Share News

రక్షణ దిమ్మెలు లేని లోలెవల్‌ కల్వర్టు

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:28 AM

యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని బొల్లేపల్లి - జంపల్లి గ్రామాల మధ్య లోలెవల్‌ కల్వర్టుకు రక్షణ దిమ్మెలు, కల్వర్టు ధ్వంసమై ఉండడంతో వాహనాదారులకు ప్రమాదం పొంచి ఉంది.

రక్షణ దిమ్మెలు లేని లోలెవల్‌ కల్వర్టు
రక్షణ దిమ్మెలు లేకపోవడంతోఇలా..

పొంచి ఉన్న ప్రమాదం

భువనగిరి రూరల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని బొల్లేపల్లి - జంపల్లి గ్రామాల మధ్య లోలెవల్‌ కల్వర్టుకు రక్షణ దిమ్మెలు, కల్వర్టు ధ్వంసమై ఉండడంతో వాహనాదారులకు ప్రమాదం పొంచి ఉంది. నాగిరెడ్డిపల్లి నుంచి జంపల్లి వెళ్లేందుకు మార్గమధ్యలోని బొల్లేపల్లి గ్రామ మధ్యలో కల్వర్టును 40 ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ప్రణాళికాబద్దంగా కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాకాలంలో మూసీ వాగు ఉధృతంగా ప్రవహించి లో తట్టు ప్రాంతమైన మూల మలుపు కల్వర్టుపై నుంచి మోకాలు లోతు వరద నీరు ప్రవహించడం.. అదే విధంగా రక్షణ దిమ్మెలే లేకపోవడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారిపై నాగిరెడ్డిపల్లి, బొల్లేపల్లి, జంపల్లి, రెడ్డినాయక్‌తండా, సూరేపల్లి, పచ్చర్లబోడు తండా, ఆకుతోట బావి తండా గ్రామాలకు ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. కల్వర్టుపై గుంతలు పూడ్చాలని, రక్షణ దిమ్మెలు ఏర్పాటు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ద్విచక్ర వాహనాదారులు ఈ కల్వర్టుపై నుంచి వెళుతూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సంఘటలను ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకుని కల్వర్టు ఎత్తు పెంచి రక్షణ దిమ్మెలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మూసీ వాగు వస్తే ప్రమాదం

-రావి హేమంత రెడ్డి, బొల్లేపల్లి గ్రామస్థుడు

మూసీ వాగు ఉధృతంగా ప్రవహించినట్లయితే బొల్లేపల్లి- జంపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై ఇరువైపులా రక్షణ దిమ్మెలు లేకపోవడం, కల్వర్టుపై గుంతలు ఏర్పడడం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని కల్వర్టు ఎత్తును పెంచడంతో పాటు రక్షణ దిమ్మెలు ఏర్పాటు చేసి, ప్రమాదాలు నివారించాలి.

నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతాం

-బాలరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ వలిగొండ సెక్షన

బొల్లేపల్లి- జంపల్లి గ్రామాల మధ్యన మూసీ వాగుకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు, కల్వర్టు మరమ్మతులకు గాను క్షేత్రస్థాయిలో సర్వే చేపడతాం. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపుతాం.

Updated Date - Jan 02 , 2026 | 12:28 AM