ఆర్డీవోలకు వినతి అంతంతే..
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:14 AM
ఆర్డీవో కార్యాలయాల్లో చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వస్తోంది. మే 4వ తేదీన ప్రారంభం కాగా కలెక్టరేట్‌లో మాదిరిగానే ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు.
మే 4 నుంచి డివిజన కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం
రెండు నెలలుగా అరకొరగా ప్రజల నుంచి అర్జీలు
ఆర్డీవో కార్యాలయాల్లో చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వస్తోంది. మే 4వ తేదీన ప్రారంభం కాగా కలెక్టరేట్‌లో మాదిరిగానే ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. అయితే ప్రజావాణిపై అవగాహన కల్పించకపోవడంతో అరకొర అర్జీలు వస్తున్నాయి. రెండు నెలల్లో మూడు ఆర్డీవో కార్యాలయాల్లో కలిపి 226 అర్జీలు మాత్రమే వచ్చాయి. కోదాడ ఆర్డీవో కార్యాలయంలో రెండు నెలల్లో 30 మాత్రమే వచ్చాయి.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం అర్జీలను ఇచ్చిన బాధితులు నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి సమస్య పరిష్కారం కాకపోగా కార్యాలయాల చుట్టూ తిరగడానికే సమయం వెచ్చించాల్సి వస్తోంది. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీ చేసుకున్నా మోక్షం లభించడం లేదు. స్వయంగా కలెక్టర్ సంబంధిత అర్జీలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. గ్రామాల నుంచి ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం సమయం, డబ్బు వెచ్చించి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోంది. స్థానికంగా సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తప్పనున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఇటీవల డివిజన కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని అమలుచేయాలని ఆదేశించింది. దీంతో మే 4వ తేదీ నుంచి ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తగ్గిన దూర, ఆర్థికభారం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డివిజన కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించింది. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకువస్తే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి సమస్యలు అయితే కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు ఇవ్వాల్సిఉంటుంది.
ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణతో ప్రజలకు దూరభారంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదే కోదాడ, హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లి అర్జీలు చేయడం సులభతరమవుతోంది.
రెండు నెల్లో 226 అర్జీలు
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లు ఉన్నాయి. ఈ ఆర్డీవో కార్యాలయాల్లో 2 నెలలుగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. వివిధ శాఖలకు సంబంధించి 226 అర్జీలు వచ్చాయి. సూర్యాపేట ఆర్డీవోకు 56అర్జీలు రాగా అందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 42, వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ, ఆర్టీఐ, భూముల సర్వేలకకు సంబంధించి ఒక్కటి చొప్పున, సీనియర్ సిటిజన యాక్టుకు సంబంధించి 8 అర్జీలు వచ్చాయి. ఇప్పటివరకు ఏడు అర్జీలను పరిష్కరించగా 49 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
కోదాడ ఆర్డీవోకు ప్రజావాణిలో 30 అర్జీలు రాగా 15 పరిష్కారమయ్యాయి. ఇంకా 15 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.
అవగాహన.. అర్జీలు కరువు
(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్)
హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కరువైంది. మే 4 నుంచి ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి ప్రారంభించగా ప్రతీ వారం 10 నుంచి 15 అర్జీలు మాత్రమే వస్తున్నాయి. ఇప్పటివరకు 140 అర్జీలు మాత్రమే వచ్చాయి. వాటిలో సుమారు 60అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారని చాలామందికి సమాచారం తెలియడంలేదు. అధికార యంత్రాంగం ‘ప్రజావాణి’పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించక ప్రజావాణికి మొగ్గుచూపడం లేదన్న విమర్శలుఉన్నాయి. వచ్చిన అర్జీల్లోనూ భూభారతి సమస్యలపైనే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు పింఛన్లు, రెవెన్యూ సమస్యలపై అర్జీలు వచ్చాయి.
పరిష్కారానికి కృషి చేస్తున్నాం
ఆర్డీవో కార్యాలయానికి వచ్చే అర్జీలను మండల అధికారులకు రిఫర్ చేస్తున్నాం. ప్రతీ అర్జీ పరిష్కారానికి కృషి చేస్తున్నాం. పరిష్కారాల మార్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నాం.
శ్రీనివాసులు, ఆర్డీవో, హుజూర్‌నగర్