Share News

కరువులోనూ వరదలా..

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:32 AM

నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఈ ఏడాది రైతాంగానికి అండగా నిలిచింది.

 కరువులోనూ వరదలా..

ఎల్‌నినోలోనూ సాగునీరు అందించిన మూసీ

పూడికతో తగ్గిన ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం

కేతేపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఈ ఏడాది రైతాంగానికి అండగా నిలిచింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకప్రాజెక్టులు నీరులేక వెలవెలబోతున్న తరుణంలో 60ఏళ్ల క్రితం మూసీనదిపై సూర్యాపేట మండలం సోలిపేట వద్ద రెండు గుట్ట ల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. పూడిక బయటకు పంపేందుకు వీలుగా10స్కవర్‌గేట్లు, వరద నీటిని దిగువకు వదిలేందుకు 8క్రస్టుగేట్లు, 12రెగ్యులేటరీ గేట్లు 645 అడుగుల (4.46 టీఎంసీలు) నీటినిల్వ సామర్థ్యంతో రూపకల్పన చేసిన మూసీ ప్రాజెక్టు ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 30వేల ఎకరాల్లో వరి సాగుకు నీటిని అందిస్తోంది. ఆన్‌ఆఫ్‌ పద్ధతిన ఇప్పటికే మూడు విడతల నీటి విడుదల పూర్తికాగా నాలుగో విడత మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అనుసంధానమై ఉన్న చెరువులు, కుంటలు, కాల్వలకు రైతులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పంపుసెట్ల ద్వారా మరో 10వేల ఎకరాల్లో వానాకాలం పంటసాగవుతుం ది. వరంగల్‌ జిల్లాకు చెందిన రెండు వాగులు మూసీ ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వీటిలో జనగామ నుంచి వచ్చే బిక్కేరువాగు ప్రధానమైనది. బిక్కేరువాగు అర్వపల్లి మండలంలోని వర్ధమానుకోట వద్ద మూసీలో సంగమిస్తుంది. మూసీకి నీటివనరుగా ఉన్న ఆలేరువాగు తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామం వద్ద మూసీలో కలుస్తుంది. ప్రతిఏటా అక్టోబరు, నవంబరు మాసాల్లో వచ్చే వరదలతో ఈవాగుల ద్వారా వచ్చే నీటితో గతంలో మూసీ ప్రాజె క్టు పొంగిపొర్లేది. దశాబ్దకాలంగా హైదరాబాద్‌ నగరం నుంచి వెలువడే వృథా నీరు మూసీ నది ద్వారా దిగువన నిర్మితమైన మూసీ ప్రాజెక్టు చేరుతూ వస్తుంది. దీంతో మూసీ దాని ఉపనదులైన ఆలేరు, బిక్కేరు నదులతో నిమిత్తం లేకుండా వేసవిలోనూ ఈ ప్రాజెక్టు జలకళ సంతరించుకుని ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు అందిచేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ ఏడాది బిక్కేరు, ఆలేరు వాగుల ద్వారా మూసీ ప్రాజెక్టుకు వరద వచ్చిన దాఖలాలు లేవు. నిర్మించిన తొలినాళ్లలో నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూడెం, నల్లగొండ నియోజకవర్గాల్లోని 45వేల ఎకరాలకు సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీటిని అందించిన ప్రాజెక్టు పూడికతో నిండి నేడు కేవలం 30వేల ఎకరాలకు సైతం నీటిని అందించలేని స్థితికి చేరింది.

కుడి కాల్వ పరిధి

34 కిలోమీటర్ల పొడవున ప్రవహించే మూసీ కుడికాల్వద్వారా 14,770 ఎకరాలకు సాగునీరు అందుతుం ది. ఈకాల్వ పరిధిలో నకిరేకల్‌ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలో తొమ్మిది గ్రామాలు,మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో ఏడు గ్రామాలు,నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మం డలంలో రెండు గ్రామాలకు సాగునీరు అందుతుంది.

ఎడమ కాల్వ పరిధి

42 కిలోమీటర్ల పొడవు ప్రవహించే మూసీ ఎడమ కాల్వ 15,230 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. దీనిపరిధిలో సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలంలో రెండు గ్రామాలు, పెన్‌పహాడ్‌ మండలంలో మూడు గ్రామాలు, సూర్యాపేట మండలంలో 16గ్రామాలకు సాగునీటి సరఫరా జరుగుతుంది.

