీత పేరుతో నామమాత్రపు అనుమతులు
నగర శివారు ఇటుకబట్టీలకు యథేచ్ఛగా తరలింపు
పట్టించుకోని ఇరిగేషన్, మైనింగ్‌శాఖలు
ప్రభుత్వ ఖజానాకు గండి.. నెరవేరని నీటి నిల్వ లక్ష్యం
(ఆంధ్రజ్యోతి),యాదాద్రి: చెరువులు, కుంటలపై మట్టిమాఫియా కన్నుపడింది. పూడికతీసి చెరువుల్లో నీటి నిల్వల పెంపు, రైతుల సాగుభూములను సారవంతం చేసేందుకు చెరువుమట్టి తరలించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తున్నారు. చెరువులు, కుంటలను తవ్వి ఇటుకబట్టి, ఇతర అవసరాలకు మట్టి తరలించే వ్యాపారాలకు కొందరు తెరలేపారు.
బొమ్మలరామారం మండలంలో గడిచిన ఐదేళ్లలో సుమారు 50వేల నుంచి 70వేల ట్రిప్పుల వరకు మొరాన్ని పలు గ్రామాల నుం చి టిప్పర్లలో తరలించార ని అంచనా. మం డలంలో ఉన్న సుమా రు 110 ఇటుక బట్టిలకు 300 నుంచి 500 ట్రిప్పుల నల్లమట్టిని తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ లారీలో సుమారు 16 టన్నుల మొరం పడుతుండగా, రూ.6వేలకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 8లక్షల టన్నుల మొ రం తరలింది. నల్లమట్టి ఇటుక బట్టికి 200 ట్రిప్పుల చొప్పున సుమారుగా 3.50లక్షల టన్నులు ఏటా తరలిస్తున్నారు. నల్లమట్టికి లారీ ట్రిప్పుకు రూ.16వేలు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను ఆసరా చేసుకుని నామమాత్రపు పరిమాణంలో అనుమతులు పొంది, అందినకాడికి మట్టి తవ్వేస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు వందలకొద్ది టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. మైనింగ్‌శాఖకు అణువంత ఆదాయం చూపుతూ జిల్లాలో మట్టితవ్వకాలతో చెరువులు, కుంటలు, మట్టిరవాణాతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. పరిమితికి మించి వాహనాల్లో మట్టిని రవాణా చేస్తుండటంతో రోడ్లన్నీ గుంతలమయమవుతున్నాయి. వీరికి మైనింగ్, నీటిపారుదలశాఖల అధికారులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
నామమాత్రపు అనుమతులతో..
జిల్లాలో నీటిపారుదలశాఖ రికార్డుల ప్రకారం 1,182 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా 2015లో అప్పటి ప్రభుత్వం చెరువుల్లో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని రైతుల పొలాలకు తరలించేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను మట్టి అక్రమరవాణాదారులకు వరంగా మారింది. చెరువుల్లో మట్టి తవ్వకానికి నిబంధనల ప్రకారం తహసీల్దార్ అనుమతులతో పాటు నీటిపారుదల, గనులు, భూగర్భజలశాఖ సాంకేతిక నివేదికలు అందించాలి. ఆ నివేదిక ప్రకారం ఎంత విస్తీర్ణంలో పూడిక, ఎంతలోతు, ఎంత పరిమాణంలో మట్టితీయవచ్చనే సాంకేతిక నివేదిక రూపొందించాలి. ఆ పరిమితులకు లోబడే అనుమతులు జారీ చేయాలి. అయితే మట్టివ్యాపారులతో అధికారుల లోపాయికారీ వ్యవహారాల కారణంగా ఉత్తర్వుల్లో నామమాత్రపు పరిమాణాన్ని నమోదు చేసి, పదుల రెట్లు అధికంగా అక్రమరవాణాకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం మైనింగ్, నీటిపారుదలశాఖ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే మట్టి తవ్వకాలు చేయాలి. ఎంత విస్తీర్ణం, ఎంత లోతు వరకు తవ్వాల్సిన ప్రదేశాన్ని మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తున్న నీటిపారుదల, మైనింగ్‌శాఖ అధికారులు, ఆ తర్వాత అటువైపు కనీసం తొంగిచూడటం లేదు. దీంతో మీటరులోతు మట్టి తవ్వాల్సిన ప్రదేశంలో దాదాపు రెండు నుంచి మూడు మీటర్ల వరకు తవ్వకాలు చేస్తున్నారు. కేవలం ఎఫ్‌టీఎల్ పరిధికి లోబడి మాత్రమే అధికారులు మార్కింగ్ చేయాలి. కానీ దీన్ని పట్టించుకోకుండా, సరిహద్దున పంటపొలాల్లో సైతం తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల లోపే తవ్వకాలు చేయాలి. కానీ, రాత్రీ, పగలు తేడా లేకుండా టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. వాహన సామర్థ్యం మేరకే రవాణా చేయాల్సి ఉండగా, రెండుమూడు రెట్లు ఓవర్‌లోడుతో వెళ్తుండటంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. మట్టివ్యాపారులు ఆడింది ఆట.. పాడిందిపాటగా మారింది.