యాసంగికి నీటి విడుదలపై సందిగ్ధత

వాతావరణ పరిస్థితుల్లోనూ వానాకాలం సీజన్‌లో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించిన మూసీ ప్రాజెక్టు వచ్చే యాసంగికి సాగునీటిని అందిస్తుందా! అన్న మీమాంస నెలకొంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఆయకట్టుకు ఇప్పటివరకు మూడు విడతల్లో విడుదల చేసిన నీరు 13.65అడుగులు(2.819టీఎంసీలు)గా ఉంది. చివరి తడిగా మరో 10రోజుల పాటు నీటి విడుదల చేయాల్సి ఉంది. యాసంగి సీజన్‌లో సాధారణ పరిస్థితుల్లోనైతే 30వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగుకు నీటిని అందించేందుకు 3-4టీఎంసీల నీరు అవసరమయ్యేదని తెలుస్తోంది.

ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంలో ఉన్న అధిక వేడి వల్ల నీరు ఎక్కువగా ఆవిరైపోతుందని దీంతో యాసంగిలో వరి సాగుకు నీటిని అందించాల్సి వస్తే 5టీఎంసీలపైనే నీరు అవసరమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయకట్టులోని 30వేల ఎకరాల్లో యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేసినా ఎల్‌నినో ప్రభావంతో నాలుగు టీఎంసీల నీరు అందుబాటులో ఉండాలని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత వానాకాల సీజన్‌కు వినియోగించగా ప్రాజెక్టులో మిగిలే 2-3టీఎంసీల నీటితో ఆయకట్టుకు సాగునీటిని అందించడం కష్టతరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 645అడుగులు(4.46టీఎంసీలు) నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 639.60అడుగులు(3.12టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు 624.92క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఇన్‌ఫ్లో నిలిచింది.

వేదిస్తోన్న సిబ్బంది కొరత

ప్రాజెక్టుపై ఉన్న వారిలో రిటైర్‌మెంట్లు తప్ప కొత్త నియామకాలు లేవు. దీంతో ప్రాజెక్టు ప్రధాన కాల్వలపై గల డిసి్ట్రబ్యూటరీలకు నీటి సరఫరాను నియంత్రించే వారే లేకుండా పోయారు. ప్రాజెక్టుపై 89మంది సిబ్బంది ఉండాల్సి ఉన్నా ఏఈతో కలిపి కేవలం 24మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. వీరిలో 52మంది గ్యాంగ్‌మన్‌లకుగాను 16మంది మాత్రమే ఉన్నారు. పెట్రోలింగ్‌కు ఉండాల్సిన ముగ్గురిలో ఒక్కరూ లేరు. ఆరుగురు వర్క్‌ ఇనస్పెక్టర్లకు గాను ఇద్దరే ఉన్నారు. ఇద్దరు హెల్పర్లు ఉండాల్సి ఉన్నా ఒక్కరే ఉన్నారు. ఒక్క ఫిట్టరు ఉండగా డయ్యరు, సిగ్నల్‌మెన్‌ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి.

పూడికతో తగ్గిన నీటినిల్వ సామర్థ్యం

రిజర్వాయర్‌లో ప్రతిఏటా పేరుకుపోతున్న పూడికతో మూసీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గుతోం ది. 4.46 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల ఈ ప్రా జెక్టులో 10అడుగుల మేర పూడిక పేరుకు పోయింద ని నిపుణులు గతంలోనే అంచనా వేశారు. ప్రాజెక్టు స్కవర్‌గేట్లు పూర్తిగా సీజ్‌ చేయడంతో ఏటా వరదనీటితో వచ్చే పూడిక రిజర్వాయర్‌లో పేరుకు పో తుంది. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు నానాటికీ తగ్గిపోతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూ డెం, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు చెందిన 33వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా కొన్నేళ్ళుగా ప్రాజెక్టులో చేరిన పూడికతో అది కాస్త 30వేల ఎకరాల దిగువకు పడిపోయింది.

Updated Date - Oct 13 , 2026 | 12:32 AM