చెరువుల మనుగడకు ముప్పు
చెరువులు, కుంటల్లో నీటి సంరక్షణ చర్య ల్లో భాగంగా చేపట్టిన పూడికతీత పనుల్లో పరిమితికి మించి లోతుగా తవ్వకాలు చేస్తుండటంతో చెరువుల మనుగడకు ముప్పుగా పరిణమిస్తుందని భూగర్భజల నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం సరైన విధానంలో పూడిక తీయాలి. కానీ పూడిక అధికంగా ఉన్న ప్రాం తంలో కాకుండా, అలుగుల వద్ద, చెరువు బండ్ వద్ద లోతుగా తవ్వకాలు చేస్తుండటం తో కట్టలు బలహీనపడి, కొన్నిసార్లు గండ్లు పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పైన పేరుకుపోయిన ఒండ్రును అడుగు, రెండు అడుగుల వరకు గరిష్ఠంగా మీటరు వరకు తవ్వకాలు మాత్రమే చేయాలి. కానీ, మట్టి వ్యాపారులు వారికి అనుగుణంగా అవసరమైన మట్టికోసం లోతుగా తవ్వకాలు చేస్తున్నారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని, త్వరగా చెరువునీరు ఒట్టిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చెరువు పడికకు గరిష్ఠంగా కేవలం ఒక మీటరు వరకు అనుమతించగా, మైనింగ్‌శాఖ మాత్రం ఏకంగా మొరం మట్టికి సైతం అనుమతులు మంజూరు చేయడం విశేషం.
అనుమతులు కొన్నింటికే.. తవ్వకాలు ఎన్నింట్లోనో?
జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి ప్రారంభం నుంచి చెరువుల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), పోచంపల్లి, వలిగొండ, మోటకొండూరు, ఆలేరు మండలాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి చెరువులు, కుంటల్లో తవ్విన మట్టిని రంగారెడ్డి, మేడ్చల్, జిల్లాలోని ఇటుకబట్టీలకు విక్రయిస్తున్నారు. మొదట్లో కనీసం ఏమాత్రం నిబంధనలు పాటించకుండా తవ్వకాలు చేస్తున్న వ్యాపారులపై అధికారుల ఒత్తిడి పెరగడంతో నీటిపారుదల, మైనింగ్‌శాఖ నుంచి నామమాత్రపు అనుమతులు, కొద్దిపాటి పరిమాణానికి తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఐదు చెరువులు, కుంటల నుంచి మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని ఇరిగేషన్, మైనింగ్‌శాఖల అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా 25 నుంచి 30 చెరువుల వరకు మట్టి తవ్వకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువైన అక్రమ మట్టి వ్యాపారానికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఒకే కుంటకు రెండు శాఖల అనుమతులు
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలోని 157 సర్వేనెంబరులోని మల్వకుంటకు నీటిపారుదల, మైనింగ్‌శాఖ పోటీపడి మట్టితవ్వకాలకు అనుమతి ఇచ్చాయి. మైనింగ్‌శాఖ రెండు దఫాలుగా అనుమతులు ఇవ్వగా, నీటిపారుదలశాఖ మరో అనుమతి జారీ చేసింది. ఆ అనుమతులు సైతం ఈ ఏడాది మే 31, జూన్ 1వ తేదీకి ముగుస్తున్నట్టు మైనింగ్, నీటిపారుదలశాఖ జిల్లా అధికారులు తెలిపారు. కనీసం మట్టి తవ్వకాలకు మార్కింగ్, పర్యవేక్షణ చేసే నాథుడే లేకపోవడంతో రాత్రింబవళ్లు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. అనుమతించిన విస్తీర్ణం, పరిమాణానికి పలు రెట్లు ఎక్కువగా తవ్వకాలు చేస్తున్నా పర్యవేక్షించేవారే లేరు. దీంతో పోటీపడి మట్టితవ్వకాలు చేస్తూ సుమారు 30 వరకు టిప్పర్లు సరిహద్దున ఉన్న వ్యవసాయ భూముల నుంచి రాకపోకలు సాగించడంతో భూములు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో సదరు రైతులు సోమవారం కలెక్టర్ అనురాగ్‌జయంతికి ఫిర్యాదు చేయగా, క్షేత్రస్థాయి విచారణ చేసి నివేదిక అందజేయాలని ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డిని ఆదేశించారు.
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలో మట్టి దందా యఽథేచ్ఛగా కొనసాగుతోంది. చీకటిమామిడి గ్రామం మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. అక్రమ రవాణాదారులు పగలు, రాత్రి తేడా లేకుండా టిప్పర్లలో నల్ల మట్టిని పరిమితికి మించి ఇతర ప్రాంతాలకు తరిలిస్తూ పెద్దమొత్తంలో సొమ్మ చేసుకుంటున్నారు. మైనింగ్ అనుమతులను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా మట్టిని తరిలిస్తూ ఏకంగా ప్రభుత్వ ఖజానాకే గండికొడుతున్నారు. అక్రమ రవాణాదారలు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం, ఎర్రమట్టి, నల్లమట్టిని వివిధ ప్రాతాలకు బహిరంగంగా తరలిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో చీకటిమామాడి పరిసర ప్రాంతాలతో పాటు, తిరుమలగిరి, మర్యాల, రామలింగంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో గల ఇటుక బట్టీలకు వందల సంఖ్యలో టిప్పర్ లారీలతో చెరువు మట్టిని యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి మండలంలో చెరువు మట్టిని కాంట్రాక్టర్ తక్కువ ఖర్చుతో మైనింగ్ తీసుకుని అక్రమ రవాణాదారులతో మట్టిని అక్కడి నుంచి ఇక్కడికి అనుమతి లేని లారీలతో మట్టిని తరలిస్తూ ఒక్కో లారీ మట్టికి రూ.10వేల నుండి రూ.15వేల వరకు విక్రయిస్తున్నారు.
భయం భయంగా ప్రయాణం
నిత్యం మట్టిని తరిలిస్తున్నా టిప్పర్ లారీలతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. అతి వేగం,అఽధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. లారీల నుంచి వెలుబడే దుమ్ము, లారీ పైనుండి కింద పడే మట్టి పెల్లలతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. నల్లమట్టిని అనుమతులు ఇవిగో ..అంటూ మండలంలో ఇటికబట్టీలకు తరిలిస్తున్న నల్లమట్టికి అనుమతులు ఇవిగో అంటూ ఇరిగేషన్ శాఖ యాదగిరిగుట్ట మండలం మల్లాపుర్ గ్రామంలోని చెరువు మట్టిని తరలించేందుకు ఇచ్చిన అనుమతి పత్రం చూపిస్తూ, అనుమతికి మించి మట్టిరవాణా సాగిస్తున్నారు. మట్టిని రవాణా చేసే లారీల నంబర్స్‌గాని, లారీలో మట్టిని ఎంతామోతాదులో రవాణా చేసే వివరాలు, రవాణా చేసేసమయం లాంటివి లేకుండా ఉన్న ప్రతాలను చూపిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. అదివారం సెలవు రోజు కావడంతో సూమారు 50లారీలతో మట్టిని తరలించారు. రెవెన్యూ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు మండలంలోని రంగాపుర్, చీకటిమామిడి గ్రామాల్లో తహసీల్దార్ ఆదేశాల మేరకు గ్రామరెవెన్యూ అధికారులు 10 టిప్పర్ లారీలను ఆపగా ఒకటి, రెండు లారీలకు తప్ప మిగతా ఏ లారీలకు ఎలాంటి రవాణా అనుమతులు లేకున్నా వదిలిపెట్టినట్లు తెలుస్తుంది.
పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం:శ్రీనివా్‌సరావు, తహసీల్దార్, బొమ్మలరామారం
మండంలో జరుగుతున్న నల్లమట్టి రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలకు మండలంలో ఎక్కడా అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధుంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
మట్టి తవ్వకాల అనుమతులు పొడిగించేది లేదు: రవీందర్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ
జిల్లాలో చెరువుల పూడికతీతకు కేవలం ఐదు చెరువులు, కుంటలకే అనుమతులు ఇచ్చాం. వాటి గడువు సైతం జూన్ 1 తేదీతో ముగుస్తోంది. నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు చేస్తున్నట్టు ఫిర్యాదులతో పాటు వర్షాకాలం సమీపిస్తున్నందున అనుమతుల ను పొడిగించకుండా చర్యలు తీసుకుంటాం.